AP News : షాపింగ్ కు వెళ్తుండగా ఘోర ప్రమాదం - ఇద్దరు స్పాట్ డెడ్
AP Crime News: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైరు పేలి డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి ప్రయత్నించిన నాలుగో తరగతి బాలుడు మృతి చెందాడు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గృహ ప్రవేశం కోసం పట్టు చీరలు కొనడానికి కంచికి వెళ్తూ మార్గమధ్యలో అనంతలోకానికి వెళ్లారు. టైరు పేలి డివైడర్ ను కారు ఢీకొట్టడంతో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘోర రోడ్డు ప్రమాద ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని కొత్తపల్లి బైపాస్ వద్ద శనివారం జరిగింది. దొడ్డబలాపురానికి చెందిన గంగరాజు (56), లక్ష్మి (35), శ్రీనివాసమూర్తి (51), తనూజ (36), సుచిత్ర (48), ఉష (32), ధరణి (22) ఏడుగురు ఇన్నోవా కారులో గృహ ప్రవేశం కోసం పట్టు చీరలు కొనడానికి కంచికి బయల్జేరుతారు. ఆ తరువాత కంచి కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నారు.
మార్గమధ్యంలో బంగారుపాలెం మండలంలోని కొత్తపల్లి బైపాస్ రోడ్డు చెన్నై-బెంగళూర్ జాతీయ రహదారి ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై కారు టైర్ పేలి అదుపుతప్పింది. అతి వేగంగా రోడ్డు పక్కన ఉన్న గోడ (సైడ్ వాల్)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగరాజు (56), లక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన ఐదుగురు శ్రీనివాసమూర్తి (51), తనూజ (36), సుచిత్ర (48), ఉష (32), ధరణి (22) తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కోలార్ ఆసుపత్రికి తరలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. అలాగే ఘటనా స్థలానికి తహశీల్దారు బాబు రాజేంద్రప్రసాద్ చేరుకుని పరిశీలించారు.
లారీని ఢీకొట్టిన మరో లారీ :
రాష్ట్రంలోని బాపట్ల జిల్లాలో లారీని మరో లారీ ఢీకొంది. లారీలో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. దీంతో డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన బాపట్ల జిల్లా పంగులూరు మండలం జాగర్లమూడివారిపాలెం గ్రామంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ పై శనివారం చోటు చేసుకుంది. కర్ణాటక నుండి ఒరిస్సాకు టమోటా లోడుతో వెళ్తున్న లారీ జాగర్లమూడి వారి పాలెం ఫ్లైఓవర్ మీదుకు వచ్చే సరికి, ముందు వెళ్తున్న లారీ వేగం తగ్గి నెమ్మదిగా వెళ్లడంతో టమోటా లారీ వేగంగా వెళ్లి ఢీకొట్టింది.
ఈ మాదంలో టమోటా లోడు లారీ ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ఈ లారీని నడుపుతున్న డ్రైవర్ హరీష్ లారీలో ఇరుక్కుపోయాడు. ఆయనికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే జాతీయ రహదారి అంజులెన్స్ సిబ్బంది లారీలో ఇరుక్కుపోయిన హరీష్ ను క్రేన్ సహాయంతో తీసి, ఆయనని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విశాఖలో విషాద ఘటన :
విశాఖపట్నం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి ప్రయత్నించిన నాలుగో తరగతి బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు లబోదిబోమంటూ రోధించారు.
ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లి మండలంలో ములకలాపల్లిలో శనివారం జరిగింది. గ్రామంలోని వడిగంటి గణేష్, భవాని దంపతుల రెండో కుమారుడైన యశ్వంత్ (11) గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
శనివారం సెలవు కావడంతో ఇంటి దగ్గరే ఉన్నాడు. తండ్రి గణేష్ టెంట్ హౌస్, సౌండ్ సిస్టమ్ నిర్వహిస్తుంటాడు. ఇంట్లో ఫ్యాన్ ప్లగ్ పెట్టడానికి ప్రయత్నించిన యశ్వంత్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాలుడిని కాపాడటానికి కుటుంబీకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. అప్పటి వరకు తమ ముందున్న కుమారుడు కొన్ని క్షణాల వ్యవధిలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో యశ్వంత్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని భవాని రోదించిన తీరు అందరినీ కలచివేసింది. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ మల్లేశ్వరరావు అన్నారు.
ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి:
గుంటూరు నగరంలో చంద్రమౌళీనగర్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన రేపూరి దివ్య (17) చంద్రమౌళీనగర్ లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది.
ఆ విద్యార్థిని కాలేజీ వసతి గృహంలోనే ఉంటుంది. అయితే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం తెల్లవారుజామున వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని ఆమె మృతిపై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానిక పట్టాభిపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం