Migraine: మైగ్రేన్ వల్ల స్ట్రోక్, గుండెపోటు రిస్క్ పెరగుతుందా? వైద్యుల మాట ఇదే-migraine and the risk of stroke and heart attack what you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Migraine: మైగ్రేన్ వల్ల స్ట్రోక్, గుండెపోటు రిస్క్ పెరగుతుందా? వైద్యుల మాట ఇదే

Migraine: మైగ్రేన్ వల్ల స్ట్రోక్, గుండెపోటు రిస్క్ పెరగుతుందా? వైద్యుల మాట ఇదే

Zarafshan Shiraz HT Telugu
Aug 19, 2023 05:30 PM IST

మైగ్రేన్ తలనొప్పి గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు పెంచుతుందా? వీటి మధ్య ఉన్న లింక్ ఏంటి? వైద్య నిపుణుల మాట ఇదీ.

మైగ్రేన్ తలనొప్పి గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెంచుతుందా?
మైగ్రేన్ తలనొప్పి గుండె పోటు, బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెంచుతుందా? (Image by Tumisu from Pixabay)

మైగ్రేన్ అనేది సాధారణంగా తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులతోపాటు, తేలికపాటి కాంతి, ధ్వనికి విపరీతమైన ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. చాలా సందర్భాలలో ఈ తలనొప్పి భరించలేనిదిగా ఉంటుంది. చికిత్స కూడా అవసరమవుతుంది.

ప్రధానంగా దాదాపు ప్రతిరోజూ మైగ్రేన్ తలనొప్పి అనుభవించే వారు విచిత్రమైన దృశ్య లేదా శారీరక అనుభూతులను కూడా గమనిస్తారు. తలనొప్పికి ముందు ఇలా సంభవిస్తుంది. అయితే కొంతమంది దీనిని గమనించకపోవచ్చు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు రకాల మైగ్రేన్‌లు స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రాణాంతక పరిస్థితుల ప్రమాదాన్ని పెంచడంతో పాటు జీవన నాణ్యతను తగ్గిస్తాయి. హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిరానందని హాస్పిటల్‌ కన్సల్టెంట్-న్యూరో, స్పైన్ సర్జరీ డాక్టర్ అశోక్ హండే దీనిపై చర్చించారు.

“స్ట్రోక్ మరణాలకు రెండో అత్యంత సాధారణ కారణం. భారతదేశంలో సంవత్సరానికి 1,85,000 కంటే ఎక్కువ స్ట్రోకులు సంభవిస్తాయి. దాదాపు ప్రతి 40 సెకన్లకు ఒక స్ట్రోక్, ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుంది. మైగ్రేన్‌ తలనొప్పి జనాభాలో 13% మందిని ప్రభావితం చేస్తోంది. వ్యాధి గురించి అవగాహన లేకపోవడం, మెదడు ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయడం సరికాదు. తగిన వైద్య సహాయం, ముఖ్యంగా జీవనశైలి మార్పులు ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు దోహదపడతాయి..’ అని వివరించారు.

“స్ట్రోక్‌తో పోలిస్తే మైగ్రేన్ నిరపాయమైనది. అయితే మైగ్రేన్ రోజు వారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. పరిస్తితిని దయనీయంగా మారుస్తుంది. కాగా మెదడు స్ట్రోక్ లేదా మైగ్రేన్ మధ్య అనుబంధాన్ని వివరించడానికి వివిధ సిద్ధాంతాలు ప్రతిపాదించినప్పటికీ ఖచ్చితమైన కారణాలు స్పష్టం కాలేదు. మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య సంబంధం నిస్సందేహంగా బలమైనది. ఎందుకంటే రెండూ రక్త నాళాలను సరఫరా చేయడానికి సంబంధించినవి. ఇటీవలి అధ్యయనం కూడా మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, స్ట్రోక్, కార్డియోవాస్కులర్ మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని చూపించింది. మరొక అధ్యయనం ప్రకారం, మైగ్రేన్‌లతో బాధపడుతున్న వ్యక్తులు గుండె సంబంధిత సమస్యలతో బాధపడే అవకాశం రెండు రెట్లు ఎక్కువ..’ అని వివరించారు.

‘ఈ మూడు పరిస్థితులను అనుసంధానించడానికి మరిన్ని నిశ్చయాత్మకమైన అధ్యయనాలు అవసరమవుతాయి. మైగ్రేన్‌లతో బాధపడుతున్న వ్యక్తులు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. తద్వారా వారి పరిస్థితిని పర్యవేక్షించడం ద్వారా ప్రాణాంతక పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు..’ అని డాక్టర్ అశోక్ హండే సూచించారు.

‘అర్థం చేసుకోవలసిన మరో అంశం ఏమిటంటే, చాలా మంది వ్యక్తులు సాధారణంగా వారి 20 లేదా 30 సంవత్సరాల వయస్సులో తలనొప్పి లేదా మైగ్రేన్‌లతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి తలనొప్పి మాత్రమే కాకుండా కొత్త లక్షణాలను గమనిస్తే అది మైగ్రేన్ కాకుండా మరేదైనా సంకేతం కావచ్చు కాబట్టి దానిని తేలిగ్గా తీసిపారేయరాదు. సకాలంలో వైద్య సహాయం అందించకపోతే గుండెపోటు, స్ట్రోక్ వంటి పరిస్థితులు ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి వీలైనంత త్వరగా అత్యవసర సంరక్షణను పొందడం ఉత్తమం..’ అని వివరించారు.

WhatsApp channel