Oils and Smoke Points: వంట నూనెల ‘స్మోక్ పాయింట్’ గురించి తెలుసా? ఏ నూనెను దేనికి వాడాలో చెప్పేది ఇదే..
Oils and Smoke Points: వంటనూనెలకు స్మోక్ పాయింట్ ఉంటుంది. దీన్నిబట్టే ఏ నూనెను ఎంత ఉష్ణోగ్రత దాకా వేడి చేయొచ్చనే విషయం తెలుస్తుంది. అది తెలిస్తే ఏ వంటకు ఏ నూనె వాడాలనే విషయంలో స్పష్టత వస్తుంది.
మనకు ప్రతి రోజూ నూనె లేకుండా రోజు గడవదు. నూనెతో చేసిన పదార్థాలు లేకుండా మన ఆహారం పూర్తి కాదు. అందుకనే పామాయిల్, పొద్దు తిరుగుడు, నువ్వుల నూనె, వేరు శెనగ, రైస్ బ్రాన్ ఆయిల్ లాంటి వాటిని ఎక్కువగా ఇంట్లో వాడుతుంటాం.
కొందరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గానుగ నూనెల్ని వాడుతుంటారు. మరి కొందరు రిఫైన్డ్ నూనెల్ని వినియోగిస్తూ ఉంటారు. ఆరోగ్య నిపుణులంతా నూనెల్ని పదే పదే వేడి చేయకూడదని, కాక నూనెల్ని వాడకూడదని చెబుతుంటారు. వేడి చేసిన నూనెల్ని మళ్లీ మళ్లీ వేడి చేయడం వల్ల అవి ప్రమాదకరమైన సమ్మేళనాలను తయారు చేస్తాయని అంటారు. అందువల్ల అవి మన ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతాయని చెబుతుంటారు. అయినా సరే మనమంతా వాడిన నూనెల్ని మళ్లీ మళ్లీ వాడటానికి ఏ మాత్రం వెనకాడం.
స్మోక్ పాయింట్ అంటే ఏమిటి?
నూనెకు స్మోక్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. అంత ఉష్ణోగ్రత వరకు మాత్రమే అది మనకు, మన ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఆ ఉష్ణోగ్రత దాటి దాన్ని వేడి చేసి వాడితే దాని వల్ల చెడే జరుగుతుంది. మనలో అది చెడు కొలెస్ట్రాల్ రూపంలో చేరిపోతుంది. అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకనే ఏ నూనెకు ఎంత స్మోక్ పాయింట్ ఉందనే విషయంపై స్పష్టమైన అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ వివరాలను ఇప్పుడు చూసేద్దాం.
నూనెలు - వాటి స్మోక్ పాయింట్లు :
- 400 నుంచి 500 డిగ్రీల ఫారన్ హీట్ మధ్య స్మోక్ పాయింట్ ఉన్న నూనెలు ఏమిటంటే.. రిఫైన్డ్ అవకాడో నూనె, రిఫైన్డ్ పొద్దు తిరుగుడు నూనె, రిఫైన్డ్ వేరు శెనగ నూనె, రిఫైన్డ్ కొబ్బరి నూనె. అంటే ఇవి డీ ఫ్రైలు, ఫ్రయింగ్‌లు చేసుకోవడానికి పనికి వస్తాయి.
- 400 నుంచి 425 డిగ్రీల ఫారన్ హీట్ మధ్య స్మోక్ పాయింట్ ఉన్న నూనెలు.. రిఫైన్డ్ నువ్వుల నూనె, ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె, అవకాడో నూనె, వెజిటెబుల్ ఆయిల్... లాంటివి. ఇవి కూరలు వండుకోవడానికి, బేకింగ్‌కి పనికి వస్తాయి.
- 300 నుంచి 400 డిగ్రీల ఫారన్ హీట్ మధ్య స్మోక్ పాయింట్ ఉన్న నూనెలు ఏమిటంటే కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు నూనె, వేరు శెనగ నూనె. ఇవన్నీ రిఫైన్డ్ చేయని నూనెలు. ఇవి చిన్న మంట మీద కొంచెం సేపు మాత్రమే వండుకునే కూరలకు అనువైనవి.
- 225 డిగ్రీల ఫారన్ హీట్ స్మోక్ పాయింట్ కలిగిన నూనెలు అవిశె గింజల నూనె ఇంకా బాదం నూనె. ఇవి రెండూ వేడి చేయడానికి అస్సలు పనికి రావు. సలాడ్ల మీద డ్రస్సింగ్‌లా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి.