Paneer Attu | వేడి వేడి పనీర్ అట్టు.. దీని రుచికి మీరు ఫిదా అవుతారు, ఒట్టు!
వర్షాకాలం ఉదయం వేడివేడిగా అట్టు తింటే చాలా బాగుంటుంది. మరింత రుచికరంగా, కేవలం 10 నిమిషాల్లో పనీర్ అట్టు ఎలా తయారు చేసుకోవాలో రెసిపీ ఇక్కడ ఉంది.
టిఫిన్స్ విషయానికి వస్తే సౌత్ ఇండియాలో మనకు ఎన్నో రకాల రుచికరమైన అల్పాహారాలు ఉన్నాయి. ఇడ్లీ, దోశ, వడ ఏదైనా సరే ఇక్కడి అల్పాహారాలకు ఎవరైనా మనసు పారేసుకోవాల్సిందే. మనం దోశకు ప్రత్యామ్నాయంగా అప్పుడప్పుడు అట్టు చేసుకుంటాం. పుల్లని పుల్లట్టు పంటికి అంటింతే జీవం లేచి వస్తుంది. అయితే మామూలు అట్టుకే ఇలా ఉంటే పనీర్ అట్టు ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. చక్కగా ఒక అట్టు దానిపై కొంచెం పనీర్, ఆపైన ఉల్లిపాయలు, కొత్తిమీర వేసి పెనంపై బాగా కాల్చి వేడివేడిగా అట్టు చేసుకొని తింటే ఈ వర్షాకాలంలో ఉదయం వేళ అద్భుతంగా ఉంటుంది. దీనిని సాయంత్రం సమయంలోనూ చేసుకోవచ్చు.
మీరు మరింత రుచికరంగా పనీర్ అట్టు ఎలా తయారు చేసుకోవాలి. ఏమేం పదార్థాలు ఉపయోగించాలి? తెలుసుకోవాలంటే ఇక్కడ రెసిపీ అందిస్తున్నాం. ఇది ఎంతో సులభమైన రెసిపీ, మీరు త్వరగా కూడా ఈ అల్పాహారాన్ని సిద్ధం చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
1 కప్పు శనగపిండి
1/2 కప్పు పనీర్
1/2 స్పూన్ ఉప్పు
1 స్పూన్ మిరియాల పొడి
1 ఉల్లిపాయ
1 టమాట
2 పచ్చిమిర్చి
1/2 టీస్పూన్ వాము
తాజా కొత్తిమీర
1 కప్పు నీరు
తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, ఉల్లిపాయ ముక్కలు, తురిమిన పనీర్, టొమాటో ముక్కలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, వాము అలాగే కొద్దిగా తాజా కొత్తిమీర కలపండి. ఆపైన నీరు పోసుకొని బ్యాటర్ తయారు చేసుకోండి.
అట్లు పోసుకోడానికి వీలుగా మిశ్రమాన్ని తగినంత నీటిని కలుపుకోండి.
ఇప్పుడు పాన్ తీసుకుని ఒక స్పూన్ నూనె పోసి వేడిచేయాలి. ఆపై పైన కలుపుకున్న మిశ్రమంతో అట్టు పోసుకోవాలి.
అట్టును క్రిస్పీగా, బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
అనంతరం పైనుంచి తురిమిన పనీర్, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర ఆకులను చల్లండి.
అంతే, ఈ అట్టును మడిచి సర్వింగ్ ప్లేటులోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేయండి. రెడ్ చిల్లీ చట్నీతో లేదా ఊరగాయతో అయినా కలిపి తీసుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది.
సంబంధిత కథనం