Bengaluru murder: ‘‘నన్ను చంపాలని ప్లాన్ చేసింది.. అందుకే నేనే హత్య చేశా’’- మహాలక్ష్మి హత్య కేసు నిందితుడు
Bengaluru fridge horror: బెంగళూరులో ఒక యువతిని హత్య చేసి, ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో దాచిన కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ హత్య కేసులో నిందితుడు తాను ఆత్మహత్య చేసుకునేముందు రాసిన సూసైడ్ నోట్ లో సంచలన ఆరోపణలు చేశాడు.
Bengaluru fridge horror: బెంగళూరులో జరిగిన మహాలక్ష్మి హత్య కేసులో సంచలన అంశాలు వెల్లడవుతున్నాయి. ఆ హత్య కేసులో నిందితుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువకుడు సూసైడ్ నోట్ రాశాడు. ఆ నోట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆ నిందితుడు తనను తాను రక్షించుకోవడం కోసమే ఆమెను చంపానని వెల్లడించాడు.
నన్ను చంపాలని ప్లాన్ చేసింది..
‘‘నేను ఆమెను చంపకపోయి ఉంటే మహాలక్ష్మి నన్ను చంపేసేది’’ అని ఆ సూసైడ్ నోట్ లో రాశాడు. అందుకే తాను ఆమెను చంపేశానని వెల్లడించాడు. మహాలక్ష్మి తనను హత్య చేయాలని ప్లాన్ చేసిందని, మృతదేహాన్ని దాచడానికి నల్ల సూట్ కేస్ ను కూడా కొనుగోలు చేసిందని ఆ డెత్ నోట్ లో పేర్కొన్నాడు. ఫ్రిజ్ లో మహాలక్ష్మి మృతదేహం లభించిన అపార్ట్ మెంట్ లో ఆ ఫ్రిజ్ పక్కనే ఒక నల్లటి సూట్ కేస్ ను పోలీసులు గుర్తించారు. తనను చంపిన తర్వాత తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆ సూట్ కేసులో పెట్టి, ఆ తరువాత బయట పారవేయాలనేది ఆమె ప్లాన్ అని ఆ నిందితుడు తన డెత్ నోట్ లో రాశాడు. ‘‘నేను ఆమెను చంపకపోయి ఉంటే మహాలక్ష్మి నన్ను చంపి నా శవాన్నిముక్కలు, ముక్కలుగా చేసి, బయట పడేసేది. ఆత్మరక్షణ కోసమే ఆమెను చంపేశాను’’ అని వివరించాడు.
మహాలక్ష్మి హత్య కేసు వివరాలు
బెంగళూరులో సేల్స్ ఉమన్ ఉద్యోగం చేస్తున్న 29 ఏళ్ల మహాలక్ష్మి మృతదేహాన్ని సెప్టెంబర్ 21న, ఆమె నివాసం ఉంటున్న ఫ్లాట్ లోని రిఫ్రిజిరేటర్ లో గుర్తించారు. ఆ ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని, ఫ్రిజ్ లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు ఆమె మృతదేహాన్ని 59 ముక్కలుగా నరికి, ఫ్రిజ్ లో పెట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తరువాత కొన్ని రోజులకు, ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఒడిశాకు చెందిన ముక్తిరంజన్ ప్రతాప్ రే (31) ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఉన్న ధుసూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. సంఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్ లో తన భాగస్వామి మహాలక్ష్మిని హత్య చేసినట్లు అంగీకరించినట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.
స్నేహం, ప్రేమగా మారి..
ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్న సమయంలో ఆ వ్యక్తికి, మహాలక్ష్మికి పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం చివరికి ప్రేమగా మారిందని పోలీసుల విచారణలో తేలింది. పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మి ఒత్తిడి తెస్తుండడంతో తరచూ వారిమధ్య గొడవలు జరిగేవని పోలీసులు చెబుతున్నారు. ఒకరోజు క్షణికావేశంలో నిందితుడు మహాలక్ష్మిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయాన్ని నిర్ధారించారు.