Life after death: మరణానంతర జీవితం ఉంటుందా? వివిధ మతాలలో ఉన్న నమ్మకాలు ఇవే
Life after death: పుట్టిన ప్రతి మనిషి మరణించాల్సిందే. మరణం తర్వాత ఉండే జీవితంపై ఎంతో మందికి నమ్మకం ఉంటుంది. ముఖ్యంగా వివిధ మతాలలో ఈ నమ్మకాలు కొన్ని పాతుకుపోయి ఉన్నాయి.
Life after death: ‘మరణం తర్వాత జీవితం’ అనే అంశం చాలా విశాలమైనది. ఇది అనేక వివరణలను కలిగి ఉంటుంది. ఒక్కో మనిషి దీని గురించి ఒక్కోలా అభిప్రాయపడతారు. కొందరు మరణానంతర జీవితాన్ని నమ్మితే, మరికొందరు అలాంటిదేమీ లేదని చెబుతారు. ఇక్కడ మేము మరణానంతర జీవితాన్ని నమ్మే వారి గురించే ఈ కథనాన్ని అందిస్తున్నాము. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి వివిధ మతాలలొ రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఒక్కో మతంలో లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎలాంటి విశ్వాసాలు ఉన్నాయో తెలుసుకుందాం.
హిందూ మతం
హిందువులకు నమ్మకాలు ఎక్కువ. హిందూమతంలో మరణానంతర జీవితంపై అనేక భావనలు ఉన్నాయి. వాటిలో ప్రసిద్ధమైనది పునర్జన్మ. హిందూ విశ్వాసాలు, సాంప్రదాయాల ప్రకారం మరణించిన వ్యక్తికి తిరిగి పునర్జన్మ ఉంటుందని అంటారు. తదుపరి జీవితంలో ఎలా ఉంటామన్నది... ముందు జీవితంలో చేసిన పాపపుణ్యాలు నిర్ణయిస్తాయని కూడా అంటారు. హిందువులకు అంతిమ లక్ష్యం మోక్షం. అంటే పునర్జన్మ అనేది ఉండదు. పుణ్యం చేసుకున్న వాళ్లకే మోక్షం లభిస్తుందని, మోక్షం అంటే దైవంతో ఐక్యం అవడం అని వారు భావిస్తారు.
క్రైస్తవ మతం
క్రైస్తవ మతంలో మరణానంతర జీవితం ఏసుక్రీస్తు ఇచ్చే మోక్షంతో అనుసంధానిస్తారు. క్రైస్తవ మత విశ్వాసాల ప్రకారం ఏసును దేవునిగా అంగీకరించి, ఆయన బోధనలను అనుసరిస్తారు. అలాగే పరలోకంలో శాశ్వత జీవితాన్ని పొందుతామని విశ్వసిస్తారు. స్వర్గం శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే ప్రదేశం అని చెప్పుకుంటారు. చివరకు భక్తుడు భగవంతునితో ఏకమవుతాడని విశ్వసిస్తారు. పరలోకంలో తమ ప్రియమైన వారిని తిరిగి కలుస్తామని నమ్ముతారు. అలాగే ఏసు బోధనలను నమ్మని వాళ్ళు, ఇతరులకు అన్యాయం చేసే వాళ్ళు, తమ విధులను నెరవేర్చని వాళ్ళు నరకానికి వెళతారని క్రైస్తవుల నమ్మకం.
జుడాయిజం
జుడాయిజంలో మరణం అనంతరం లభించే జీవితం గురించి భిన్నమైన నమ్మకాలు ఉన్నాయి. జుడాయిజంలో కొన్ని వర్గాల వారు మరణానంతర జీవితాన్ని విశ్వసించరు. కొందరు మాత్రం విపరీతంగా విశ్వసిస్తారు. మరి కొందరు జీవితం అంతం కాదని, అది దైవంతో కలిసేందుకు మరణాన్ని పొందుతుందని నమ్ముతారు. మరణానంతరం జుడాయిజంలో నీతిమంతులు తగిన ప్రతిఫలాన్ని పొందుతారని, తప్పు చేసిన వారు శిక్షకు గురవుతారని అంటారు. జుడాయిజంలో ఇతర బోధనలు మరణం తర్వాత ఏమి జరుగుతుందనే దాని గురించి ఆలోచించరు. వర్తమానంలో నైతిక జీవితాన్ని గడపాలని వివరిస్తారు.
బౌద్ధమతం
బౌద్ధమతంలో హిందువుల మాదిరిగానే మరణానంతర జీవితంపై ఒక అవగాహన ఉంది. బౌద్ధులు కూడా సంసారం అనే చక్రాన్ని విశ్వసిస్తారు. వారికి శాశ్వతమైన మోక్షం అంటే నిర్యాణం అని అంటారు. బౌద్ధ విశ్వాసాల ప్రకారం ప్రజలు చేసిన పనులే జనన, మరణాలకు కారణమవుతాయని నమ్ముతారు. పునర్జన్మల చక్రంలో శాశ్వతంగా చిక్కుకుపోతే మోక్షం లభించదని భావిస్తారు. బౌద్ధులకు మంచి ఆలోచనలు, మంచి పనులు చేయడం, దానధర్మాలు చేయడం, కోరికలకు దూరంగా ఉండడం, ప్రాపంచిక అనుబంధాలను పెంచుకోవడం వంటివి చేస్తే మోక్షం పొందుతామనే నమ్మకం ఉంది.
ఇస్లాం
ఇస్లాంలోనూ మరణానంతర జీవితం పై నమ్మకం ఉంది. ముస్లింలు స్వర్గాన్ని జన్నా అని, నరకాన్ని జహన్నామ్ అని అంటారు. ఈ రెండు కూడా మనుషులు చేసే పనుల ద్వారా వారికి కలుగుతాయని నమ్ముతారు. ధర్మబద్ధమైన జీవితాలను గడిపిన వారికి జన్నాలో ప్రవేశం లభిస్తుందని, చెడు పనులు చేసిన వారికి జహన్నామ్ లో శిక్షణ ఎదుర్కొంటారని నమ్ముతారు.
టాపిక్