Car Maintenance | కొత్తగా కారు కొంటున్నారా? ఈ మెయింటెనెన్స్ టిప్స్ మీకోసమే!
Car Maintenance.. తొలిసారి ఓ కారు ఇంటికి వస్తుందంటే ఆ ఆనందమే వేరు. కొత్త కారైనా, సెకండ్ హ్యాండ్ కారైనా.. కారు కారే! అయితే లక్షలు పోసి కొన్ని కారును ఇంట్లో మనిషిలాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటేనే అది ఎక్కువ కాలం మనకు సేవ చేస్తుంది. తొలిసారి కారు కొంటున్న వారికి దానిని ఎలా మెయింటేన్ చేయాలన్నది తెలియదు.
కారును సరిగా మెయింటేన్ చేయపోతే.. దాని రిపేర్లకే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటించి.. మీ కారును జాగ్రత్తగా చూసుకోండి.
ఓ కన్నేసి ఉంచండి
కారు కొన్న తర్వాత దానిని నడిపే సమయంలో ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. దాని పనితీరులో ఏమైనా మార్పు కనిపిస్తోందా? ఎక్కడైనా ఆయిల్ లీకవుతోందా? ఏదైనా వింత వాసన వస్తోందా? వంటివి గమనిస్తూ ఉండాలి. అలాగే డ్యాష్‌బోర్డులో కారుకు సంబంధించిన కొన్ని ఇండికేటర్లు ఉంటాయి. వాటిని ఎప్పుడూ చెక్ చేస్తుండాలి. ఫ్యుయెల్ ఇండికేటర్, ఇంజిన్ లైట్, సీట్‌బెల్ట్ లైట్, ఇతర వార్నింగ్ లైట్లను పరిశీలించాలి. బ్రేకులు వదులు కావడం, స్టీరింగ్ సరిగా తిరగకపోవడం, మైలేజీ తగ్గడం వంటి వాటిపైనా ఓ కన్నేసి ఉంచాలి. మొదట్లోనే వీటిని గమనించి బాగు చేయించుకుంటే తక్కువ ఖర్చుతో బయటపడొచ్చు. లేదంటే చేతి చమురు భారీగా వదులుతుంది.
మాన్యువల్ ఎప్పుడూ వెంటే..
కారు మాన్యువల్ ఎప్పుడూ కార్లోనే ఉంచండి. ఎప్పటికప్పుడు దానిని చూస్తూ ఉండండి. కారును సరిగా ఎలా మెయింటేన్ చేయాలో మాన్యువల్‌ను చూస్తే తెలుస్తుంది. ఇది కారుకు సంబంధించిన టెక్నికల్ సమాచారం కూడా ఇస్తుంది. ఒకవేళ మీ దగ్గర మాన్యువల్ లేకపోతే.. సదరు కారు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
టైర్లు చెక్ చేయండి
టైర్లలో గాలి ఎప్పుడూ చెక్ చేస్తూ ఉండటం వల్ల కారు మైలేజీ స్థిరంగా ఉంటుంది. అలాగే టైర్ల జీవితకాలం కూడా ఎక్కువ అవుతుంది. కొన్ని రోజులు కారు తీయకపోతే టైర్లలో గాలి తగ్గిపోతుంది. ఆ సమయంలో వెంటనే వాటిలో గాలి నింపండి. కనీసం నెలకోసారి అయినా టైర్లలో గాలిని చెక్ చేయాల్సిందే.
టైమ్‌కు సర్వీస్
కారును రెగ్యులర్‌గా కడుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కారు నీట్‌గా కనిపించడంతోపాటు పెయింట్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. తుప్పు కూడా పట్టదు. ఇక కారును కంపెనీ చెప్పినట్లుగా సమయానికి సర్వీస్‌కు తీసుకెళ్తూ ఉండటం అనేది అన్నింటి కన్నా ముఖ్యమైనది. అన్నీ పరిశీలించిన తర్వాతే కంపెనీ ఈ సర్వీస్ మాన్యువల్‌ను తయారు చేస్తుంది. అందువల్ల దానిని కచ్చితంగా ఫాలో కావాలి. సర్వీస్ చేసే సమయంలో ఆయిల్ మార్చడం, ఆయిల్, ఎయిర్ ఫిల్టర్లు మార్చడం, టైర్ అలైన్‌మెంట్, టైమింగ్ బెల్ట్ మార్చడం వంటివి చేస్తుంటారు. ఇవి కారు కండిషన్‌లో ఉండటానికి చాలా అవసరం.
బ్యాటరీ జాగ్రత్తగా..
కారులోని భాగాల్లో ముఖ్యమైన వాటిలో బ్యాటరీ కూడా ఒకటి. దానిని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుంటే.. ఎక్కువ కాలం పని చేస్తుంది. బ్యాటరీ గురించి సమాచారం కూడా యూజర్ మాన్యువల్‌లోనే ఉంటుంది. బ్యాటరీని క్లీన్ చేసే ముందు వాటి కనెక్షన్లు తీసేసి.. క్లీనింగ్ బ్రష్‌తో క్లీన్ చేయాలి.
ర్యాష్ డ్రైవింగ్ వద్దు
కారు ఎక్కువ కాలం బాగుండాలంటే ర్యాష్‌గా డ్రైవింగ్ చేయకూడదు. ఆక్సెలరేటర్‌ను ఇష్టం వచ్చినట్లుగా తొక్కుతూ, వదులుతూ ఉంటే ఇంజిన్‌పై ఎక్కువ భారం పడుతుంది. కారును సాధ్యమైనంత వరకూ ఒకే స్పీడులో నడిపిస్తే.. ఇంజిన్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
సంబంధిత కథనం