Road accident: అకస్మాత్తుగా రోడ్డుపై నిలిచిపోయిన ట్రక్కు; వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు; 9 మంది మృతి
మధ్య ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 30 పై బస్సు, ట్రక్కు ఢీ కొన్న ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 24 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల్లో ఐదుగురిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాసులుగా గుర్తించగా, మరో నలుగురి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
Road accident: మధ్యప్రదేశ్ లోని మైహార్ జిల్లాలోని 30వ నెంబరు జాతీయ రహదారిపై శనివారం రాత్రి హైవా ట్రక్కును బస్సు ఢీకొనడంతో 9 మంది మృతి చెందగా, మరో 24 మంది గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురిని ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వాసులుగా గుర్తించగా, మరో నలుగురి గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు.
యూపీ ట్రావెల్స్ బస్సు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన స్లీపర్ కోచ్ బస్సు శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ నుంచి నాగ్ పూర్ వెళ్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం హైవా ట్రక్కు డ్రైవర్ ట్రక్కు వేగాన్ని అకస్మాత్తుగా తగ్గించి రోడ్డుపైనే ఆపేశాడు. దాంతో, వెనుక నుంచి వేగంగా వస్తున్న బస్సు డ్రైవర్, వేగాన్ని అదుపు చేయలేక రాళ్లతో వెళ్తున్న ట్రక్కును వెనుకనుంచి ఢీ కొట్టింది.
ట్రక్కులో ఇరుక్కుపోయిన బస్సు ముందు భాగం
ఈ ఘోర ప్రమాదం కారణంగా ట్రక్కు వెనుకభాగంలో బస్సు ఇరుక్కుపోయిందని సత్నా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) సుధీర్ అగర్వాల్ తెలిపారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు జేసీబీ, కట్టర్లను ఉపయోగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 28 మందిని సత్నా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మృతి చెందారు. ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. మధ్యప్రదేశ్ లోని మైహార్ జిల్లాలో ట్రక్కు, ప్యాసింజర్ బస్సు ఢీకొన్న ఘటనలో 9 మంది ప్రయాణికులు అకాల మరణం చెందారన్న వార్త చాలా బాధాకరమని, హృదయవిదారకంగా ఉందని మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించామని, మృతుల కుటుంబ సభ్యులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు.