Turnaround Thursday | నీ అడుగు ధైర్యమైనదైతే.. వెనుదిరిగి చూసుకునే అవసరమే ఉండదు!
Turnaround Thursday: ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తి ఏం చేశాడు, స్ఫూర్థిదాయకమైన ఈ కథను చదవండి.
Turnaround Thursday: ఉద్యోగం చేసే వారికి ఆ ఉద్యోగం ఉంటుందా.. ఊడుతుందా అనే ఆందోళన, వ్యాపారం చేసే వారికి వారి వ్యాపారం సాఫీగా సాగుతుందా, నష్టాలతో మునుగుతుందా అనే ఆందోళన. రేపటి గురించి ఆలోచిస్తూ నేటి సంతోషాన్ని కోల్పోతున్నారు. మీరు ఎంచుకున్న దారి రహదారే అయినా, జీవితం అనేది ఎప్పుడూ ఎత్తుపల్లాలతోనే ఉంటుంది. మీ దారిలో ముళ్లు ఉండవచ్చు, పూలబాటగానూ ఉండవచ్చు. మీ జీవితంలో మీకు ఎదురయ్యే వారు మీ పురోగతికి తోడ్పడవచ్చు, లేదా మిమ్మల్ని అణగదొక్కేయవచ్చు. జీవితం అనేదే పాము, నిచ్చెన ఆట. దీనిలో ఓడటం, గెలవడం అటుంచితే ఆట ఆడటం ముఖ్యం.
పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలతలు ఎదురైనపుడు వాటి గురించే ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకూడదు. సవాళ్లను తట్టుకుంటూ ముందుకు సాగేవాడే జీవితంలో మైలురాళ్లను అధిగమిస్తాడు. మీరు వేసే అడుగు ధైర్యమైనదైతే, జీవితంలో వెనుదిరిగే అవకాశం ఉండదు.
కష్టాల కడలినే ఈదడం తన ఇష్టంగా మార్చుకున్న ఓ వ్యక్తి తన కుమారుడికి నేర్పించిన పాఠం ఇప్పుడు తెలుసుకుందాం.
కష్టాల కడలిలో గొప్పగా తిరిగిన సుడి
ఒక వ్యక్తి జీవితంలో చాలా ఉన్నతంగా ఎదిగాడు, అతడి వ్యాపారాలు లాభసాటిగా సాగాయి. అయితే అనుకోకుండా అతడి వ్యాపారంలో సంక్షోభం తలెత్తడంతో తీవ్ర నష్టాలను చవి చూశాడు. వ్యాపారాన్ని కొనసాగించడానికి తన ఆస్తులు, కార్లను విక్రయించాల్సి వచ్చింది. మళ్లీ సాధారణ వ్యక్తి స్థాయికి వచ్చాడు. అతడికి ఒక స్కూలుకు వెళ్లే కొడుకు ఉన్నాడు, రోజూ కారులో స్కూలుకు వెళ్లే అతడు, స్కూటర్ మీద వెళ్లడం మొదలైంది. దీంతో ఆ పిల్లాడు మనకు నష్టాలు తెప్పిస్తున్న ఆ వ్యాపారాన్ని ఇంకా కొనసాగించడం దేనికి, దానిని మూసివేయవచ్చు కదా అంటాడు.
అందుకు తండ్రి చిరునవ్వుతో జవాబు ఇస్తూ, 'జీవితం మనకు చాలా సవాళ్లను తెచ్చిపెట్టగలదు, మనల్ని కిందకి నెట్టగలదు. అయినా మనం ఎలాంటి సవాళ్లనైనా అధిగమించగలమని ఆశ ఉంటే అదే మనల్ని బ్రతికిస్తుంది' అంటాడు.
ఆశ ఎలా బ్రతికిస్తుంది నాన్నా? నాకు ఉదాహరణ చెప్పు అని తన తండ్రిని కొడుకు అడుగుతాడు.
దీంతో ఆ తండ్రి తన కొడుకును ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్లి అందులో తోసేస్తాడు. దీంతో ఈత రాని ఆ బాలుడు నాన్నా హెల్ప్ అని అరుస్తుండగా మళ్లీ అతణ్ని పైకి లేపుతాడు. నేను నిన్ను నీటిలో తోసేసినా, నువ్వు నన్నే నమ్ముకొని హెల్ప్ కోసం అడిగావు కదా అదే ఆశ. ఆ ఆశే నిన్ని బ్రతికించింది అని చెబుతాడు.
ఇలా ఆ తండ్రి ప్రతిరోజూ తన కొడుకుని నీటిలో తోసేస్తాడు, రోజూ కాస్త ఆలస్యంగా బయటకు తీస్తాడు. మెల్లిమెల్లిగా ఆ కొడుకు ఈత నేర్చుకుంటాడు. దీంతో అతణ్ని తోసేసినా ఇప్పుడు ఎవరూ రక్షించాల్సిన అవసరం లేదు.
ఇదే, క్రమంలో కొన్నాళ్లకు ఆ వ్యక్తి షేర్లు లాభపడతాయి. మళ్లీ బిజినెస్ పుంజుకుంటుంది. మళ్లీ ఉన్నతంగా ఎదుగుతారు.
నీతి: ఈ కథలో నీతి ఏమిటంటే రేపటిపై ఆశను కలిగి ఉండాలి, ఆందోళనను కాదు. ఆశతో అడుగు ముందుకేస్తే ప్రయాణం కొనసాగుతుంది. అది మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్తుంది, ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది.
సంబంధిత కథనం