Manish Sisodia arrest : ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఐదు రోజుల రిమాండ్‌ను విధించింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. ఫలితంగా.. మార్చ్ 4వ తేదీ వరకు మనీశ్ సిసోడియా సీబీఐ కస్టడీలోనే ఉండనున్నారు.
2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మద్యం విధానాన్ని కొట్టివేశారు. కాగా ఈ కేసులో సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం దాదాపు 8 గంటల పాటు సిసోడియాను విచారించింది సీబీఐ. సరైన సమాధానాలు ఇవ్వడం లేదంటూ ఆయన్ని ఆదివారం అరెస్ట్ చేసింది. సోమవారం ఢిల్లీలోని ప్రత్యేక సీబీఐ న్యాయస్థానంలో హాజరుపరిచింది.
Manish Sisodia CBI custody : సోమవారం ఉదయం ఇరుపక్షాల వాదనలను విన్న స్పెషల్ జడ్జీ ఎంకే నాగ్‌పాల్.. తన ఆదేశాలను రిజర్వ్‌లో పెట్టారు. అనంతరం సాయంత్రం ఆదేశాలను ప్రకటించారు. మనీశ్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించారు.
తమ ప్రశ్నలకు మనీశ్ సిసోడియా తప్పించుకునే విధంగా సమాధానాలిచ్చినట్టు కోర్టుకు తెలిపింది సీబీఐ. లిక్కర్ పాలసీ తొలి డ్రాఫ్ట్‌లో లేని ఆరు వివాదాస్పద నిబంధనలను వివరించడంలో ఆయన విఫలమైయ్యారని పేర్కొంది. లిక్కర్ లాబీ కోరికల మేరకు సవరణలు చేయడంతో కనీసం రూ. 100కోట్లు విలువ చేసే నిధులు అక్రమంగా చేతులు మారినట్టు ఆరోపించింది.
Manish Sisodia arrest news : వీటిపై మనీశ్ సిసోడియా తరఫు న్యాయవాదులు మండిపడ్డారు. "సీబీఐ.. మనీశ్ సిసోడియాపై ఒత్తిడి తీసుకొస్తోంది. అధికారుల అభిప్రాయాలకు తగ్గట్టు ఆయన జవాబులు చెప్పాలని భావిస్తున్నారు. అలా జరగకపోవడంతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు," అని సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ అన్నారు.
ఈ క్రమంలోనే 2021 మేలో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ లిక్కర్ పాలసీపై సంతకం పెట్టారని గుర్తుచేశారు దయన్ కృష్ణన్. ఆయన చెప్పిన సవరణలకు అంగీకరించి, అమలు చేసిన తర్వాత కూడా సీబీఐ ఇలాంటి ఆరోపణలు చేస్తుండటం గమనార్హం అని పేర్కొన్నారు.
Manish Sisodia Delhi Liquor policy scam : మరోవైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు. ఢిల్లీ, బెంగళూరు, ఛండీగఢ్, భోపాల్‌తో పాటు ఇతర కీలక నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. రోడ్ల మీదకొచ్చి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆప్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని 10-15 బస్సులో అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారు.
టాపిక్