Thursday Motivation: మీ పిల్లలు చదువులో వెనకబడితే చులకనగా చూడకండి, వారి విజయాలకు పునాది వేయాల్సింది తల్లిదండ్రులే
Thursday Motivation: పిల్లలకు తల్లిదండ్రులే అండగా ఉండాలి. వారు చదువులో వెనకబడితే ముందుండి నడిపించాల్సింది తల్లిదండ్రులే.
Thursday Motivation: థామస్ ఆల్వా ఎడిసన్... ఇప్పుడు మనందరి ఇళ్లల్లో బల్బులు వెలుగుతున్నాయంటే కారణం అతనే. బల్బు కనిపెట్టే ప్రయాణంలో వందల సార్లు ఫెయిల్ అయినా కూడా మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఒకప్పుడు అతడు పనికిరానివాడని, చదువు రానివాడని స్కూల్లో టీచర్లు పక్కన పెట్టారు.
ఓ రోజు చిన్నపిల్లడైనా థామస్ అల్వా ఎడిసన్ ఇంటికి వచ్చి తన తల్లికి ఒక లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ స్కూల్లో టీచర్ ఇచ్చారని చెప్పాడు. అప్పటికి ఇంకా థామస్ అల్వా ఎడిసన్ కి చదవడం రాదు. ఆ లెటర్ అమ్మకు ఇచ్చి ‘అమ్మా... ఇందులో ఏముందో చదువు’ అని అడిగాడు. వాళ్ళ అమ్మ ఆ లెటర్ ఓపెన్ చేసి చదివింది. ‘మీ కుమారుడు జీనియస్. అతనికే అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. అలాంటి వ్యక్తికి చదువు చెప్పలేము’ అని రాశారని వారి తల్లి చదివి వినిపించింది. అది విన్న థామస్ చాలా ఆనందపడ్డాడు. మరుసటి రోజు నుంచి స్కూలుకి వెళ్లడం మానేశాడు. అతని తల్లి దగ్గరే చదువు నేర్చుకోవడం మొదలుపెట్టాడు.
ఎడిసన్ చదువుపై చాలా ఆసక్తి చూపించేవాడు. అతని తల్లి అన్ని విషయాలను ఆయనకి బోధించేది. అనేక రకాల వస్తువులను ఎడిసన్ కనిపెట్టాడంటే అతని విజయం వెనక ఉన్నది తల్లి. కొన్నాళ్లకు ఆమె మరణించింది. ఎడిసన్ ఓ రోజు ఇల్లు శుభ్రం చేస్తుంటే ఓ ట్రంకు పెట్టెలో తాను స్కూల్లో ఉన్నప్పుడు టీచర్లు ఇచ్చిన పాత ఉత్తరం దొరికింది. అది తీసి చదివాడు థామస్. అందులో ‘మీ కొడుకు చాలా బలహీనుడు. అతనికి చదువు రాదు. మీ అబ్బాయికి మేము చదువు చెప్పలేము. దయచేసి మీ అబ్బాయిని స్కూలుకి పంపించకండి’ అని ఉంది. అది చదవగానే థామస్ కళ్ళ నుంచి నీళ్లు వచ్చాయి.
తన తల్లి కొడుకు మానసిక ధైర్యాన్ని దెబ్బతీయకూడదని ఆ లెటర్ ను మార్చి చదివిన సంగతి గుర్తుకొచ్చింది ఎడిసన్‌కు. తన తల్లి ఆరోజు అలా చేయకపోతే తాను ఇంత గొప్పవాడిని అయ్యేవాడు కాదని అనుకున్నాడు థామస్. ఒక్క థామస్ తల్లే కాదు. అందరూ పిల్లల తల్లిదండ్రులు ఇలాగే ఉండాలి. పిల్లలు చదవలేదని చాలా బాధపడేవారు. ఎంతోమంది అలాగే చదువు రావట్లేదని పిల్లల్ని కొట్టి తిట్టి బాధపెట్టే వారు కూడా ఎంతోమంది. అలా చేసే బదులు మీ పిల్లాడు ఎందుకు వెనుకబడుతున్నాడో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ‘నువ్వు చదవవు, నీకు ఏమీ రాదు, నువ్వు పనికిమాలిన వాడివి’ ఇలాంటి తిట్లు పిల్లలను ముందు మాట్లాడడం మానేయండి.
థామస్ జీవితాన్నే ఉదాహరణగా తీసుకోండి. మీ వంతు ప్రయత్నం కూడా ఇంటి దగ్గర చేయండి. ఉదయం స్కూల్లో చదివిన తర్వాత ఇంటికి వచ్చాక మీరు కూడా కూర్చోబెట్టి చదివించడానికి ప్రయత్నించండి. ఆ సమయంలో వారిని కఠినంగా ఉండకండి. ప్రేమగా చదువు విలువను తెలపండి. ఇలా పిల్లలను ప్రేమగా, నమ్మకంగానే నేర్పించుకోవాలి. వారిలో నెగెటివిటీ పెరగకుండా చూసుకోండి. కొంతమందికి చదువు రాకపోతే దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇస్తాడు. మీ పిల్లలకు కూడా అలాంటి టాలెంట్ ఏమైనా ఉందేమో గమనించండి. అందులో వారిని ప్రోత్సహించండి. కచ్చితంగా మీ పిల్లలు ఉన్నత స్థాయిలకు వెళ్తారు. ఏదైనా సరే వారిలోని లోపాలను చూసి కించపరచడం, వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం మాత్రం మానేయండి ఇలా చేస్తే వారు కుంగిపోతారు.
టాపిక్