JNTUH: క్రెడిట్స్ ఆధారిత విధానంలో మార్పులు ఈ ఏడాది కూడా అమలు
JNTUH: క్రెడిట్స్ లేకున్నా మరుసటి సంవత్సరానికి ప్రమోట్ చేసేలా జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయం తీసుకుంది
క్రెడిట్స్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని మరో ఏడాది పక్కన పెట్టాలని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ-హెచ్) నిర్ణయించింది. నిర్దేశిత క్రెడిట్స్ లేకుంటే యూనివర్శిటీ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులను మరుసటి సంవత్సరానికి ప్రమోట్ చేయరు. అయితే కోవిడ్ - 19 నేపథ్యంలో విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారడంతో ఈ విధానాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో క్రెడిట్ ఆధారిత డిటెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేసేందుకు యూనివర్శిటీ నిర్ణయించింది. ఈ విధానంలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకెండ్ ఇయర్ వెళ్లాలంటే 60 శాతం క్రెడిట్స్ సాధించాలి. సెకెండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ వెళ్లాలంటే 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. అలాగే థర్డ్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ చేరాలంటే 50 శాతం క్రెడిట్స్ సాధించాలి.
కానీ విద్యార్థులు దీనిపై ఆందోళన వ్యక్తం చేయడంతో యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ కట్టా నర్సింహా రెడ్డి ఈ డిటెన్షన్ విధానాన్ని ప్రస్తుత సంవత్సరం కూడా నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ-హెచ్) రిజిస్ట్రార్ మంజూర్ హుసేన్ ఈమేరకు సర్క్యులర్ జారీచేశారు. 2020లో సవరించిన నిబంధనల ప్రకారం విద్యార్థులు మరుసటి సంవత్సరంలోకి ప్రమోట్ కావాలంటే 25 శాతం క్రెడిట్స్ సాధిస్తే సరిపోతుంది.
టాపిక్