ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా (Air India) ఫ్లైట్ లో సీట్లో కూర్చున్న సహ ప్రయాణికురాలైన ఒక వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటనలో నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) ను ఆ తరువాత పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.
ఈ నేర ఘటనలో నిందితుడిగా ఉన్న శంకర్ మిశ్రా (Shankar Mishra) ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నాడు. బెయిల్ కోరుతూ ఢిల్లీ లోని పాటియాలా హౌజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పలు వాదనల అనంతరం, మంగళవారం కోర్టు శంకర్ మిశ్రా (Shankar Mishra) కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు విమానంలో సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసి, అంతర్జాతీయంగా భారతదేశం పరువు తీశాడని, అందువల్ల అతడికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు కోర్టు ముందు వాదించారు. నిందితుడు శంకర్ మిశ్రా (Shankar Mishra) చేశాడని చెబుతున్న నేరం అసహ్యకరమైనదే అయినప్పటికీ.. చట్టం ప్రకారం వ్యవహరించాల్సి ఉన్నందున అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది.
విమానంలో ఈ ఘటన జరిగిన తరువాత బాధితురాలి విషయంలో ఎయిర్ ఇండియా (Air India) సిబ్బంది అమానవీయంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. తన సీటు మార్చాలన్న ఆ వృద్ధురాలి అభ్యర్థనను కూడా సిబ్బంది పట్టించుకోలేదని, మూత్రంతో తడిచిపోయిన ఆ మహిళకు వేరే దుస్తులను కూడా సమకూర్చలేదని ఆరోపణలు వచ్చాయి. పైగా నిందితుడితో ఆమెకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా క్షమాపణలు చెప్పించారని విమర్శలు వచ్చాయి. ఈ ఘటన సమయంలో ఎయిర్ లైన్స్ (Air India) సిబ్బంది తీరును డీజీసీఏ (DGCA) తీవ్రంగా తప్పుబట్టింది. ఎయిర్ ఇండియా (Air India) కు రూ. 30 లక్షల జరిమానా విధించింది. పైలట్ లైసెన్స్ ను రద్దు చేసింది.