Air quality : దిల్లీ వర్సెస్ ముంబై.. దారుణంగా పడిపోతున్న వాయు నాణ్యత!
Air quality : దిల్లీలో వాయు నాణ్యత వేగంగా పడిపోతోంది. దిల్లీకి పోటీగా ముంబైలో కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి!
Delhi Air quality latest news : శీతాకాలం వస్తోందంటే దేశ రాజధానిలో ఎక్కువ వినిపించే అంశం 'వాయు నాణ్యత క్షీణించడం'! కానీ ఇప్పుడు.. ముంబై మహా నగరం కూడా దిల్లీకి పోటీపడుతున్నట్టు కనిపిస్తోంది. రెండు నగరాల్లో ఎయిర్ క్వాలిటీ రోజురోజుకు పడిపోతుండటం ఆందోళనకు గురిచేస్తున్న విషయం.
దిల్లీలో పరిస్థితి ఇలా..
దిల్లీలో వాయు నాణ్యత ఆదివారం మరింత పడిపోయింది. ఇక సోమవారం ఉదయం.. దేశ రాజధానిలో ఏక్యూఐ (వాయు నాణ్యత సూచీ) 306గా ఉంది.
ఏక్యూఐ అనేది 0-50 మధ్యలో ఉంటే అది సాధారణంగా పరిగణిస్తారు. 51-100గా ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్టు. 101-200గా నమోదైతే మాడరేట్గా ఉందని అర్థం. 201-300గా ఉంటే వాయు నాణ్యత క్షీణిస్తోందని తెలుసుకోవాలి. 301-400 మధ్యలో ఉంటే వాయు నాణ్యత వేగంగా పడిపోతోందని, 401-500 మధ్యలో ఉంటే పరిస్థితి విషమిస్తోందని అర్థం చేసుకోవాలి. ఇక 500 దాటితే.. పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నట్టు.
Delhi Air quality : దసరా సమయంలో పరిస్థితులు ఇలా ఉంటే.. దీపావళి నాటికి దిల్లీ వాయు నాణ్యత మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. పంట వ్యర్థాలను రైతులు తగలబెడుతుండటం కూడా వాయు నాణ్యత క్షీణించడానికి ఒక ప్రధాన కారణం.
"వాతావరణం అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్న వాటిని మనం నియంత్రించుకోవాలి. ఈ విషయంలో కొన్ని గంటల్లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాము," అని దిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
దిల్లీలో తాజా పరిస్థితులపై అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"దిల్లీలో 10-12 రోజులుగా పరిస్థితులు మారుతున్నాయి. వాయు కాలుష్యం పెరుగుతోంది. ఇవాళ సైక్లింగ్కి వచ్చాము. పొగమంచు ఎక్కువగా ఉంది. ఇక్కడ పరిస్థితులు బాగోలేవని నాకు అనిపిస్తోంది. మాతో పాటు మాస్కులు తెచ్చుకున్నాము. రోడ్డు మీద ఉండాలంటే ఇవి తప్పవు అని అనిపిస్తోంది," అని ఓ దిల్లీవాసి మీడియాతో చెప్పాడు.
ముంబైలో ఇలా..
Mumbai Air quality : మహారాష్ట్ర రాజధాని, దేశ వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన ముంబైలో కూడా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అక్కడి వాయు నాణ్యత సూచీ ప్రస్తుతం 127గా చూపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలోనే ఇది పెరిగిపోవడం ఇక్కడ ఆందోళనకర విషయం. ఈ నేపథ్యంలో బీఎంసీ (బృహన్ముంబై కార్పొరేషన్) కీలక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. వీటితో పాటు నిర్మాణ ప్రదేశాల్లో మరో 15 రోజుల్లో స్ప్రింక్లర్ డివైజ్లను ఏర్పాటు చేయనుంది. నిర్మాణాలు చేపడుతున్న వారు.. సొంతంగా ఎయిర్ క్వాలిటీ మెజరింగ్ డివైజ్లు కొనుక్కుని, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని సూచించింది.
సోమవారం ఉదయం 7:30 గంటల సమయానికి ముంబైలో ఏక్యూఐ 127గా ఉండగా.. నవీ ముంబైలో అది 152గా నమోదైంది. బోరివలిలో 101, మజ్గావ్లో 121, కొలాబాలో 142గా రికార్డు అయ్యింది.
సంబంధిత కథనం
టాపిక్