Sankranthi Sweet Recipes: చక్కెర పొంగలి, వెన్నప్పాలు, ఓట్స్ స్వీట్ పొంగలి - సంక్రాంతికి తీయని ప్రసాదాలు
Sankranthi Sweet Recipes: సంక్రాంతి వచ్చిందంటే తీపి ప్రసాదాలు రెడీ అయిపోతాయి. ఈసారి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? కొన్ని రెసిపీలు ఇవిగో.
Sankranthi Sweet Recipes: తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్‌లో పెద్ద పండుగగా నిర్వహించుకుంటారు సంక్రాంతిని. సంక్రాంతి వచ్చిందంటే తీపి రుచులు ఎన్నో ఇంట్లో తయారయిపోతాయి. ఈసారి ఏం వండాలని ఆలోచిస్తున్నారా? మేమిక్కడ కొన్ని రెసిపీలు ఇచ్చాము. ఇవి చాలా సింపుల్‌గా అయిపోతాయి. రుచిలో కూడా వీటికి సాటి లేదు. ఓట్స్‌తో చేసే స్వీట్ పొంగలి, వెన్నప్పాలు, చక్కెర పొంగలి... ఇవి చేస్తే నైవేద్యాలుగాను ఉపయోగపడతాయి, నాలికను తీపి చేసేందుకు రెడీగా ఉంటాయి. వీటిని సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం.
చక్కెర పొంగలి రెసిపీ
చక్కెర పొంగలి రెసిపీ కావాల్సిన పదార్థాలు
బియ్యం - అరకప్పు
పెసరపప్పు - పావు కప్పు
బెల్లం తురుము - అరకప్పు
పంచదార - మూడు స్పూన్లు
నీళ్లు - అర కప్పు
యాలకుల పొడి - ఒక స్పూను
జీడిపప్పు - గుప్పెడు
ఎండు ద్రాక్షలు - గుప్పెడు
ఎండు కొబ్బరి తురుము - రెండు స్పూన్లు
పచ్చ కర్పూరం - చిటికెడు
నెయ్యి - ఐదు స్పూన్లు
చక్కెర పొంగలి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి పెసరపప్పుని వేసి వేయించాలి. చిన్న మంట మీద వేయిస్తే మాడిపోకుండా ఉంటాయి.
2. కాస్త రంగు మారాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం ఈ వేయించుకున్న పెసరపప్పు కలిపి ఓసారి కడిగి కుక్కర్లో అన్నంలా వండుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో బెల్లం తురుము, పంచదార నీళ్లు పోసి మరగనివ్వాలి.
4. ఈ బెల్లం ఒకసారి పొంగు రాగానే కట్టేయాలి.
5. ఇప్పుడు కుక్కర్ మూత తీసి ఉడికిన పెసరపప్పు, అన్నంలో ఈ బెల్లం పాకాన్ని వేసి కలుపుతూ ఉండాలి.
6. యాలకుల పొడిని చల్లుకోవాలి. అలాగే రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి.
7. చిన్న మంట మీద ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి.
8. నీళ్ల పాకం తగ్గి కాస్త గట్టిగా అయ్యేవరకు ఉంచాలి.
9. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి.
10. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పును, ఎండుద్రాక్షలను వేయించి ఈ చక్కెర పొంగలిలో వేయాలి.
11. అంతే చక్కెర పొంగలి రెడీ అయినట్టే.
.............................
వెన్న అప్పాలు
వెన్న అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి - ఒక కప్పు
బియ్యప్పిండి - ఒక కప్పు
బెల్లం తురుము - రెండు కప్పులు
నెయ్యి - మూడు స్పూన్లు
నూనె - తగినంత
వెన్న - పావు కప్పు
వెన్న అప్పాల రెసిపీ
1. ఒక గిన్నెలో బియ్యప్పిండి, గోధుమపిండి, తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి.
2. కొంచెం నీళ్లు వేసి ముద్దగా చేసుకోవాలి.
3. ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి రాసుకొని ఆ ముద్దను నిమ్మకాయంత సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి.
4. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె బాగా వేడెక్కాక ఈ లడ్డూలను అందులో వేసి వేయించుకోవాలి.
6. అంతే వెన్న అప్పాలు రెడీ అయినట్టే
........................
ఓట్స్ తీపి పొంగలి
ఓట్స్ తీపి పొంగలి రెసిపీకి కావాల్సిన
పెసరపప్పు - ఒక కప్పు
ఓట్స్ - ఒక కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
పాలు - మూడు స్పూన్లు
ఓట్స్ తీపి పొంగలి రెసిపీ
1. ఓట్స్, పెసరపప్పు కుక్కర్లో వేసి నాలుగు కప్పుల నీళ్లను వేసి విజిల్ పెట్టి ఉడికించాలి.
2. తరువాత కుక్కర్ మూత తీసి అందులో బెల్లం వేసి బాగా మరిగించాలి.
3. అందులో పాలను వేసి కలపాలి. ఇది చిక్కగా అయ్యేదాకా ఉడికించాలి.
4. స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి అందులో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండు ద్రాక్షలను వేసి వేయించాలి.
5. వీటిని కుక్కర్ లోని ఓట్స్ మిశ్రమంలో కలపాలి.
6. యాలకుల పొడిని చల్లుకొని ఒకసారి కలిపి స్టవ్ కట్టేయాలి.
7. అంతే ఓట్స్ తో స్వీట్ పొంగలి రెడీ