Sibling relationship: మీరు పెంపకంలో ఈ తప్పులు చేస్తే.. మీ పిల్లల మధ్య ద్వేషం పెరుగుతుంది..
Sibling relationships: పిల్లల మధ్య సఖ్యత ఉండాలన్నా, ఎలాంటి గొడవలు రాకూడదన్నా తల్లి దండ్రుల పెంపకం ముఖ్య పాత్ర పోషిస్తుంది. తల్లిదండ్రులు పేరెంటింగ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.
పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే వాళ్ల మధ్య సఖ్యత పెరగాలన్నా, ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలన్నా తల్లిదండ్రులుగా కొన్ని మార్పులు, చేర్పులు చేయాలి. లేదంటే ఒకరిమీద ఒకరికి పంతం, కోపం పెరిగిపోతాయి. వాళ్ల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోండి.
ఏం చేయాలి:
తేడాలను గౌరవించండి:
ప్రతి బిడ్డ విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. ఇలాగే ఉండాలని బలవంతపెట్టడం కన్నా వారికున్న విభిన్న లక్షణాలను ప్రేమించాలి. ఇద్దరూ ఒకరిలో ఉన్న భిన్న లక్షణాలను గౌరవించేలా, ఇష్టపడేలా నేర్పించాలి.
పిల్లల కోసం టాస్క్‌లను రూపొందించండి:
పిల్లలిద్దరికీ కలిపి కొన్ని ఇద్దరు కలిసి ఆడుకోగల ఫన్నీ టాస్కులు ఇవ్వాలి. దానివల్ల కలిసి పనిచేయడంతో పాటూ, ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకుంటారు.
ఒకరికొకరు తోడుండేలా:
మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో పిల్లలకు నేర్పించాలి. ఒకరిమీద ఒకరికి శ్రద్ధ, ఆప్యాయత చూపించేలా అలవాటు చేయాలి.
కొన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి:
చిన్న చిన్న గొడవలను పట్టించుకోకుండా ఉండొచ్చు. పిల్లలకు కాస్త సమయం ఇవ్వాలి. కానీ ఏదైనా గొడవ, మాటల విషయంలో తీవ్రంగా అనిపిస్తే వెంటనే జోక్యం చేసుకోవాలి. తప్పేంటో తెలియజెప్పాలి.
ఆక్సిటోసిన్:
వారు సంతోషంగా ఉండటానికి సహాయపడే సరదా కార్యకలాపాలను మనం ప్రోత్సహించాలి. ఈ విధంగా వారు ఒకరితో ఒకరు మరింత కనెక్ట్ అవుతారు.
ఏం చేయకూడదు:
ప్రేమలో పక్షపాతం :
ప్రేమ ఇద్దరి పిల్లల మీద సమానంగా ఉండాలి. ఒకరిని తక్కువ ఎక్కువ చేసి చూస్తే మరొకరికి వాల్ల మీత శతృత్వం పెరుగుతుంది.
పోటీని సృష్టించడం:
మనం పిల్లల మధ్య పోటీని సృష్టించకూడదు. ఒకరినొకరు ప్రేమించుకోవడం, అన్ని సమయాల్లో కలిసి ఉండటం నేర్పించాలి.
ఒకరిని చూసుకోమనడం:
ఇద్దరికీ ఒకరి గురించి ఒకరు కేర్ తీసుకోవడం నేర్పించాలి. ఆ బాధ్యత ఒకరిమీదే ఉంచకూడదు.
పట్టించుకోకపోవడం:
వాళ్లిద్దరి మధ్య సంబంధం పాడవుతున్నపుడు, ఎవరైనా ఒకరు ఇంకొకర్ని ఇబ్బంది పెడుతున్నపుడు పట్టించుకోకుండా ఉండటం సరికాదు.