Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 30 మందికి గాయాలు-five people died in a road accident in chittoor district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 30 మందికి గాయాలు

Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - 8 మంది మృతి, 30 మందికి గాయాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 13, 2024 05:45 PM IST

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను ఢీకొన్న బస్సు
మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను ఢీకొన్న బస్సు

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు హైవేపై మొగిలి ఘాట్ దగ్గర రెండు లారీలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే ఆరుగురు చనిపోగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు.

ప్రాథమిక వివరాల ప్రకారం….  మధ్యాహ్నాం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు అదుపు తప్పినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.  ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి..

చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో పలువురు ప్రయాణికులు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబుదిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  ఈ ఘటనపై ఆరా తీసిన ఆయన....సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు.

ప్రభుత్వం ఆదుకోవాలి - వైఎస్ జగన్

 మొగిలి ఘాట్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.