Oats guntha punugulu: ఓట్స్‌తో గుంత పునుగులు.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ..
Oats guntha punugulu: ఓట్స్ ఎలాగైనా అల్పాహారంలో చేర్చుకునే మార్గం కోసం వెతుకుతున్నారా? అయితే ఒకసారి ఓట్స్ వాడి ఇలా గుంత పునుగులు చేసి చూడండి.
మామూలుగా మనం ఇంట్లో మినప్పప్పు, బియ్యం, రవ్వ కలిపి తయారు చేసిన పిండితో గుంత పునుగులు తయారు చేసుకుంటాం. వాటిలో రకరకాల కూరగాయ ముక్కలు వేసుకుని కాస్త కొత్త రుచితో ప్రయత్నిస్తాం. కానీ ఓట్స్ తో కూడా రుచికరమైన పొంగడాలు చేసుకోవచ్చు. సాధారణంగా ఓట్స్ వాడి ఉప్మా లేదా ఇన్స్టంట్ మసాలా ఓట్స్ చేసుకుంటాం. కానీ గుంత పునుగులు కూడా ఒకసారి ప్రయత్నించండి.. ఓట్స్ ను ఆహారంలో చేర్చుకోవాలి అనుకునే వారికి ఇది మంచి అల్పాహారం.
ఓట్స్ గుంత పునుగుల తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఓట్స్
పావు కప్పు బియ్యం పిండి
1 చెంచా సన్నం రవ్వ
పావు కప్పు ఉల్లిపాయ తరుగు
రెండు పచ్చిమిర్చి సన్నటి తరుగు
పావు కప్పు పెరుగు
సగం టీస్పూన్ వంట సోడా
1 చెంచా మినప్పప్పు
సగం టీస్పూన్ ఆవాలు
సరిపడా నూనె
ఓట్స్ గుంత పునుగుల తయారీ విధానం:
1. ముందుగా ఓట్స్‌ను పొడి చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద పాత్రలో ఓట్స్ పొడి, బియ్యం పిండి, రవ్వ, వంట సోడా, ఉప్పు, పెరుగు వేసుకుని కలుపుకోవాలి.
2. నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఇడ్లీ పిండిలాగా కాస్త గట్టిగానే కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు చిన్న గిన్నె పెట్టుకుని వేడెక్కాక నూనె వేసుకుని ఆవాలు వేసుకోవాలి. అవి వేగాక మినప్పప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ బాగా వేయించాలి.
4. ఉల్లిపాయలు పచ్చివాసన పోయాక ఓట్స్ మిశ్రమంలో ఈ తాలింపును కలిపేసుకోవాలి.
5. ఇప్పుడు గుంత పొంగడాలు చేసే పెనం పెట్టుకుని అన్ని గుంతల్లో కొద్దికొద్దిగా నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మరీ నిండుగా కాకుండా పోసుకోవాలి. మూత పెట్టుకుని మగ్గనివ్వాలి.
6. పిండి ఉడికిపోయి మీద బుగ్గల్లాగా రంధ్రాలు పడటం గమనించొచ్చు. ఇప్పుడు కాస్త రంగు మారాక నూనె వేసుకుని మరో వైపు కూడా కాల్చుకోవాలి. రెండు వైపులా రంగు మారి కాస్త క్రిస్పీగా అనిపిస్తే ఓట్స్ గుంత పునుగులు రెడీ అయినట్లే.
ఈ గుంత పునుగులు మీ ఇష్టాన్ని బట్టి రకరకాలుగా చేసుకోవచ్చు. ఓట్స్ మిశ్రమంలో మీకిష్టమైన మరేమైనా కూరగాయ ముక్కలు సన్నగా తరిగి వేసుకోవచ్చు. తాలింపులో కరివేపాకు, శనగపప్పు వేసుకోవచ్చు. నూనె బదులుగా నెయ్యి వాడొచ్చు. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. పిల్లలకు సాయంత్రం పూట స్నాక్ లాగా, ఉదయం అల్పాహారంలోకీ తినేయొచ్చు.