Disney Layoff: 7,000 మంది ఉద్యోగులకు డిస్నీ ఉద్వాసన.. కారణమిదే!-disney to layoff 7000 employees to cut cost ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Disney Layoff: 7,000 మంది ఉద్యోగులకు డిస్నీ ఉద్వాసన.. కారణమిదే!

Disney Layoff: 7,000 మంది ఉద్యోగులకు డిస్నీ ఉద్వాసన.. కారణమిదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 09, 2023 01:54 PM IST

Disney Layoffs: లేఆఫ్స్ ట్రెండ్‍లోకి డిస్నీ కూడా వచ్చేసింది. 7,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది.

Disney Layoff: 7,000 మంది ఉద్యోగులకు డిస్నీ ఉద్వాసన.. కారణమిదే!
Disney Layoff: 7,000 మంది ఉద్యోగులకు డిస్నీ ఉద్వాసన.. కారణమిదే! (REUTERS)

Disney Layoff: దిగ్గజ ఎంటర్‌టైన్‍మెంట్ సంస్థ, స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్ డిస్నీ (Disney) కూడా ఉద్యోగాల కోత మొదలుపెట్టింది. ఇటీవల భారీ సంస్థలు వేలాది మంది ఉద్యోగులకు షాక్ ఇస్తుండగా.. ఇప్పుడు ఈ జాబితాలోకి డిస్నీ కూడా వచ్చేసింది. ఏకంగా 7,000 మంది ఎంప్లాయిస్‍ను తొలగించనున్నట్టు ప్రకటించింది. గత సంవత్సరం డిస్నీ సీఈవోగా మరోసారి బాధ్యతలు తీసుకున్న బాబ్ ఇగర్ ఈ భారీ నిర్ణయాన్ని తీసుకున్నారు. డిస్నీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‍ఫామ్‍కు సబ్‍స్క్రైబర్లు తగ్గుతుండడం సహా మరిన్ని కారణాల వల్ల డిస్నీ.. ఉద్యోగుల తొలగింపును చేపట్టింది. పూర్తి వివరాలు ఇవే.

కారణాలివే..

Disney Layoff: డిస్నీ స్ట్రీమింగ్ సర్వీస్‍‍కు సబ్‍స్క్రైబర్ల సంఖ్య గత మూడు నెలల్లో క్షీణించింది. కిందటి క్వార్టర్ కంటే తర్వాతి త్రైమాసికంలో యూజర్లు తక్కువగా యాడ్ కావడం డిస్నీకి ఇదే తొలిసారి. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 31 నాటికి డిస్నీ స్ట్రీమింగ్ సర్వీస్‍కు 16.81 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఒక శాతం యూజర్లు తగ్గారు. మరోవైపు హులు (Hulu), ఈఎస్‍పీఎన్ వృద్ధి కూడా ఆశించినంత నమోదు కాలేదు. దీంతో నాలుగో క్వార్టర్‌లో సుమారు 1బిలియన్ డాలర్ల వరకు ఆదాయాన్ని డిస్నీ కోల్పోయింది. ఆర్థిక మాంద్యం భయాలు కూడా వెంటాడుతున్నాయి. దీంతో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగాల తొలగింపునకే డిస్నీ సిద్ధమైంది. 7000 మందిని తీసేయనున్నట్టు ప్రకటించింది. 3.6 శాతం సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు పేర్కొంది. కంపెనీ పునర్వవస్థీకరణ కోసం తప్పడం లేదని చెప్పింది.

2021 వార్షిక రిపోర్ట్ ప్రకారం, డిస్నీలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 1 లక్షల 90 వేల మంది ఉద్యోగులు ఇన్నారు. ఇందులో 80 శాతం మంది ఫుల్ టైమ్ ఉద్యోగులు.

కఠిన నిర్ణయమే..

Disney Layoff: తాను ఈ నిర్ణయాన్ని అంత సులువుగా తీసుకోలేదని సీఈవో ఇగెర్ పేర్కొన్నారు. “అంత సులభంగా తీసుకున్న నిర్ణయం కాదిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగుల టాలెంట్, అంకిత భావం పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది” అని తెలిపారు.

మరోవైపు డిస్నీకి పోటీగా ఉన్న నెట్‍ఫ్లిక్స్ కోలుకుంటోంది. రెండు సంవత్సరాలుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న నెట్‍ఫ్లిక్స్ తాజాగా మళ్లీ పుంజుకుంటోంది. పాస్ వర్డ్ షేరింగ్‍ను కట్టడి చేయడం, కొత్త ప్లాన్‍లను తీసుకురావడం ఆ సంస్థకు లాభిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కెనడా, పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లో పాస్ వర్డ్ షేరింగ్‍ను నెట్‍ఫ్లిక్స్ కట్టడి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే దీన్ని అమలు చేయనుంది.

గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, ఐబీఎం, డెల్, జూమ్ సహా పదుల సంఖ్యలో సంస్థలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇప్పుడు డిస్నీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది.

సంబంధిత కథనం