Vinesh Phogat: హర్యానా అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ తరఫున వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా పోటీ చేయడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. హర్యానాలోని జులానా నుంచి ఫోగట్ ను, బద్లీ నుంచి పునియాను కాంగ్రెస్ బరిలో నిలపనుందని సమాచారం. వీరి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సీఈసీ త్వరలోనే ఖరారు చేయనుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్ జులానా స్థానం నుండి, బజరంగ్ పూనియా బద్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం ఉంది. బుధ, గురువారాల్లో వీరి పేర్లను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే వీరి అభ్యర్థిత్వంపై ప్రకటన వెలువడే అవకాశం ఉందని కాంగ్రెస్ తెలిపింది.
రాహుల్ గాంధీతో భేటీ
బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. బద్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. కానీ, జులానా నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జననాయక్ జనతా పార్టీకి చెందిన అమర్జీత్ ధండా గెలుపొందారు. జులానా స్థానం నుంచి పోటీ చేయాలని వినేశ్ ఫోగట్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. కానీ, ఆమెను గుర్ గ్రామ్ కు దగ్గరగా ఉన్న స్థానం నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ భావిస్తోంది.
అధికారిక ప్రకటన కోసం ఎదురుచూపు
ప్రముఖ అంతర్జాతీయ రెజ్లర్లైన పునియా, ఫొగట్ లను బరిలోకి దింపుతారా లేదా అనే విషయంపై కాంగ్రెస్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై గురువారం నాటికి స్పష్టత ఇస్తామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి హర్యానా ఇంచార్జ్ దీపక్ బబారియా మంగళవారం చెప్పారు. ఫోగట్, పునియాతో కలిసి ఉన్న రాహుల్ గాంధీ ఫోటోను కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
లైంగిక వేధింపులపై పోరాటం
లైంగిక వేధింపులపై బీజేపీ నేత కు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పూనియా పాల్గొన్నారు. ఇటీవల అంతర్జాతీయ వేదికపై 50 కేజీల గోల్డ్ మెడల్ బౌట్ నుంచి అనర్హత వేటు పడిన మరుసటి రోజే వినేశ్ ఫోగట్ క్రీడాకారిణిగా రిటైర్మెంట్ ప్రకటించింది. ఫోగట్ నిర్ధారిత బరువు కన్నా 100 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు గుర్తించడంతో ఆమెను ఫైనల్స్ కు అనర్హురాలిగా ప్రకటించారు.
క్రియాశీల రాజకీయాల్లోకి
స్వదేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆమె తన బంధువు, బీజేపీ ఎమ్మెల్యే అయిన బబిత మాదిరిగా క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన లోక్ సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలతో సీట్ల పంపకాల కోసం రాష్ట్ర పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ అజయ్ మాకెన్, హర్యానా ఎఐసిసి ఇంచార్జ్ దీపక్ బబారియా, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాలతో కూడిన త్రిసభ్య కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.