క్రెడిట్ కార్డులు ఎన్ని మెయింటైన్ చేయొచ్చు? పరిమితి ఏదైనా ఉందా?
క్రెడిట్ కార్డులు వచ్చిన కొత్తల్లో ఆ కార్డు కలిగి ఉన్న వారిని రిచ్ కిడ్‌గా చూసేవారు. ఇప్పడు క్రెడిట్ కార్డులు నిర్వహించే సంస్థలు వందలాదిగా వచ్చాక చాలా మంది దగ్గర పదుల సంఖ్యలో క్రెడిట్ కార్డులు చూస్తున్నాం. నిజానికి ఒక వ్యక్తి ఎన్ని క్రెడిట్ కార్డులు కలిగి ఉండొచ్చు? ఎన్ని ఉంటే బాగుంటుంది?
క్రెడిట్ కార్డులు ఇన్నే కలిగి ఉండాలన్న నిబంధన ఏదీ లేదు. ఎవరి అవసరాలను బట్టి వారు ఎన్ని కార్డులైనా ఎంచుకోవచ్చు. కానీ వాటి నిర్వహణ వల్ల మీ క్రెడిట్ స్కోర్ పెరగాలే కానీ తగ్గకూడదు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉండి క్రెడిట్ వినియోగం తక్కువగా ఉంటే క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటుంది. అయితే క్రెడిట్ స్కోర్ బాగుంటుందన్న కారణంతో ఎక్కువ క్రెడిట్ కార్డులు మెయింటైన్ చేస్తే కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ఎక్కువ కార్డులు ఉంటే ఇబ్బందులు ఏంటి?
క్రెడిట్ కార్డుల నిర్వహణ అంతతేలికైన విషయమేమీ కాదు. వాటి పిన్ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి. జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. ప్రతి నెలా నిర్ధిష్ట తేదీలోగా బిల్లు చెల్లించాలి. ఒక్కోసారి ఇంటర్నేషనల్ సైట్లలో ఏదైనా సేవల కోసం బిల్లింగ్ సమయంలో మీరు పలానా క్రెడిట్ కార్డు వివరాలు ఇచ్చారన్న సంగతి గుర్తుంచుకోవాలి. నెట్ ఫ్లిక్స్ కోసమో, గూగుల్ సేవల కోసమో.. ఇంకా ఏదైనా సందర్భంలో ఇలా ఇచ్చి ఉండొచ్చు. ఆయా కార్డులు ఎక్స్‌పైరీ తేదీ ముగిసి బిల్లింగ్ డిక్లైన్ అయ్యే వరకు కూడా మనకు ఆకార్డు వివరాలు, పిన్ వివరాలు గుర్తే ఉండవు. కార్డుల సక్రమ నిర్వహణ, గడువు తేదీలోపు బిల్లు చెల్లింపు, పిన్ వివరాల గోప్యత వంటి విషయాలు కీలకమైనవి. అందువల్ల వీటన్నింటినీ సక్రమంగా చేయగలమనుకుంటే ఎన్నైనా నిర్వహించుకోవచ్చు.
సగటున ఎన్ని కార్డులు మెయింటైన్ చేస్తున్నారు?
అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో సగటున 4 క్రెడిట్ కార్డులు కలిగి ఉన్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. నిజానికి నాలుగు క్రెడిట్ కార్డులు కలిగి ఉండి వాటిని నిర్వహించడం కూడా క్లిష్టమైన పనే. 3 క్రెడిట్ కార్డుల వరకు నిర్వహణ కాస్త సులభమేనని చాలా మంది క్రెడిట్ కార్డు వినియోగదారులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు. పైగా పదే పదే క్రెడిట్ కార్డుల కోసం అప్లై చేస్తే మీరు రుణాలపై ఎక్కువగా డిపెండ్ అవుతున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుందని గమనించాలి.
ప్రాతిపదిక ఏంటి?
అవసరాలే ప్రాతిపదికగా క్రెడిట్ కార్డులు ఎంచుకుంటాం. క్రెడిట్ కార్డులు బాధ్యతాయుతంగా వాడినంత సేపు తగిన ప్రయోజనం పొందవచ్చు. ఆఫర్లు, డిస్కౌంట్లు, రివార్డులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు మేలే చేస్తాయి. అందువల్ల మనం నిత్యం ఖర్చు చేసే అంశానికి సంబంధించి ఓ కో-బ్రాండెడ్ కార్డు ఒకటి కలిగి ఉండాలి. దీనిలో క్రెడిట్ లిమిట్ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు నిత్యావసర వస్తువులు, కిరాణ, యుటిలిటీ బిల్లుల చెల్లింపు, ఇంటి షాపింగ్ అవసరాల కోసం ఇలాంటి ఓ కో-బ్రాండెడ్ కార్డు కలిగి ఉంటే దాని క్రెడిట్ లిమిట్ రూ. 50 వేలకు మించి ఉండాల్సిన అవసరం కూడా లేదు.
ఇక రెండోది ప్రధాన కార్డు. ఇది పెద్ద ఆపద వచ్చినా, ఎంత పెద్ద కొనుగోలు చేయాల్సి వచ్చినా (మనం తదుపరి ఏకమొత్తంలో లేదా ఈఎంఐ రూపంలో బిల్లు చెల్లించగలగాలి) ఉపయోగపడేలా దీని నిర్వహణ ఉండాలి. దీనిలో క్రెడిట్ లిమిట్ క్రమంగా పెంచుకునేలా బాధ్యతాయుతంగా వాడుకోవాలి. మీ స్కోరు బాగుంటే, చెల్లింపుల చరిత్ర బాగుంటే క్రెడిట్ కార్డు సంస్థ మీ ఎలిజిబులిటీ చూసి క్రెడిట్ లిమిట్ పెంచామని, అనుమతించాలని అడుగుతుంది.
ఇక మూడోది.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చే క్రెడిట్ కార్డులను గమనించాలి. సాధారణంగా నెంబర్ 1 క్రెడిట్ కార్డు హోదా కోసం పోటీపడే ప్రధాన బ్యాంకులు ఈ ఆఫర్లను ఎక్కువగా ఇస్తుంటాయి. మీ కో-బ్రాండెడ్ కార్డు, మీ ప్రధాన కార్డు కాకుండా, ఇందుకు మరొక క్రెడిట్ కార్డు సంస్థను ఎంచుకోవడం ఉత్తమమైన మార్గం.
స్మార్ట్‌గా వ్యవహరించండి..
మీ బడ్జెట్‌కు సహాయకారిగా ఉండేలా ఆయా క్రెడిట్ కార్డులను వినియోగించుకోవాలి. సాధ్యమైనంతమేర వీటి ద్వారా డిస్కౌంట్లు, ఆఫర్లు, రివార్డు పాయింట్లు పొందేేలా చూడాలి. మీకు ప్రత్యేక సందర్భాలకు.. అంటే పిల్లల బర్త్ డేలు, మీ వివాహ వార్షికోత్సవాలు, విమాన ప్రయాణాలకు ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలి. అంటే ఆయా క్రెడిట్ కార్డుల ద్వారా ఆఫర్లు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగపరుచుకోవాలి. టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవడం, షాపింగ్ ముందుగానే చేసుకోవడం వంటి వాటి వల్ల డిస్కౌంట్లు గిట్టుబాటు అవుతాయి.
సంబంధిత కథనం
టాపిక్