Actor Darshan In Jail : సెలబ్రిటీలు జైలులో ఉంటే అంతే మరి.. నటుడు దర్శన్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్!-darshan renuka swamy case special treatment to kannada actor darshan in prison seven officers suspended ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Actor Darshan In Jail : సెలబ్రిటీలు జైలులో ఉంటే అంతే మరి.. నటుడు దర్శన్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్!

Actor Darshan In Jail : సెలబ్రిటీలు జైలులో ఉంటే అంతే మరి.. నటుడు దర్శన్‌కు స్పెషల్ ట్రీట్‌మెంట్!

Anand Sai HT Telugu
Aug 26, 2024 01:04 PM IST

Actor Darshan : జైలుకు వెళితే అక్కడ పరిస్థితుల గురించి ఆలోచించే చాలా మంది భయపడుతుంటారు. కానీ సెలబ్రిటీల విషయానికి వచ్చేసరికి ట్రీట్‌మెంట్ స్పెషల్‌గా ఉంటుందని బయట టాక్. దానికి తగ్గట్టుగానే తాజాగా ఓ ఫోటో వైరల్ అవుతోంది. కన్నడ నటుడు దర్శన్‌ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంది.

జైలులో నటుడు దర్శన్
జైలులో నటుడు దర్శన్

బెంగుళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా ఉన్న ఫోటో, వీడియో వైరల్ అయింది. హాయిగా కుర్చీలో కూర్చొని పక్కనే కొందరితో దర్శన్ ముచ్చటిస్తున్నాడు. ఈ ఘటనతో ఏడుగురు బెంగళూరు జైలు అధికారులు సస్పెండ్ అయ్యారు.

దర్శన్‌తో సహా మరో ముగ్గురు రిలాక్స్‌గా, కాఫీ తాగుతూ, సిగరెట్ తాగుతున్నట్లు చూపుతున్న చిత్రం వైరల్ అయింది. జైలు భద్రతా ప్రోటోకాల్‌లు, ఖైదీకి అందిస్తున్న రాజభోగాల గురించి తీవ్రమైన విమర్శలు వచ్చాయి. 'పోలీసులు అక్కడికి వెళ్లి విచారించారు. ప్రాథమిక విచారణలో ఏడుగురు అధికారుల ప్రమేయం ఉందని గుర్తించి వారిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మేం ఈ విషయంపై మరింత దర్యాప్తు చేస్తున్నాం. ఇది తీవ్రమైన భద్రతా లోపం.' అని కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర్ అన్నారు.

సస్పెండ్ అయిన వారిలో జైలర్లు శరణ్ బసప్ప అమింగడ్, ప్రభు ఎస్ ఖండేల్వాల్, అసిస్టెంట్ జైలర్లు ఎల్ఎస్ కుప్పేస్వామి, శ్రీకాంత్ తల్వార్, హెడ్ వార్డర్ వెంకప్ప, సంపత్ కుమార్, వార్డర్ కె బసప్ప ఉన్నారు.

రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో దర్శన్, పవిత్ర గౌడతో సహా మరో 16 మంది ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దర్శన్ సెలబ్రిటీ హోదా కారణంగా ఈ కేసు బాగా వైరల్ అయింది. అయితే తాజాగా వీరికి జైలులో అందుతున్న రాచమర్యాదలకు సంబంధించిన ఫోటో వైరల్‌గా మారింది. ఈ సంఘటన విమర్శలకు దారితీసింది. జైలులో ప్రముఖులు, సాధారణ ఖైదీలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రశ్నిస్తున్నారు.

తన అభిమాని రేణుకాస్వామిని హత్య చేశాడనే ఆరోపణలతో దర్శన్ కస్టడీలో ఉన్నాడు. అతడిని దారుణంగా కొట్టి చంపారు. కల్వర్ట్‌లో శవాన్ని పడేశారు. ఈ కేసులో కొందరిని అరెస్టు చేసి విచారించగా దర్శన్ పేరు బయటకు వచ్చిందని పోలీసులు గతంలో చెప్పారు. నటి పవిత్ర గౌడ గురించి సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడంతో దర్శన్ ఈ పని చేయించాడని అంటున్నారు. నిజానికి దర్శన్‌కు రేణుకాస్వామి వీరాభిమాని. దర్శన్, విజయలక్ష్మి కుటుంబంలో పవిత్ర గౌడ చిచ్చుపెట్టిందని ద్వేషంతో రేణుకాస్వామికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడని చెబుతారు. దీంతో కోపం వచ్చిన దర్శన్.. అభిమానిని చంపించాడని ఆరోపణలు ఉన్నాయి.