Potato Pulao Recipe : రెస్టారెంట్ స్టైల్‌లో ఆలూ పులావ్.. లంచ్‌లోకి చేసేయండి
Potato Pulao In Telugu : మధ్యాహ్నం తినేందుకు ఏం చేయాలని తెగ ఆలోచిస్తున్నారా? సింపుల్‍గా టేస్టీగా ఉండే రెసీపీ చేయండి. అందులో భాగంగా ఆలూ పులావ్ తయారు చేసుకోవచ్చు.
మధ్యాహ్నం ఏం వంట చేయాలో అని అమ్మ ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. రోజూ చేసేవి తిప్పి తిప్పి వండితే.. ఇంట్లో వాళ్లకు బోర్ కొడుతుంది. ఎప్పుడూ ఇదేనా అంటారు. ఆలుగడ్డలతో ఏం చేసినా రుచిగానే ఉంటుంది. ఆలూ ఫ్రై, ఆలూ కర్రీ, ఆలూ చపాతీ, ఆలూ పులావ్ ఇలా ఏదైనా మస్త్ ఉంటుంది. ఆలుగడ్డలతో పులావ్ చేస్తే.. మధ్యాహ్నం లంచ్ లొట్టలేసుకుని తినేయొచ్చు. ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా లేకున్నా ఆలుగడ్డలు అయితే ఎప్పుడూ ఉంటాయి. ఏం కూర చేయాలో తెలియనప్పుడు ఒకసారి ఈ ఆలూ పులావ్ చేసి చూడండి. ఇంకెందుకు లేట్.. ఎంతో రుచిగా ఉండే.. ఆలూ పులావ్ ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా..
ఆలూ పులావ్ తయారీకి కావల్సిన పదార్థాలు
నానపెట్టిన బాస్మతి రైస్ – ఒకటిన్నర కప్పు
చిన్న ఆలూ – 10
ఉల్లిపాయ – ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్ట్– రెండు టేబుల్ స్పూన్లు
పెరుగు – అర కప్పు
కారం – ఒక చెంచా
పచ్చి మిర్చి – రెండు
అనాస పువ్వు – ఒకటి
బిర్యానీ ఆకు – ఒకటి
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
ధనియాల పొడి – రెండు చెంచాలు
గరం మసాలా – చెంచా
పుదీనా తరుగు – పావు కప్పు
కొత్తిమీర తరుగు – పావు కప్పు
దాల్చిన చెక్క – ఒకటి
నిమ్మరసం – టేబుల్ స్పూన్
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు – తగినంత
ఆలూ పులావ్ తయారీ విధానం
బంగాళాదుంపల చెక్కు తీసి నీళ్లలో వేయండి. పెరుగులో కారం, ధనియాల పొడి, గరంమసాలా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కాక ముందుగా చెక్కు తీసిన బంగాళాదుంపల్ని వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి. అదే బాణీలో మిగిలిన నెయ్యి వేసి అనాస పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి అవి వేగాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. అన్నీ ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లల్లి పేస్ట్ వేయాలి.
అల్లం వెల్లుల్లి ముందే వేయకండి.. మాడిపోతుంది. పైన చెప్పిన మసాల దినుసులు అన్నీ వేసి వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇప్పుడు అందులోనే పచ్చి మిర్చి వేసి ముందుగా కలిపిన పెరుగు, కొత్తమిర, పుదీనా తరుగు వేసి అన్నింటినీ కలపాలి. రెండు నిమిషాలయ్యాక బియ్యం, వేయించిన ఆలు, రెండున్నర కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి మూత పెట్టుకోవాలి. అన్నం పూర్తిగా ఉడికాక దింపేయాలి. అంతే వేడి వేడి ఆలూ పులావ్ రెడీ. దీన్ని నేరుగా తిన్నా బాగుంటుంది. లేదా రైతా, కూరలతో కూడా తినవచ్చు. ఎలా తిన్నా టేస్ట్ అదిరిపోతుంది.