Vinesh Phogat : ‘వెనకడుగు వేసేదే లేదు’- హరియాణా ఎన్నికల బరిలో వినేశ్ ఫోగట్
Vinesh Phogat Congress : వినేశ్ ఫోగట్ హరియాణా ఎన్నికల బరిలో నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొన్ని గంటల్లోనే, ఆమెను జులానా నియోజకవర్గం నుంచి బరిలో దింపింది కాంగ్రెస్ పార్టీ.
మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభించారు. మరో ప్రముఖ రెజ్లర్ బజ్రంగ్ పునియాతో కలిసి హరియాణా ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ వెంటనే వినేశ్ ఫోగట్‌ని హరియాణా ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి బరిలో దింపింది కాంగ్రెస్. ఈ మేరకు ఎన్నికల కోసం కాంగ్రెస్ విడుదల చేసిన 31 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో వినేశ్ ఫోగట్ పేరు కనిపించింది.
"దేశ ప్రజలకు, మీడియాకు నా ధన్యవాదాలు. నా రెజ్లింగ్ కెరీర్లో మీరు నాకు చాలా మద్దతిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి నా ధన్యవాదాలు. కఠిన సమయంలోనే మనతో ఎవరు ఉంటారో తెలుస్తుందని అంటూ ఉంటారు. మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్లినప్పుడు (రెజ్లర్ల నిరసనలు) బీజేపీ తప్ప అన్ని పార్టీలు మాకు అండగా నిలబడ్డాయి. మా కన్నీరు, మా బాధను అర్థం చేసుకున్నాయి. మేము భయపడము. వెనక్కి తగ్గేదే లేదు," అని వినేశ్ ఫోగట్ పేర్కొన్నారు.
30ఏళ్ల ఫోగట్ గతేడాది జరిగిన రెజ్లర్ల నిరసనల్లో క్రియాశీలకంగా పాల్గొన్న విషయం తెలిసిందే. రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్ సింగ్‌పై లైంగిక ఆరోపణల, రెజ్లర్లకు న్యాయం జరగాలంటూ జరిగిన నిరసనల్లో వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియాలు తమ శక్తికి మించి పోరాడారు.
ఇక 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల తేడాతో రెజ్లింగ్ ఫైనల్ నుంచి బయటకి వచ్చి, గోల్డ్ మెడల్ని దూరం చేసుకున్న తర్వాత క్రీడకు వినేశ్ ఫోగట్ గుడ్‌బై చెప్పారు. కానీ ఇంత త్వరగా రాజకీయాల్లో చేరతారని ఎవరూ ఊహించలేదు.
"నేను కొత్త ఇన్నింగ్స్‌ని ప్రారంభిస్తున్నాను. మేము అనుభవించిన కష్టాలు, బాధలను ఇతర క్రీడాకారులు అనుభవించకూడదు," అని వినేశ్ ఫోగట్ అన్నారు.
2024 హరియాణా ఎన్నికలు..
హరియాణాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. అక్టోర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది. గర్హి సంప్లా-కిలోయ్ స్థానం నుంచి హరియాణా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాను పార్టీ బరిలోకి దింపింది. సోనిపట్ నుంచి సురేందర్ పన్వార్, గోహానా నుంచి జగ్బీర్ సింగ్ మాలిక్, రోహ్ తక్ నుంచి భరత్ భూషణ్ బాత్రాలకు టికెట్ ఇచ్చారు.
హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ హోడాల్ స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. లాడ్వాలో కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ హరియాణా ముఖ్యమంత్రి, బీజేపీ నేత నయాబ్ సైనీతో తలపడనున్నారు.
బద్లీ స్థానం నుంచి కుల్దీప్ వాతా, ఝజ్జర్ (ఎస్సీ రిజర్వ్డ్) నుంచి గీతా భుక్కల్, రేవారీ నుంచి చిరంజీవ్ రావు, నుహ్ నుంచి అఫ్తాబ్ అహ్మద్, ఫరీదాబాద్ నిట్ నుంచి నీరజ్ శర్మ బరిలో ఉన్నారు.
2024 హరియాణా ఎన్నికల్లో పోటీ కోసం ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ చర్చలు ఏ మేరకు ఫలితాల్ని ఇస్తాయో చూడాలి.
సంబంధిత కథనం