Rajma masala: పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా.. ఇంట్లోనే చేసుకోండి..-rajma masala recipe in detailed steps and measurements ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rajma Masala: పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా.. ఇంట్లోనే చేసుకోండి..

Rajma masala: పంజాబీ స్టైల్ రాజ్మా మసాలా.. ఇంట్లోనే చేసుకోండి..

Koutik Pranaya Sree HT Telugu
Aug 22, 2023 01:10 PM IST

Rajma masala: నార్త్ ఇండియన్ స్టైల్ రాజ్మా కర్రీని ఇంట్లోనే రుచిగా ఎలా తయారుచేసుకోవాలో చూసేయండి.

రాజ్మా మసాలా
రాజ్మా మసాలా (https://creativecommons.org/licenses/by-sa/4.0)

ఉత్తర భారతదేశంలో రాజ్మా కర్రీ, అన్నంతో కలుపుకుని చాలా ఎక్కువగా తింటారు. మన దగ్గర కూడా చాలా మంది రాజ్మా చావల్ తినడానికి ఇష్టపడతారు. అయితే ఇంట్లో చేస్తే బయట రెస్టారెంట్లలో తిన్న రుచి రాదని వండుకోం. అందుకే పంజాబీ స్టైల్ రాజ్మా కర్రీ సులభంగా ఇంట్లోనే, అదే రుచితో ఎలా చేయాలో చూసేయండి.

కావలసిన పదార్థాలు:

1 కప్పు రాజ్మా

1 బిర్యానీ ఆకు

1 నల్ల ఏలకులు

1 టేబుల్ స్పూన్ నెయ్యి

అరచెంచా జీలకర్ర

1 అంగుళం దాల్చిన చెక్క ముక్క

4 లవంగాలు

1 ఉల్లిపాయ సన్నని తరుగు

సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్

2 కప్పుల టమోటా గుజ్జు

పావు టీస్పూన్ పసుపు

1 చెంచా కారం

అరచెంచా ధనియాల పొడి

సగం చెంచా జీలకర్ర పొడి

సగం టీస్పూన్ ఆమ్‌చూర్ పౌడర్

సగం చెంచా గరం మసాలా

తగినంత ఉప్పు

1 చెంచా కసూరి మేతి

కొద్దిగా కొత్తిమీర తరుగు

తయారీవిధానం:

  1. రాజ్మా గింజల్ని శుభ్రంగా కడుక్కున్ని అవి మునిగేటంత నీళ్లు పోసి 12 గంటల పాటూ నానబెట్టాలి.
  2. తర్వాత నీళ్లు వంపేసి కుక్కర్లో వేసుకుని 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, ఉప్పు, నల్ల యాలకులు వేసుకుని కలుపుకోవాలి. 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వీటిని పక్కన పెట్టుకోవాలి.
  3. ఒక పెద్ద కడాయిలో ఒక చెంచా నెయ్యి వేసుకుని, వేడి చేసుకోవాలి. జీలకర్ర, దాల్చిన చెక్క ముక్క, లవంగాలు వేసుకుని వేగనివ్వాలి.
  4. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుని రంగు మారేదాక వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా గుజ్జు కూడా వేసుకోవాలి. మూత పెట్టి నూనె తేలేవరకు ఉడకనివ్వాలి.
  5. సన్నని మంటమీద ఉంచి పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్‌చూర్ పొడి, గరం మసాలా , ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  6. ఇప్పుడు ఉడికించిన రాజ్మా కూడా వేసుకుని కలుపుకోవాలి. మూతపెట్టి పావుగంట వరకు రసంలో ఉడకనివ్వాలి. కూర చిక్కబడేవరకు అలాగే కలుపుతూ ఉండాలి.
  7. చివరగా కసూరీ మేతీ, కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ రాజ్మా మసాలా కూరను జీరా రైస్ లేదా వైట్ రైస్ తో కలిపి సర్వ్ చేసుకోవచ్చు.

Whats_app_banner