Skincare tips for men: అబ్బాయిలు ఫాలో అవ్వాల్సిన సింపుల్ స్కిన్ కేర్ రొటీన్..
Skincare tips for men: అబ్బాయిలు కూడా వేసవిలో స్కిన్ కేర్ రొటీన్ పాటించాల్సిందే. చర్మం ఆరోగ్యంగా, హైడ్రెటెడ్ గా ఉండటానికి ఏం చేయాలో చూసేయండి.
అబ్బాయిలు మామూలుగానే చర్మం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వేసవిలో కూడా అదే తీరు కొనసాగితే చర్మం నల్లగా, నిర్జీవంగా మారుతుంది. వివిధ చర్మ సమస్యలు మొదలవుతాయి. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి.
1. చర్మాన్ని ఎండనుంచి కాపాడాలి:
చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించుకోవాలి. అందుకే బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉన్న సన్ స్క్రీన్ , ఎస్‌పీఎఫ్ 30 లేదా అంతకన్నా ఎక్కువున్నది వాడాలి. ఎండనుంచి ముఖం కాపాడుకోడానికి సన్ గ్లాసెస్, క్యాప్ వాడాలి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.
2. క్లెన్సింగ్:
చెమట, మురికి, జిడ్డు వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. కనీసం రోజుకు రెండు సార్లు ముఖం కడుక్కుంటే మంచిది. గాఢత ఎక్కువున్న సబ్బుల జోలికి పోవద్దు. అలాగే ఎక్కువగా స్క్రబ్ కూడా చేయొద్దు. దీనివల్ల చర్మంలో సహజంగా ఉన్న నూనెలు తగ్గిపోతాయి. అబ్బాయిల కోసమే తయారుచేసిన ఫేస్ వాష్ వాడటం ఉత్తమం.
3. హైడ్రేషన్:
వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. వేడి, తేమ వల్ల చర్మం తేమ కోల్పోతుంది. పొడిగా, నిర్జీవంగా మారుతుంది. అందుకే లైట్ వెయిట్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ వాడాలి. హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్ ఎంచుకోవడం ఉత్తమం.
4. ఎక్స్ఫోలియేషన్:
దీనివల్ల చర్మం మీద ఉన్న మృతకణాలు తొలిగిపోతాయి. వారానికి రెండు సార్లు ఫేషియల్ స్క్రబ్ వాడొచ్చు. గాఢత ఎక్కువున్న, మరీ గరుకుగా ఉన్న స్క్రబ్ వాడకండి.
5. పెదవులు:
పెదవులు కూడా ఎండలవల్ల పొడిగా అవుతాయి. పగులుతాయి. అందుకే ఎస్ పీ ఎప్ ఉన్న లిప్ బామ్ వాడండి. షియా బటర్, బీస్ వ్యాక్స్ లాంటివి పెదాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
6. జీవనశైలి:
సరైన స్కిన్ కేర్ రొటీన్ తో పాటూ సరైన జీవన శైలి అలవాటు చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లుండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ తగ్గించాలి.