CBSE new rules: సీబీఎస్ఈ సంచలన ప్రతిపాదనలు; పదవ తరగతిలో 10 పేపర్లు, 12 వ తరగతిలో 6 పేపర్లు!
10 subjects in CBSE Class 10: 10వ తరగతి, 12 వ తరగతి సబ్జెక్టుల విషయంలో సీబీఎస్ఈ కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. ఈ రెండు తరగతుల్లో విద్యార్థులు ఇకపై ప్రస్తుతం ఉన్న ఐదు సబ్జెక్టులకు బదులుగా ఆరు సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల 10, 12 తరగతుల అకడమిక్ ఫ్రేమ్ వర్క్ లో గణనీయమైన మార్పులను ప్రతిపాదించింది. సీబీఎస్ఈ 10వ తరగతిలో ప్రస్తుతం విద్యార్థులు రెండు లాంగ్వేజెస్ ను చదువుతున్నారు. ఇకపై వారు 10వ తరగతిలో మూడు భాషలను నేర్చుకోవాలని, అందులో కనీసం రెండు భారతీయ భాషలు అయి ఉండాలని సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది.

10 సబ్జెక్టుల్లో పాస్ కావాలి..
అలాగే, ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు ఐదు సబ్జెక్టుల్లో పాస్ కావాల్సి ఉంది. ఇకపై వారు 10 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలని సీబీఎస్ఈ (CBSE) ప్రతిపాదిస్తోంది. అలాగే, 12వ తరగతిలో ప్రస్తుతం విద్యార్థులు ఒక లాంగ్వేజ్ చదువుతున్నారు. వారు ఇకపై రెండు లాంగ్వేజెస్ నేర్చుకోవాలని సీబీఎస్ఈ ప్రతిపాదిస్తోంది. ఆ రెండు భాషల్లో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని సూచిస్తోంది. అలాగే, 12వ తరగతి విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు బదులు ఇకపై ఆరు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని సీబీఎస్ఈ పేర్కొంది.
జాతీయ విద్యావిధానం 2020
పాఠశాల విద్యలో నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశ పెట్టే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వం.. సీబీఎస్ఈ నుంచి ఈ దిశగా ప్రతిపాదనలు కోరింది. దాంతో, సీబీఎస్ఈ ఈ ప్రతిపాదనలు చేసింది. జాతీయ విద్యావిధానం 2020 లో పేర్కొన్న విధంగా వృత్తి విద్య, సాధారణ విద్య మధ్య అకడమిక్ సమానత్వాన్ని సాధించడం ఈ ఫ్రేమ్ వర్క్ లక్ష్యం.
నేషనల్ లెర్నింగ్
సీబీఎస్ఈ తన ప్రతిపాదనల్లో 'నేషనల్ లెర్నింగ్' అనే పదాన్ని ఉపయోగించింది. ఇది నిర్దిష్ట అభ్యాస లక్ష్యాలను చేరుకోవడానికి ఒక సాధారణ అభ్యాసకుడికి అవసరమైన సమయాన్ని సూచిస్తుంది. ఒక విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలంటే, అతను లేదా ఆమె సంవత్సరంలో మొత్తం 1,200 అధ్యయన గంటలు పూర్తి చేయాలి. ప్రతి అంశానికి నిర్ణీత సంఖ్యలో గంటలు కేటాయిస్తారు. ఈ గంటలు అకడమిక్ టీచింగ్, పాఠ్యేతర లెర్నింగ్, నాన్-అకడమిక్ లెర్నింగ్ లను కవర్ చేస్తాయి.
అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్
అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ విద్యార్థులు సంపాదించిన క్రెడిట్లను డిజిటల్ గా రికార్డ్ చేస్తుంది. డిజిలాకర్ అకౌంట్ ద్వారా ఆ క్రెడిట్ల వివరాలను యాక్సెస్ చేయవచ్చు. విద్యార్థులు పొందే గ్రేడ్లతో పోలిస్తే ఈ క్రెడిట్లు 'స్వతంత్రంగా' ఉంటాయని సీబీఎస్ఈ అధికారిక డాక్యుమెంట్ పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, సెకండరీ, అప్పర్ స్కూల్ పాఠ్యాంశాలకు మరిన్ని సబ్జెక్టులను జోడించాలని సీబీఎస్ఈ సూచించింది. ఇందులో ప్రస్తుత సబ్జెక్టులకు అదనంగా ఒకేషనల్, ట్రాన్స్ డిసిప్లినరీ కోర్సులు కూడా ఉంటాయి. 10వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం ఉన్న ఐదు సబ్జెక్టులకు బదులుగా ఏడు ప్రధాన సబ్జెక్టులు, మూడు భాషలు కలిపి మొత్తం 10 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించాలి.
10వ తరగతిలో ఇకపై ఈ సబ్జెక్టులు
10వ తరగతి విద్యార్థులు చదవాల్సిన మూడు భాషల్లో రెండు భాషలు భారతదేశానికి చెందినవిగా ఉండాలి. అవి కాకుండా, గణితం, కంప్యూటేషనల్ థింకింగ్, సోషల్ సైన్స్, సైన్స్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ నెస్, ఒకేషనల్ ఎడ్యుకేషన్, ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ అనే ఏడు కీలక సబ్జెక్టులను పదో తరగతికి సిఫార్సు చేశారు.12 తరగతుల విద్యార్థులు ప్రస్తుతం ఉన్న ఐదు సబ్జెక్టులకు బదులుగా ఆరు సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒక భాష భారతీయ మాతృభాష అయి ఉండాలి.
టాపిక్