Secret of Happy Marriage: భార్యాభర్తల మధ్య బంధం స్వర్గంలా ఉండాలంటే!
Secret of Happy Marriage: భార్యా భర్తల మధ్య అన్యోన్యత, బలమైన బంధం ఉండాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. మీరూ పాటించేయండి.
ఇద్దరు జీవితాలు ఒక్కటిగా కలసి ప్రయాణం చేయడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. ప్రేమ, బాధ్యత ఏ మాత్రం తగ్గినా ఈ బంధం బలహీనంగా మారుతుంది. ఫలితంగా గొడవలు, చికాకులతో కాపురం నరకంగా తయారవుతుంది. మరి భార్య భర్తల మధ్య మంచి బంధం ఉండాలంటే వారిరువురూ చేయాల్సిన కొన్ని పనులను ఎప్పుడూ మరిచి పోకూడదని అంటున్నారు మనసిక నిపుణులు. ఆ పనులేంటో తెలుసుకుందామా?
మాట్లాడుకోండి :
ఇద్దరూ చేస్తున్న పనుల గురించి ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉండండి. ఎందుకంటే కొన్ని సార్లు కమ్యునికేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల అపార్థాలు వస్తాయి. అన్ని విషయాలనూ దాపరికం లేకుండా చక్కగా మాట్లాడుకోండి. మీ వల్ల కాకుండా ఇతరుల వల్ల మీ గురించి ఏ విషయమూ వారికి తెలియకుండా ఉండేలా మీ కమ్యునికేషన్ ఉండాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీ బంధం పట్ల ఎప్పటికీ నిజాయతీగా ఉండండి.
అండగా ఉండండి :
ఎవరి జీవితంలో అయినా సవాళ్లను ఎదుర్కొనే సమయాలు కొన్ని ఉంటాయి. అలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు తిట్టుకోవడం, దూషించుకోవడం లాంటివి చేయకండి. బదులుగా నీకు నేను ఉన్నాను అన్న అండను వారికి కల్పించండి. ఇది దీర్ఘ కాలం పాటు మీ బంధం బలంగా ఉండేందుకు ఎంతో సహకరిస్తుంది. ఎంత కష్టమైనా సరే నువ్వు పక్కనుంటే చాలు.. తేలికగా సమస్యల్ని పరిష్కరించుకుంటాను.. అనే మనో ధైర్యాన్ని వారికి కలిగించేలా మీ ప్రవర్తన ఉండేలా చూసుకోండి.
సమయాన్ని కేటాయించుకోండి :
ఎప్పుడూ ఆఫీసు పనులు, ఇంటి పనులు, బయటి పనులు అంటూ సమయం అంతా వాటితోనే గడపకండి. మీకై వేచి ఉన్న వ్యక్తికి కాసేపు సమయాన్ని ఇవ్వండి. అలా సమయాన్ని కేటాయించ లేకపోతే మీరు ఎదుటి వారిని దూరం పెడుతున్నారన్న భావన వారికి కలుగుతుంది. దీనివల్ల మీ ఇద్దరి మధ్యా దూరం ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇద్దరూ రోజులో కాసేపైనా నాణ్యమైన సమయాన్ని గడపండి.
ప్రశంసించుకోండి :
ఎదుటి వారు చేస్తున్న పని గురించి వీలు కుదిరినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉండండి. అది కూడా నిజాయతీగా ఉండేలా చూసుకోండి. అలాగే అవతలి వారు మీ కోసం చేసిన పనులను గుర్తించండి. అందుకు వారికి కృతజ్ఞతా పూర్వకంగా ఉండండి. ఆ భావాల్ని లోపల ఉంచుకోవడం కాదు. అప్పుడప్పుడూ బయటకు చెబుతూ ఉండండి.
ప్రేమగా ఉండండి :
ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్త పరుచుకోవడం, ఒకరిపై ఒకరు కేరింగ్‌గా ఉండటం అనేది భార్యా భర్తల బంధంలో తప్పనిసరి. ఏడాదికి ఒకటి రెండు సార్లైనా మీరిద్దరూ కలిసి వెకేషన్‌కి వెళ్లి రండి. అది ఇద్దరికీ ఎంతో రీ ఫ్రెషింగ్‌గా ఉంటుంది. బంధం బలోపేతం కావడానికి సహకరిస్తుంది.