Wednesday Motivation: ఈ గుణాలు ఉన్న వారే నిజమైన స్నేహితులు, మీ విషయంలో వారి ప్రవర్తన ఎలా ఉండాలంటే
Wednesday Motivation: స్నేహితులే మనకి బలం. వారి సాయంతోనే ఎన్నోసార్లు సమస్యల నుంచి గట్టెక్కుతాం. బాధను మర్చిపోయి ఆనందంతో నవ్వుతాం. అయితే మీ స్నేహితులు నిజమైన స్నేహితులో లేక మీ ముందు స్నేహంగా నటిస్తున్న ఫేక్ వ్యక్తులో తెలుసుకోవాలంటే వారిలో ఉన్న గుణాలను మీరు అంచనా వేయాలి.
Wednesday Motivation: ఆధ్యాత్మిక గురువు గౌరంగ్ దాస్ నిజమైన స్నేహితుడికి ఉండాల్సిన లక్షణాలను పంచుకున్నారు. స్నేహం ముసుగులో కొంతమంది ఫేక్ స్నేహితులు కూడా ఉంటారు. వారు స్నేహంగా వ్యవహరిస్తూనే మీకు అన్యాయం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న స్నేహితులు... నిజమైన వారా? లేక ఫేక్‌గా నటిస్తున్న వారో మీరు తెలుసుకోవాలి. మీ అమ్మా,నాన్న, అక్కా, చెల్లి... ఈ కుటుంబాన్ని మనం ఎంచుకోలేం. కానీ స్నేహితులు మాత్రం మనం ఎంచుకునే ఒక కుటుంబం. ఎంత మంచి స్నేహితులను ఎంచుకుంటే మీ జీవితం అంత ఆనందంగా ఉంటుంది.
నిజమైన స్నేహితుడు దొరకడం దేవుని ఆశీర్వాదమే అంటారు గౌరంగ్ దాస్. అవసరమైన సమయాల్లో వారు మీకు సహాయం చేయడానికి, ఆదుకోవడానికి ముందుంటారు. వారు కేవలం స్నేహితులు మాత్రమే కాదు... మీ సంరక్షకులు, మీ సలహాదారులు. మీరు ఎంత తెలివిగా స్నేహితులని ఎన్నుకుంటే, అంతగా మీ జీవితంలో పాజిటివిటీ పెరుగుతుంది. కొందరు స్నేహితులుగా నటించే వ్యక్తులు కూడా ఉంటారు. వారు నిజానికి మీకు శత్రువులతోనే సమానం. నిజమైన స్నేహితుడిని ఎలా గుర్తించాలో... ఆధ్యాత్మిక గురువు గౌరంగ దాస్ వివరిస్తున్నారు.
మొదటి లక్షణం
నిజమైన స్నేహితుడు మీరు సమస్యలో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే మీతో మాట్లాడడమో, మీ దగ్గరికి రావడమో, మీ సమస్యను తేలికపరచడానికి ప్రయత్నించడమో చేస్తారు. మీతో వారు ప్రతిరోజూ మాట్లాడకపోవచ్చు, కానీ మీకు సమస్య ఉందని తెలియగానే వెంటనే రెస్పాండ్ అయ్యే మొదటి వ్యక్తులు వారే. మీ జీవితంలోని ఒడిదుడుకులను అవసరమైన సమయాల్లోనూ మీకు సహాయం చేసేందుకు ముందుంటారు
రెండో లక్షణం
వారు మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుంటారు. మీకు ఇష్టమైనది, మీకు నచ్చనిది కూడా వారికి తెలుస్తుంది. నిజానికి మీ ప్రతిబింబంలా వారు కనిపిస్తారు. అలాంటి వ్యక్తులే మీకు నిజమైన స్నేహితులే.
మూడో లక్షణం
నిజమైన స్నేహితుడు ఎప్పుడూ మీరు బావుండాలని కోరుకుంటారు. అందుకే మీరు చేసే తప్పుల గురించి మీకు కచ్చితంగా చెబుతాడు. అలాగే మీకు తెలియకుండా మీ చుట్టూ జరుగుతున్న అన్యాయం గురించి కూడా మీకు తెలిసేలా చేస్తాడు. వారు మీతో నిజాయితీగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. వారు ప్రతి విషయాన్ని మీతో పంచుకునేందుకు ఇష్టపడతారు. తమ మనసులో ఉన్న ప్రతి మాటను మీతో చెబుతున్నారంటే వారి స్నేహంలో నిజాయితీ ఉందని అర్థం. నిజమైన స్నేహితులు వారి హృదయాల్లో మీ పట్ల ఎంతో ఆసక్తినీ, ఇష్టాన్ని కలిగి ఉంటారు. అందుకే మీతో నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు.
నిజమైన స్నేహితులు మిమ్మల్ని పొగిడే కన్నా మీ చుట్టూ జరుగుతున్న తప్పుల గురించి, మీ వల్ల జరుగుతున్న నష్టాల గురించి చెప్పేందుకు ముందుంటారు. అలాంటి వారిని మీరు కచ్చితంగా ఇష్టపడరు. కానీ వారే మీ నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహితులు జీవితంలో ఉంటేనే మీ తప్పులను మీరు దిద్దుకుంటూ ముందుకు వెళ్ళగలరు. అలాగే మీ పరిసరాల్లో ఏం జరుగుతుందో తెలుసుకొని ముందు జాగ్రత్తలు తీసుకోగలరు. మీ పతనాన్ని కోరుకునే వ్యక్తి మీరు చేసిన తప్పులను కూడా ఒప్పుల్లానే చెబుతారు. మీ వెనక జరుగుతున్న కుట్రలను మీకు తెలియకుండా చేస్తారు. మీరు నష్టపోతున్నా కూడా పెద్దగా పట్టించుకోరు. కాబట్టి ఏ స్నేహితులైన మీలోని తప్పులను చెబితే వెంటనే కోపం తెచ్చుకోకండి. వారి సాయంతో మిమ్మల్ని మీరు మార్చుకునేందుకు ఎదిగేందుకు ప్రయత్నించండి.