Mutton Masala : దసరా స్పెషల్.. మటన్ మసాలా.. కుమ్మి పడేయెుచ్చు
Mutton Masala Recipe : దసరా రోజున చాలా ఇళ్లలో మటన్ ఉండాల్సిందే. ముక్కలేనిదే చాలా మందికి ముద్ద దిగదు. అలాంటప్పుడు మటన్ మసాలా ట్రై చేయండి. గట్టిగా లాగించేస్తారు.
దసరా పండగ అంటే.. తెలంగాణలో చుక్క ముక్క కచ్చితంగా ఉండాల్సిందే. దసరా దావత్ లేకుండా ఏ ఒక్క ఇళ్లూ ఉండదేమో. మటన్ కూర లేని ఇళ్లు కనిపించదు. ఏ ఊరికి వెళ్లినా.. కచ్చితంగా మటన్ వాసన ఘుమఘుమలాడుతూ ఉంటుంది. మీ ఇంట్లోనూ మటన్ మసాలా ట్రై చేయండి. మీ వీధి అంతా.. మీ ఇంటి నుంచే వచ్చే మటన్ కర్రీ వాసనకు ఫీదా అయిపోతారు. మటన్ మసాలా సింపుల్‍గానే చేయెుచ్చు.
మటన్ మసాలకు కావాల్సిన పదార్థాలు..
మటన్ కేజీన్నర, ఐదు చెంచాల నూనె, పసుపు కొంచెం, కారం మూడు చెంచాలు, రెండు పెద్ద ఉల్లిపాయలు, ధనియాల పొడి చెంచాన్నర, అల్లంవెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, పెరుగు ఒక కప్పు, గరం మసాలా పొడి ఒక చెంచాన్నర, కొబ్బరి పొడి మూడు చెంచాలు, గసగసాలలు రెండు చెంచాలు, ఉప్పు సరిపడేంత, మూడు కప్పుల నీరు, కొత్తిమీర కొంచెం.
తయారు చేసే విధానం..
ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కోవాలి. కొవ్వు ఎక్కువగా ఉంటే తీసేయడమే మంచిది. కొంతమందికి పడక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మటన్ మసాలా తయారు చేసేందుకు మెుదట కొబ్బరి పొడి, గసగసాలు తీసుకోవాలి. వాటిని వేయించుకోవాలి. ఓ ప్లేటులో పక్కకు తీసుకోవాలి.
ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని స్టౌవ్ మీద పెట్టాలి. అందులో తగినంత నూనె పోయాలి. కాస్తే వేడి అయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. కాసేపు వేయించుకోవాలి. అందులో అల్లంవెల్లులి పేస్ట్ వేసుకుని.. కాస్త పసుపు చల్లుకోవాలి. పచ్చి వాసన ఉండకుండా వేయించాలి.
ఇప్పుడు మటన్ ముక్కలను గిన్నెలో వేసుకోవాలి. కాసేపు వేయించుకోవాలి. ధనియాలపొడి, కారం, ఉప్పు వేయాలి. తర్వాత ఉడికించుకోవాలి. గరం మసాలా కూడా వేసుకోవాలి. కాసేపటి తర్వాత పెరుగు వేసి కలుపుకోవాలి. ఇంకాసేపటి తర్వాత వాటర్ పోయాలి. ఇప్పుడు అందులో కొబ్బరి పొడి వేసుకోవాలి. దీని వలన సూప్ చిక్కగా ఉంటుంది. మటన్ ఉడికే వరకు గ్యాస్ మీద ఉంచండి. ఇక అయిపోయింది.. దించుతాం అనే అరనిమిషానికి ముందు కొత్తి మీర వేసుకోవాలి. అంతే.. మటన్ మసాలా రెడీ అయినట్టే..