Tour Packages | తక్కువ బడ్జెట్‌లో గోవా, అరకు టూర్ వెళ్లాలా? మీకోసమే ఈ ప్యాకేజీలు
గోవాలో 4 రోజులు, అరకులో 3 రోజులు అటునుంచి మళ్లీ పాపికొండలు, ఆ తర్వాత కాళేశ్వరం ఇలా ఈ వేసవి సెలవులలో విహారయాత్ర చేస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? తెలంగాణ టూరిజం తక్కువ ధరలకే టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఆ వివరాలు..
వేసవి వచ్చిందంటే స్కూల్ పిల్లలకు సెలవులు వస్తాయి. ఇంకా చాలా మంది కూడా ఈ వేసవిలో ఎక్కడికైనా ట్రిప్ వేయాలని ప్లాన్ చేస్తుంటారు. కుటుంబ సభ్యులంతా కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ఇది సరైన సమయం. అయితే మరి ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి? ఖర్చు ఎంతవుతుందో అని గందరగోళానికి గురవుతున్నారా? మీ ట్రిప్ ప్లానింగ్‌ను మరింత సులభతరం చేయడానికి తెలంగాణ టూరిజం శాఖ వేసవి విహారయాత్రల ప్యాకేజీలను ప్రకటించింది. సింగిల్స్ అయినా, కపుల్స్ అయినా ఫ్యామిలీ అయినా అందరికీ సరిపోయేలా అందుబాటు ధరలలో గోవా, అరకు, పాపికొండలు, కాళేశ్వరం ఇలా అడ్వెంచర్స్ చేయదగిన ప్రదేశాల నుంచి అధ్యాత్మిక కేంద్రాల వరకు టూరింగ్ ప్యాకేజీలు ప్రకటించింది.
వాటికి సంబంధించిన కొంత సమాచారం మీకు సేకరించి ఇక్కడ అందిస్తున్నాం. మీకు నచ్చితే, మీ బడ్జెట్‌లో ఉంటే ఈ వేసవిలో కొన్నిరోజులు ఎక్కడికైనా హాయిగా విహారానికి వెళ్లి మిమ్మల్ని మీరు రిఫ్రెష్ చేసుకోండి.
గోవా టూర్:
చాలా మందికి గోవా వెళ్లడం అంటే ఒక కల, ఒక తెలియని ఉత్సాహం. గోవాలో చూడటానికి సుందరమైన బీచ్‌లు, చేయడానికి ఎన్నో అడ్వెంచర్లు, ఆస్వాదించడానికి ప్రశాంతమైన వాతావరణం, అనుభవించడానికి... ఎన్నో రుచులు, ఇక్కడి జీవనశైలి ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. మీరు గోవా వెళ్తే వీటిని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు.
తెలంగాణ టూరిజం ఉత్తర గోవా, మపుసా నగరం, లార్డ్ బోడ్గేశ్వర్ ఆలయం, ఫోర్ట్ అగ్వాడా, వివిధ బీచ్‌లు, బోట్ క్రూజింగ్‌ను కవర్ చేసే విధంగా నాలుగు రోజుల ప్యాకేజీని అందిస్తోంది.
ధరలు:పెద్దలకు రూ.9,900/- పిల్లలకు రూ.7,920/- సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.12,900/- బషీర్‌బాగ్ నుండి బయలుదేరుతుంది. బుకింగ్‌ల కోసం +91 98485 40371కి కాల్ చేసి సంప్రదించవచ్చు.
అరకు టూర్:
ప్రకృతి చేసిన అందాల మాయ అరకులోయ. ఇక్కడి ప్రకృతి సౌందర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకులో విహారానికి తెలంగాణ టూరిజం నాలుగు రాత్రులు-మూడు రోజుల పర్యటన కోసం ప్యాకేజీ ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా అన్నవరం, సింహాచలం, వైజాగ్, నౌకాశ్రయంలో బోటింగ్, RK బీచ్, మ్యూజియం, కైలాసగిరి, అరకు, బొర్రా గుహలు, అనంతగిరి తదితర ప్రాంతాలను చూడవచ్చు.
ధరలు: పెద్దలకు రూ.6,540/-, పిల్లలకు రూ.5,524/-
కాళేశ్వరం ప్యాకేజీ టూర్:
కాళేశ్వరం ఒక అద్భుతం, మనిషి మేధోసంపత్తికి ఇక్కడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిదర్శనం. ఈ తరహా ప్రాజెక్ట్ ప్రపంచంలోనూ ఎక్కడా నిర్మించలేదు. ఎందుకంటే నది వెళ్లే దిశకు అపసవ్య దిశకు లిఫ్ట్ ఇరిగేషన్ చేసే ప్రాజెక్ట్ ఇది. జీవనది గోదావరి మార్గాన్ని మళ్లించే ప్రాజెక్టుగా దీనికి ప్రత్యేకత ఉంది. తెలంగాణ టూరిజం ప్యాజేలో భాగంగా కాళేశ్వరం ఆలయ సందర్శన, కన్నేపల్లి పంప్ హౌస్ వీక్షణ చేయవచ్చు. ధరలు: పెద్దలకు రూ.1,850/- పిల్లలకు రూ.1,490/-
పాపికొండలు రోడ్ - రివర్ క్రూయిజ్ ప్యాకేజీ టూర్:
పాపికొండల మధ్యన గోదావరి నదిలో పడవ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. తెలంగాణ టూరిజం అందించే ప్యాకేజీలో భద్రాచలం దేవాలయం సందర్శన, పర్ణశాల సందర్శన, పాపికొండలు, పేరంటపల్లికి బోటింగ్ ఉన్నాయి. ధరలు: పెద్దలకు రూ.5,999/- పిల్లలకు రూ.4,799/-
ఈ ప్యాకేజీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
సంబంధిత కథనం