Sini Shetty - Miss India World 2022 | ముంబైలో ఆదివారం జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేలో కర్ణాటకకు చెందిన సిని శెట్టి టైటిల్ విజేతగా నిలిచారు. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫెమినా మిస్ ఇండియా 2022 ఫస్ట్ రన్నరప్‌గా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినాతా చౌహాన్ ఫెమినా మిస్ ఇండియా 2022 సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.
జ్యూరీ ప్యానెల్‌లో నటులు నేహా ధూపియా, కృతి సనన్, డినో మోరియా, మలైకా అరోరా, డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ అలాగే మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ ఉన్నారు.
మిస్ ఇండియా వరల్డ్ 2022 కోసం వర్చువల్ ఆడిషన్స్ ఎంట్రీలను ఆహ్వానించారు. హైబ్రిడ్ ఫార్మాట్‌లో పోటీలను నిర్వహించారు దేశవ్యాప్తంగా అనేక నగరాల నుంచి వచ్చిన అందెగత్తెలు పోటీపడ్డారు. అయితే టాప్ 5 ఫైనలిస్ట్‌లుగా సిని శెట్టి, రూబల్ షెకావత్, షినతా చౌహాన్, గార్గీ నంది, అలాగే హైదరాబాద్‌కు చెందిన ప్రజ్ఞ అయ్యగారి నిలిచారు. గ్రాండ్ ఫినాలే నైట్‌లో వీరంతా అబ్బురపరిచే దుస్తుల్లో అద్భుతంగా కనిపించారు.
మిస్ ఇండియా వరల్డ్ 2022 పోటీలో విజేతగా నిలిచిన సిని శెట్టి కర్ణాటక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 21 ఏళ్ల ఈ బ్యూటీ క్వీన్ నేపథ్యం కన్నడ అయినా ముంబైలోనే జన్మించింది. అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంది. ఓ మార్కెటింగ్ కంపెనీలో కూడా పనిచేసింది. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అవ్వాలనేది తన అభిలాష. ఇందుకోసం ప్రస్తుతం ఆమె CFA అనే ప్రొఫెషనల్ కోర్సును అభ్యసిస్తోంది.
ఈ తాజా అందాల భామ ఒక భరతనాట్యం నర్తకి. సిని శెట్టి తన నాలుగేళ్ల వయసు నుంచే డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించింది. 14 సంవత్సరాల వయస్సులో భరతనాట్యంలో తన ఆరంగేట్రం పూర్తి చేసింది.
Watch Sini Shetty Dance
తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అటు విద్యాపరంగా, ఇటు భరతనాట్యం, ఆపై మోడలింగ్ లోనూ రాణిస్తూ నేడు మిస్ ఇండియా అయ్యింది. మిస్ ఇండియా వరల్డ్ 2020 మానస వారణాసి ఇప్పుడు సిని శెట్టి కి కిరీటం తొడిగింది. ఇక, రాబోయే మిస్ వరల్డ్ పోటీలో సిని శెట్టి ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించనుంది.
సంబంధిత కథనం