Beerakaya palli kura: బీరకాయ కూరను పల్లీల మసాలాతో చేశారంటే, చూస్తేనే నోరూరుతుంది-how to cook beerakaya or ridge gaurd palli kura recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beerakaya Palli Kura: బీరకాయ కూరను పల్లీల మసాలాతో చేశారంటే, చూస్తేనే నోరూరుతుంది

Beerakaya palli kura: బీరకాయ కూరను పల్లీల మసాలాతో చేశారంటే, చూస్తేనే నోరూరుతుంది

Koutik Pranaya Sree HT Telugu
Sep 21, 2024 11:30 AM IST

Beerakaya palli kura: బీరకాయ కూరను పల్లీల మసాలాలు దట్టించి చేశారంటే అందరికీ నచ్చేస్తుంది. ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు. దాన్ని ఎలా తయారు చేయాలో చూసేయండి.

బీరకాయ పల్లీ మసాలా కూర
బీరకాయ పల్లీ మసాలా కూర

బీరకాయ కూర ఎక్కువగా టమాటా వేసి లేదా పెసరపప్పు వేసి వండుకుంటాం. కానీ మసాలా కూరలాగా వండటం చాలా తక్కువ. బాగా మసాలాలు వేసి చేసుకుంటే బీరకాయ కూర కూడా మీ ఫేవరైట్ అయిపోతుంది. ఒక్కసారి పల్లీలు, కొబ్బరి కలిపి చేసిన మసాలా వేసి చేసుకునే బీరకాయ పల్లీల మసాలా కూర ప్రయత్నించండి. రుచిలో బాగుంటుంది. దీన్ని అన్నంతో, చపాతీలతో కూడా తినొచ్చు. దాని తయారీ ఎలాగో చూడండి.

బీరకాయ పల్లీల మసాలా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:

అరకిలో బీరకాయలు

అర కప్పు పల్లీలు

పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు

2 ఉల్లిపాయలు, సన్నటి ముక్కలు

అరకప్పు కొత్తిమీర తరుగు

అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

పావు టీస్పూన్ ఆవాలు

పావు టీస్పూన్ జీలకర్ర

3 చెంచాల నూనె

అర చెంచా పసుపు

1 కరివేపాకు రెబ్బ

4 ఎండుమిర్చి

చిటికెడు ఇంగువ

చెంచా ధనియాల పొడి

చెంచా జీలకర్ర పొడి

1 చెంచా కారం

బీరకాయ పల్లీల మసాలా కూర తయారీ విధానం:

1. ముందుగా బీరకాయలు శుభ్రంగా కడిగి చెక్కు కొద్దిగా తీసేసి సన్నటి ముక్కలుగా కోసుకోవాలి. మీకిష్టం ఉంటే కాస్త పొడవాటి ముక్కలు తరుగుకున్నా బాగుంటాయి.

2. ఇప్పుడు పల్లీలను నూనె లేకుండా వేయించుకోవాలి. అవి చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకుని, పచ్చి కొబ్బరి ముక్కలతో కలిపి మిక్సీ పట్టుకోవాలి.

2. కడాయిలో నూనె వేసుకుని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు రెబ్బ వేసుకుని చిటపటలాడాక, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి.

4. వాటిని ఒకసారి కలియబెట్టి వేగాక, సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.

5. ఉల్లిపాయ ముక్కలు మగ్గి కాస్త రంగు మారుతున్నప్పుడు మసాలాలు వేసుకోవాలి. పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు ,కారం వేసుకొని కలుపుకోవాలి.

6. ఒక నిమిషం పాటూ మూత మూసి తీస్తే అన్నీ బాగా వేగిపోతాయి. నూనె అంచుల వెంబడి పైకి తేలినట్లు కనిపిస్తుంది.

7. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ సన్నటి ముక్కల్ని వేసుకోవాలి. మూత పెట్టుకుని అయిదు నిమిషాలు ఉడికించుకోవాలి.

8. తర్వాత మూత తీసి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి మిశ్రమం వేసుకోవాలి. అన్నీ బాగా కలియబెట్టి అరకప్పు నీళ్లు పోసుకుని సన్నం మంట మీద మగ్గనివ్వాలి.

9. ఒక పది నిమిషాల్లో ముక్కలు బాగా ఉడికి మసాలా పడుతుంది. చివరగా కొత్తిమీర తరుగు చల్లుకుని దించేసుకుంటే చాలు. బీరకాయ పల్లీల మసాలా కూర రెడీ అయినట్లే..

బీరకాయలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని రెండ్రోజులకోసారి తిన్నా పరవాలేదు. దీంట్లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా తినడం బోర్ కొడుతుంది కాబట్టి కొత్తగా ఈ పల్లీ మసాలాతో ప్రయత్నించండి. ఇక్కడ పల్లీలకు బదులుగా నువ్వులు వాడి కూడా కూర వండుకోవచ్చు. గుప్పెడు నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టాను సారం మార్పులు చేసుకుని ఈ కూర వండుకుని చూడండి.

టాపిక్