Haryana Assembly Elections : కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు.. హర్యానాలో ఐదు సీట్లకు ఆప్ ఓకే!-congress and aap alliance in haryana seats sharing decided may announcement on monday ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Haryana Assembly Elections : కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు.. హర్యానాలో ఐదు సీట్లకు ఆప్ ఓకే!

Haryana Assembly Elections : కాంగ్రెస్‌తో పొత్తు చర్చలు.. హర్యానాలో ఐదు సీట్లకు ఆప్ ఓకే!

Anand Sai HT Telugu
Sep 08, 2024 09:33 PM IST

Haryana Assembly Elections : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తుపై చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. హర్యానాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పొత్తును సోమవారం ప్రకటించే అవకాశం ఉంది.

రాహుల్ గాంధీ, కేజ్రీవాల్
రాహుల్ గాంధీ, కేజ్రీవాల్

హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తుపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. హర్యానాలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ అంగీకరించింది. పొత్తుపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆప్‌తో కాంగ్రెస్ పొత్తుపై కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ దీపక్ బబారియా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ సీట్ల విషయంలో రాజీపడిందా లేదా అనేది అనేది త్వరలోనే నిర్ణయిస్తామని చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడారు. 'రెండు పార్టీల మధ్య పొత్తుపై ఆశ ఉంది. మేం ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తున్నాం, కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటోంది అనే విషయాలు చర్చిస్తున్నాం. ఏకాభిప్రాయం కుదిరితే దాన్ని బహిరంగంగా వెల్లడిస్తాం.' అని తెలిపారు.

అయితే జింద్, కలైత్, పానిపట్ రూరల్, పెహోవా, ఓల్డ్ ఫరీదాబాద్, గురుగ్రామ్ స్థానాలను కాంగ్రెస్ నుంచి ఆప్ డిమాండ్ చేయగా కాంగ్రెస్ 5 సీట్లు ఇచ్చేందుకు అంగీకరించిందని సమాచారం.

రెండు పార్టీల మధ్య మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని రాఘవ్ చద్దా అన్నారు. పొత్తుల చర్చలు రోజంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని పేర్కొన్నారు. ఇరు పార్టీల నేతల మధ్య సమావేశాలు జరుగుతున్నాయని, ఏ క్షణంలోనైనా పొత్తు ప్రకటన వెలువడవచ్చని చెప్పారు.

పొత్తు ఉంటుందా లేదా అనే సందేహం చాలా రోజులుగా ఉండడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుపై చాలా మంచి వాతావరణంలో చర్చలు జరుగుతున్నాయని రాఘవ్ చద్దా అన్నారు. హర్యానా ప్రజల ప్రయోజనాల దృష్ట్యా రెండు పార్టీలు అన్ని రకాల విషయాలను పక్కన పెట్టి కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. సీట్ల సంఖ్య, సీట్ల పేర్లపై కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. నామినేషన్‌కు సెప్టెంబర్ 12 చివరి తేదీ అన్న ప్రశ్నకు రాఘవ్ సమాధానమిస్తూ.. అంతకంటే ముందే ఇరు పార్టీలు నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.

మరోవైపు హర్యానా ఎన్నికల నేపథ్యంలో పార్టీని తక్కువ అంచనా వేసిన వారు పశ్చాత్తాపపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ హెచ్చరించింది. హర్యానా ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పూర్తి బలంతో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆప్ జాతీయ కార్యదర్శి (ఆర్గనైజేషన్) సందీప్ పాఠక్ మీడియా సమావేశంలో తెలిపారు. పూర్తి బలంతో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిచోటా, ప్రతి సీటులోనూ మమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు భవిష్యత్తులో పశ్చాత్తాపపడతారని అన్నారు. అయితే సందీప్ పాఠక్ కాంగ్రెస్‌తో పొత్తు, ప్రస్తుత చర్చల అవకాశాలను తోసిపుచ్చలేదు.