CBSE news: స్కూల్స్ లో ఎన్ సీ ఆర్ ఎఫ్ ను లాంచ్ చేయనున్న సీబీఎస్ఈ; ఇక ఈ క్లాస్ లకు క్రెడిట్స్ సిస్టమ్ అమలు
ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టుగా 6, 9, 11 తరగతుల విద్యార్థులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (National Credit Framework NCrF) ను ప్రారంభించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. ఎన్ఈపీ 2020 లో భాగంగా ఈ ఎన్సీఆర్ఎఫ్ (NCrF) ను రూపొందించారు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి 6, 9, 11 తరగతులకు నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ (NCrF) ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనుంది. ఇందులో పాల్గొనాలని అనుబంధ పాఠశాలలను సీబీఎస్ఈ ఆహ్వానించింది. పాఠశాల, ఉన్నత, వృత్తి విద్యను నిరంతరాయంగా ఏకీకృతం చేయడం, ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి పీహెచ్డీ స్థాయి వరకు విద్యార్థులు తమ క్రెడిట్లను కూడబెట్టుకునేందుకు వీలుగా జాతీయ విద్యా విధానం (NEP) 2020 అమలులో భాగంగా ప్రభుత్వం గత ఏడాది NCrF ను ప్రారంభించింది.
పైలట్ ప్రాజెక్టుగా..
ఆ తర్వాత సీబీఎస్ఈ కూడా ఈ ఫ్రేమ్ వర్క్ (NCrF) అమలుకు ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది. తమ అనుబంధ పాఠశాలలకు ఎన్సీఆర్ఎఫ్ అమలు మార్గదర్శకాల ముసాయిదాను కూడా సీబీఎస్ఈ (CBSE) పంపించింది. పలు దఫాలుగా చర్చించిన అనంతరం, ఆ ముసాయిదా విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిందని సీబీఎస్ఈ తెలిపింది. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో అనుబంధ పాఠశాలల్లో ఎన్సీఆర్ఎఫ్ ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తరగతుల్లో అమలు చేయాలని సీబీఎస్ఈ (CBSE) భావిస్తోంది. అందుకు గానూ, 024-2025 విద్యా సంవత్సరం నుంచి 6, 9, 11 తరగతులలో సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల్లో ఈ మార్గదర్శకాలను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ‘‘ఈ పైలట్ ప్రోగ్రామ్ కోసం ఆసక్తి ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ కాంటాక్ట్ వివరాలను లింక్ (https://forms.gle/5AB2iuxa1k62r2E3A) ద్వారా పంచుకోవాలని కోరుతున్నాము’’ అని సీబీఎస్ఈ తెలిపింది.
ఏమిటీ ఎన్సీఆర్ఎఫ్?
ప్రధానోపాధ్యాయులతో సీబీఎస్ఈ పంచుకున్న ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం.. పాఠశాల విద్య, ఉన్నత విద్య, వృత్తి విద్యలో క్రెడిట్ల కేటాయింపు కోసం మొత్తం నోషనల్ లెర్నింగ్ గంటలు (notional learning hours) సంవత్సరానికి 1200 గంటలుగా నిర్ణయించారు. దీని కోసం విద్యార్థులు / అభ్యాసకులకు 40 క్రెడిట్స్ (credits) ను ఇస్తారు. అంటే, 30 నోషనల్ లెర్నింగ్ గంటలు ఒక క్రెడిట్ తో సమానం అన్నమాట.
వీటితో క్రెడిట్స్ సంపాదించవచ్చు..
విద్యార్థులు 40 క్రెడిట్లకు మించి అదనపు కోర్సులు/ ప్రోగ్రామ్స్/ సబ్జెక్టులు/ ప్రాజెక్టులు తీసుకోవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. క్లాస్ రూమ్ టీచింగ్ లెర్నింగ్, ల్యాబొరేటరీ వర్క్, ప్రాజెక్ట్స్, స్పోర్ట్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఎన్సీసీ, సోషల్ వర్క్, ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ తో పాటు సంబంధిత అనుభవం, ప్రొఫెషనల్ లెవల్స్ ద్వారా విద్యార్థులు ఈ క్రెడిట్లు పొందవచ్చు.
డిజీ లాకర్ తో అనుసంధానం
విద్యార్థులు సంపాదించిన క్రెడిట్స్.. వారి పరీక్షల్లో పొందిన మార్కులు, గ్రేడ్లతో పాటు తుది పరీక్షల మార్కుల షీట్లు లేదా గ్రేడ్ కార్డులలో ప్రతిబింబిస్తాయి. విద్యార్థులు సంపాదించిన క్రెడిట్స్ ను విద్యార్థి అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (Academic Bank of Credit)లో జమ చేస్తామని, భవిష్యత్తులో విద్యార్థి ఏపీఏఆర్ ఐడీ (APAAR Id), డిజిలాకర్తో అనుసంధానం చేస్తామని బోర్డు తెలిపింది.
వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ
వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ కార్యక్రమం కింద ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (Automated Permanent Academic Account Registry APAAR) అనే ఆధార్ వెరిఫైడ్ ఐడీని ప్రభుత్వం ప్రారంభించింది. సీబీఎస్ఈ నిబంధనల ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం సీబీఎస్ఈ పరీక్ష ఉప నిబంధనల ప్రకారం 10, 12 తరగతులతో సహా సీనియర్ తరగతులకు ఇది తప్పనిసరి.
ఇలా అయితేనే పాస్
9వ తరగతిలో ఒక విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో (2 లాంగ్వేజెస్ + 3 మెయిన్ సబ్జెక్టులు) ఉత్తీర్ణత సాధించి క్రెడిట్స్ పొందడానికి అర్హత సాధిస్తేనే, ఆ విద్యార్థిని పాస్ గా ప్రకటిస్తారు. 11వ తరగతికి ప్రస్తుతం ఉన్న స్టడీ స్కీం ప్రకారం ఒక విద్యార్థి ఐదు సబ్జెక్టుల్లో (1 లాంగ్వేజ్ (కోర్) + 4 మెయిన్ సబ్జెక్టులు) ఉత్తీర్ణత సాధించి క్రెడిట్స్ పొందడానికి అర్హత సాధించాలి. 9, 11 తరగతుల్లో ఆరు నుంచి ఏడు సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థులు వరుసగా 47, 54 క్రెడిట్స్ పొందడానికి అర్హులవుతారు.