Dell Layoff: 6వేల మందికిపైగా ఉద్యోగులను తీసేయనున్న డెల్.. కారణం ఇదే!-dell to layoff 6650 employees due to low demand for pcs worldwide ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Dell Layoff: 6వేల మందికిపైగా ఉద్యోగులను తీసేయనున్న డెల్.. కారణం ఇదే!

Dell Layoff: 6వేల మందికిపైగా ఉద్యోగులను తీసేయనున్న డెల్.. కారణం ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 06, 2023 05:33 PM IST

Dell Layoff: పర్సనల్ కంప్యూటర్ల (PCs) తయారీ సంస్థ డెల్ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 5 శాతాన్ని తగ్గించుకోనుంది.

Dell Layoff: 6వేల మందికి పైగా ఉద్యోగులను తీసేయనున్న డెల్.. కారణం ఇదే!
Dell Layoff: 6వేల మందికి పైగా ఉద్యోగులను తీసేయనున్న డెల్.. కారణం ఇదే! (Getty Images via AFP)

Dell Layoff: ప్రముఖ కంపెనీ డెల్ టెక్నాలజీస్ (Dell Technologies) కూాడా వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తీసివేస్తుండగా.. ఈ జాబితాలోకి (Layoff Trend) డెల్ కూడా వచ్చి చేరింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రముఖ పర్సనల్ కంప్యూటర్ల (Personal Computers - PCs) తయారీ సంస్థ డెల్ (Dell Job Cuts) ప్రణాళిక రచించుకుంది. 6,650 మంది ఉద్యోగులను డెల్ టెక్నాలజీస్ తొలగించనుందని బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా డెల్ సంస్థలో 1.2లక్షలకు పైగా ఉద్యోగులు ఉండగా.. ఐదు శాతం మందిని తీసేయనుందని వెల్లడించింది. పూర్తి వివరాలివే..

అందుకే తీసివేత

Dell Layoff: ప్రస్తుతం మార్కెట్‍లో కఠిన పరిస్థితిని కంపెనీ ఎదుర్కొంటోందని, భవిష్యత్తులో అనిశ్చితికి ఇది కారణమవుతోందని డెల్ కో-చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ చెప్పినట్టు బ్లూమ్‍బర్గ్ రిపోర్ట్ వెల్లడించింది. “ఇంతకు ముందు కూడా గడ్డు ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొన్నాం. అయితే మళ్లీ బలం పుంజుకున్నాం” అని ఉద్యోగులకు రాసిన నోట్‍లో క్లార్క్ పేర్కొన్నట్టు తెలిసింది. మళ్లీ మార్కెట్‍ సజావుగా ఉన్నప్పుడు తాము మళ్లీ సిద్ధంగా ఉంటామని అందులో ఆయన తెలిపారని సమాచారం. అంటే ఇప్పటికి తొలగింపు ఉన్నా.. మళ్లీ అవకాశం కల్పిస్తామనేలా ఆయన సంకేతాలు ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభించిన 2020లోనూ కొందరు ఉద్యోగులను డెల్ తొలగించింది. ఇప్పుడు మరోసారి వేటు వేసేందుకు సిద్ధమైంది.

డిమాండ్ తగ్గటంతో..

Dell Layoff: పర్సనల్ కంప్యూటర్లకు (డెస్క్‌టాప్‍, ల్యాప్‍టాప్‍) ప్రపంచవ్యాప్తంగా ఇటీవల డిమాండ్ తగ్గింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (IDC) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. డెల్‍కు 55 శాతం ఆదాయం కంప్యూటర్లు, ల్యాప్‍టాప్‍ల విక్రయం ద్వారానే వస్తుంది. ఈ ఆదాయం తగ్గటంతో ఉద్యోగులను తగ్గించుకునేందుకే డెల్ నిర్ణయించుకుంది.

కాగా, 6000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గతేడాది నవంబర్‌లో హెచ్‍పీ కూడా ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్లకు డిమాండ్ తగ్గడమే ఇందుకు కూడా కారణంగా ఉంది.

Tech Layoffs: దిగ్గజ టెక్ సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‍బుక్‍తో పాటు అమెజాన్ కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే చాలా కంపెనీలు కూడా ఇదే బాటపట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గత రెండు నెలల్లోనే ప్రముఖ సంస్థలు లేఆఫ్ చేసిన ఉద్యోగుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‍ఫామ్ ట్విట్టర్ కూడా గతేడాది దాదాపు 4000 మంది ఉద్యోగులను తొలగించింది.

Whats_app_banner

సంబంధిత కథనం