గంటకు 100 కిమీ వేగంతో దూసుకుపోయే Oben Rorr ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది!
ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఒబెన్ EV.. ‘ఒబెన్ రోర్’ పేరుతో తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 99,999/- గా ఉంది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊపందుకుంటోంది. EV కంపెనీలు పోటీపడుతూ కొత్త మోడెల్ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ ఒబెన్ EV.. ‘ఒబెన్ రోర్’ పేరుతో తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. మహారాష్ట్ర ఎక్స్-షోరూమ్ వద్ద దీని ధర రూ. 99,999/- గా ఉంది. ఈ బైక్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగలవారు తమ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 999 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. మార్చి 18 నుంచి ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. దీని టెస్ట్ డ్రైవ్‌లు మేలో ప్రారంభమవుతాయని, కస్టమర్ డెలివరీలు జూలై 2022లో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
కొత్త ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను మొదటి దశలో ఏడు రాష్ట్రాల్లో అందిస్తున్నారు. రాష్ట్రాన్ని బట్టి ధరలు మారుతూ ఉంటాయి. బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, ముంబై, దిల్లీ, సూరత్, అహ్మదాబాద్, జైపూర్ నగరాల్లో ఓబెన్ రోర్ కొనుగోలు కోసం అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు- స్పెసిఫికేషన్లు
ఒబెన్ రోర్ e-బైక్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారంగా పనిచేస్తుంది. దీనికి 10 kW ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. ఇది 13.4 bhp వద్ద 62 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 3 సెకన్లలోనే 0-40 kmph పికప్ అందుకోగలదు. ఈ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
ఇందులో ఎకో, సిటీ, హవోక్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ను ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే 200 కిలోమీటర్ల దూరం పరిధిని అందిస్తుందని ఓబెన్ EV పేర్కొంది. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని తెలిపింది.
డిజైన్, లుక్స్ పరంగా కూడా ట్రిపుల్-టోన్ కలర్ షేడ్లలో Oben Rorr ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అదనంగా LED హెడ్‌ల్యాంప్, అలాగే LED టర్న్ ఇండికేటర్‌లు, LED టెయిల్‌లాంప్ మరింత స్ప్రోర్టీ లుక్ అందిస్తున్నాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి 6 నెలలకు ఒక కొత్త ఉత్పత్తిని లాంచ్ చేయాలని Oben EV లక్ష్యంగా పెట్టుకుంది.
సంబంధిత కథనం