Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. గురువారం) తెల్లవారుజామున వంగవీటి రాధాకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వంగవీటి రాధా డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. 48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు.
వంగవీటి రాదాను పరీక్షించిన డాక్టర్లు యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేశారు. ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.
వంగవీటి రాధా గత ఏడాది సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు రాధా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దాదాపు నాలుగున్నరేళ్లుగా రాధా పెద్దగా బయట కనిపించడం లేదు. క్రియాశీల రాజకీయాలకు సైతం దూరంగా ఉన్నారు. తండ్రి వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో తప్ప ఎక్కడా కనిపించే వారు కాదు. గత ఎన్నికల సమయంలో రాధా ఎన్నికల్లో పోటీ చేస్తారని, ఆయన సోదరిని వైసీపీ తరపున బరిలో దిగుతున్నారని ప్రచారం జరిగింది. ఎన్నికల తర్వాత రాధాకు నామినేటెడ్ పదవి ఇస్తారని కూడా ఆయన అభిమానుల్లో ప్రచారం జరిగింది.
పాతికేళ్ల వయసులోనే తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాధా గెలుపు ముఖం చూసి పదిహేనేళ్లు దాటిపోయింది. కోస్తాలో బలమైన సామాజిక వర్గానికి గుర్తింపు తెచ్చిన వంగవీటి రంగా వారసత్వాన్ని నిలబెట్టుకోవడంలో రాధా వెనుకబడ్డారనే ఆవేదన ఆయన అభిమానుల్లో ఉంటుంది. మరోవైపు క్రియాశీల రాజకీయాలకు రాధా దూరమై పదిహేనేళ్లు దాటి పోతోంది. ఎన్నికలకు ముందు రాధా జనసేనలో చేరతారని కూడాప్రచారం జరిగింది.
2009 ఎన్నికలకు ముందు వైఎస్ బుజ్జగించిన వినకుండా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లి ఓటమి పాలయ్యాడు. ఆ పార్టీ ఓటమి తర్వాత మళ్లీ జగన్‌తో జట్టు కట్టాడు. 2019లో వైఎస్ జగన్ బుజ్జగించినా వినకుండా టీడీపీలో చేరాడు.
తెలుగుదేశం పార్టీలో యువజన విభాగంతో పాటు కీలక బాధ్యతలు అప్పగించినా వాటిని ముందుండి నడిపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. అధికారంలో ఉన్న వైసీపీ తీరును ఎండగట్టింది లేదు. రాజకీయాల్లో రాధా తెలుగుదేశం పార్టీలో ఉన్నారనుకోవడానికే పరిమితం అయ్యారు. అంతకు ముందు వైసీపీలో కూడా అదే తీరు కొనసాగించారు. 2019 ఎన్నికల్లో అవనిగడ్డ, బందరు పార్లమెంటు స్థానాల నుంచి పోటీ చేయాలని జగన్ కోరినా తనకు విజయవాడ సెంట్రల్ నియోజక వర్గమే కావాలని పట్టుబట్టారు.
2009లో విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచే అవకాశాలు ఉన్నా దానిని కాంగ్రెస్ అభ్యర్ధి మల్లాది విష్ణు గెలుపుకు దోహదపడ్డారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన ఓటమి తప్పలేదు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. తానేం చేస్తున్నాడో తనకే స్పష్టత లేని గందరగోళంతో రాజకీయాలు చేయడమే రాధా ప్రత్యేకతగా మారిపోయింది. రాజకీయంగా విజయవాడలో తిరుగులేని పట్టు ఉన్నా దానిని అధికారానికి అనువుగా మలచుకోవడంలో వెనుకబడిపోతుంటారు. తాజాగా ఆయన అస్వస్థతకు గురయ్యారనే వార్తలు అభిమానుల్ని ఆందోళనకు గురి చేశాయి.