Couple Suicide : ‘బిచ్చం ఎత్తుకుని తినండి,’ అని హింసించిన బిడ్డలు- వృద్ధ దంపతుల ఆత్మహత్య!
Rajasthan crime news : వృద్ధాప్యంలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన బిడ్డలు, వారిని చిత్రహింసలు పెట్టారు. ఆస్తి లాగేసుకుని, “బిచ్చం ఎత్తుకోండి, భోజనం పెట్టము,” అంటూ హింసించారు. చివరికి ఆ దంపతులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. రాజస్థాన్లో జరిగింది ఈ ఘటన.
రాజస్థాన్లో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది! సొంత బిడ్డలు చిత్రహింసలు పెట్టడంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. బిడ్డలు పెట్టిన చిత్రహింసలపై వారు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు దొరికింది. అందులోని విషయాలు తెలిసి చాలా మంది కంట తడి పెట్టుకుంటున్నారు!
వృద్ధ దంపతుల ఆత్మహత్య..
70ఏళ్ల హజారిరామ్ బిష్ణోయ్, ఆయన భార్య68ఏళ్ల చావలి దేవి రాజస్థాన్లోని నగౌర్లో నివాసముండేవారు. వారికి నలుగురు పిల్లలు. వారిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వృద్ధాప్య దశలో తల్లిదండ్రులను బాగా చూసుకోవాల్సిన కొడుకులు- కూతుళ్లు, ఆస్తి కోసం వారిని చిత్రహింసలకు గురిచేశారు.
కొడుకు రాజేంద్రం.. ఆ దంపతులను 3సార్లు దారుణంగా కొట్టాడు. ఇంకో కొడుకు సునీల్ కూడా 2 సందర్భాల్లో వృద్ధ దంపతులను చిత్రహింసలకు గురిచేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు, వారి భార్యలు హెచ్చరించారు.
దంపతుల పేరు మీద ఉన్న ఆస్తి కోసం వారి కుమారులను పలువురు బంధువులు ఉసిగొల్పారు. ఏం చేసైనా, ఆస్తిని తమ పేరు మీద రాయించుకోవాలని సలహాలు ఇచ్చారు. అప్పటి నుంచి పిల్లలు, తల్లిదండ్రులను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. అంతేకాదు దంపతులను మోసం చేసి వారి నుంచి కారు, 3 ఇళ్ల స్థలాలను బదిలీ చేయించుకున్నారు.
ఇదీ చూడండి:- USA crime News: 11 ఏళ్ల విద్యార్థికి 33 వేల అసభ్య సందేశాలు పంపిన టీచర్
దంపతుల నుంచి అన్నీ తీసుకున్న తర్వాత, వారికి భోజనం కూడా పెట్టేందుకు బిడ్డలు ఆసక్తి చూపలేదు! ప్రతి రోజు ఫోన్ చేసి తిట్టేవారు. "గిన్నె తీసుకో. ఆహారం కోసం అడుక్కో. నేను భోజనం పెట్టను. ఎవరికైనా చెబితే చంపేస్తాను," అని సునీల్ వారిని బెదిరించేవాడు.
బిడ్డలు పెడుతున్న హింసను తట్టుకోలేక ఆ వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. బిడ్డలు పెట్టిన చిత్రహింసలను రెండు పేజీల సూసైడ్ నోట్లో రాసి, ఇంటి గొడపై అతికించారు. అనంతరం తమ ఇంటిలో ఉన్న వాటర్ ట్యాంక్లో దూకి ప్రాణాలు తీసుకున్నారు.
హజారిరామ్ ఇంట్లో ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో స్థానికులు గురువారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులకు వాటర్ ట్యాంక్లో మృతదేహాలు లభించాయి. గోడ మీద సూసైడ్ నోట్ కనిపించింది. అందులో కుమారులు- వారి భార్యలు, కూతుళ్ల పేర్లు ఉన్నాయి. వృద్ధ దంపతులు మంగళవారం సూసైడ్ చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. సొంత పిల్లలు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారని తెలిసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఆ వృద్ధ దంపతులు పడిన కష్టాలు విని, కంటతడి పెట్టుకుంటున్నారు.
సంబంధిత కథనం