Mumbai Diaries 2 Review: అప్పుడు బాంబ్ పేలుళ్లు, ఇప్పుడు వరదలు.. ముంబై డైరీస్ 2 రివ్యూ-mumbai diaries season 2 web series review and rating in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mumbai Diaries 2 Review: అప్పుడు బాంబ్ పేలుళ్లు, ఇప్పుడు వరదలు.. ముంబై డైరీస్ 2 రివ్యూ

Mumbai Diaries 2 Review: అప్పుడు బాంబ్ పేలుళ్లు, ఇప్పుడు వరదలు.. ముంబై డైరీస్ 2 రివ్యూ

Sanjiv Kumar HT Telugu
Oct 07, 2023 12:57 PM IST

Mumbai Diaries 2 Web Series Review: 2021లో ముంబై దాడుల నేపథ్యంలో వచ్చిన ముంబై డైరీస్ 26/11 వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు రెండేళ్లకు దీనికి సీక్వెల్‌గా ముంబై డైరీస్ సీజన్2 వచ్చింది. వరదల నేపథ్యంలో వచ్చిన ముంబై డైరీస్ 2 రివ్యూలోకి వెళితే..

వరదలు సృష్టించిన బీభత్సం.. ముంబై డైరీస్ 2 రివ్యూ
వరదలు సృష్టించిన బీభత్సం.. ముంబై డైరీస్ 2 రివ్యూ

టైటిల్: ముంబై డైరీస్ సీజన్ 2

నటీనటులు: మోహిత్ రైనా, కొంకణ సేన్ శర్మ, శ్రేయ ధన్వంతరి, నటాషా భరద్వాజ్, ప్రకాష్ బెలవాడి, సత్యజిత్ దూబే, టీనా దేశాయ్, మృణ్‌మయి దేశ్‌పాండే తదితరులు

సంగీతం: అశుతోష్ పాఠక్

నిర్మాతలు: మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ

దర్శకత్వం: నిఖిల్ అద్వానీ

విడుదల తేది: అక్టోబర్ 6, 2023

ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో

ఎపిసోడ్స్: 8 (ఒక్కొక్కటి సుమారు 45 నిమిషాలు)

Mumbai Diaries Season 2 Review Telugu: రెండేళ్ల క్రితం 2008లో జరిగిన ముంబై పేలుళ్ల సమయంలో బాంబే జనరల్ ఆస్పత్రి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో వచ్చిన ముంబై డైరీస్ 26/11 చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ముంబైలో సంభవించిన భీకర వరదల నేపథ్యంలో అదే బాంబే జనరల్ హాస్పిటల్‌కు ఎదురైన సవాళ్లు, సిబ్బంది ఫేస్ చేసిన పరిస్థితుల కథాంశంగా ఈ మెడికల్ థ్రిల్లర్ సిరీస్ తెరకెక్కింది. మరి ముంబై డైరీస్ సీజన్ 2 అంచనాలను అందుకుందా అనేది రివ్యూలో చూద్దాం.

కథ:

26/11 పేలుళ్ల సమయంలో టెర్రరిస్ట్ కు ట్రీట్‌మెంట్ అందించి, తన భర్తను కాపాడలేకపోయాడని డాక్టర్ కౌశిక్ ఒబెరాయ్ (మోహిత్ రైనా)పై మిసెస్ కులకర్ణి కేసు వేస్తుంది. దానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుంది. ముంబైలో చోటు చేసుకున్న వరదల కారణంగా జడ్జ్ రాలేకపోవడంతో తీర్పు వాయిదా పడుతుంది. భార్య అనన్య (టీనా దేశాయ్)ను పూణెకు కారులో పంపించి తాను బాంబే జెనరల్ హాస్పిటల్‌కు వెళ్తాడు కౌశిక్. ఈ క్రమంలోనే వరదల వల్ల అనేక మంది ప్రమాదాలకు గురి అవుతూ హాస్పిటల్‌లో జాయిన్ అవుతారు.

ట్విస్టులు

ముంబైలో బీభత్సం సృష్టించిన వరదల వల్ల బాంబే జనరల్ హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్స్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? వారికి ఎదురైన సవాళ్లు ఏంటీ? వరదల కారణంగా ఏం నష్టపోయారు? గంటలతరబడి పని చేస్తున్న వైద్య సిబ్బంది మానసిక పరిస్థితి ఎలా ఉంది? అలాంటి సమయంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎలాంటి చర్యలకు దారితీశాయి? ఇక కౌశిక్‌కు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందా? అతను పదవి నుంచి వైదొలిగాడా? మీడియా ఎలాంటి పాత్ర పోషించింది? వంటి ఆసక్తికర విషయాలు సమ్మేళనమే ముంబై డైరీస్ సీజన్ 2 సిరీస్.

విశ్లేషణ:

పేలుళ్ల ఆధారంగా కాస్త ఫిక్షన్ జోడించి బాంబే జనరల్ హాస్పిటల్ ఇబ్బందులతో ముంబై డైరీస్ 26/11 తెరకెక్కిస్తే.. బీభత్సం సృష్టించిన వరదల నేపథ్యంలో ముంబై డైరీస్ 2 రూపొందించారు. మొదటి సిరీస్ మూడ్‌ను కంటిన్యూ చేస్తూ సీజన్ 2 ప్రారంభం అవుతుంది. పేలుళ్ల సమయంలో హాస్పిటల్‌లో ఎదుర్కొన్న వైద్య సిబ్బంది మానసిక పరిస్థితి అటాక్ తర్వాత ఎలా ఉంది అనేది చూపించారు. దాడుల్లో నష్టపోయిన వారికి ఇచ్చే పరిహారం కోసం ఎదురుచూడటం, డాక్టర్ కౌశిక్‌పై మిసెస్ కులకర్ణి మర్డర్ కేసు ఫైల్ చేయడం వంటి విషయాలతో ఉత్కంఠంగా కథలోకి తీసుకెళ్లారు.

బ్లాక్ మార్కెట్

అప్పుడు అటాక్ ఎదుర్కున్న బాంబే హాస్పిటల్‌కు మరోసారి వరదలు ఎలాంటి సమస్యలను సృష్టించాయి. ఈ సమయంలో ఆసుపత్రిలో చేరిన పేషంట్స్, వారి కథలు, వైద్య సిబ్బంది వ్యక్తిగత జీవితాలు, ఇబ్బందులు, మానసిక పరిస్థితి ముఖ్యంగా కౌశిక్ మెంటల్ సిచ్యువేషన్‌తో థ్రిల్లింగ్‌గా ప్రజంట్ చేశారు. అంతేకాకుండా హాస్పిటల్‌లోని మెడిసిన్‌ను బ్లాక్ మార్కెట్‍లో అమ్మేయడం, అవసరం కోసం నర్సులు మందులు దొంగలించడం, వ్యక్తిగత కారణాల వల్ల పేషంట్స్ అబద్ధాలు చెప్పడం వంటివి హాస్పిటల్‌కు ఎలాంటి నష్టాన్ని తీసుకొచ్చిందో ఎమోషనల్‌గా చూపించారు.

మీడియా రోల్

ఓవైపు జాబ్, మరోవైపు వరదల్లో తప్పిపోయిన తమ వాళ్లను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు, పేషంట్స్ ని మనసులో కాపాడాలని ఉన్నా సౌకర్యాలు లేక బతికించలేకపోవడం వంటి ప్రతి ఒక్క టాపిక్‌ను హృద్యంగా టచ్ చేశారు. ఇక ప్రతి విషయాన్ని బిజినెస్‌గా మార్చే మీడియా కవరేజ్‌ను బాగా డీల్ చేసి చూపించారు. సిరీస్ నిడివి ఎక్కువగా ఉన్న థ్రిల్లింగ్‌గా, ఎమోషనల్‌గా బోర్ కొట్టించకుండా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. ఇక బీజీఎమ్ అయితే సన్నివేశాలకు తగినట్లుగా మూడ్‌ క్రియేట్ చేసింది.

ఎలా చేశారంటే?

దేవోంకా దేవ్ మహాదేవ్ వంటి పాపులర్ సీరియల్ యాక్టర్ మోహిత్ రైనా నటన గురించి చెప్పాల్సిన పని లేదు. కౌశిక్ ఒబెరాయ్‌గా ఆకట్టుకుంటాడు. శ్రేయా, ప్రకాష్, కొంకణ సేన్, నటాషా తదితరులు ప్రతి ఒక్కరు తమ నటనతో జీవించేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందా అనే థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే ఈ మెడికల్ థ్రిల్లర్ సిరీస్ ముంబై డైరీస్ సీజన్ 2 (Mumbai Diaries 2 Review Telugu)ను చూడాల్సిందే.

రేటింగ్: 3/5