Home Remedies for Dark Circles : కళ్ల చుట్టూ నల్లని వలయాలా? ఇలా సహజంగా, సింపుల్​గా వదిలించేసుకోండి..-home remedies for dark circles to lighten naturally at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Remedies For Dark Circles : కళ్ల చుట్టూ నల్లని వలయాలా? ఇలా సహజంగా, సింపుల్​గా వదిలించేసుకోండి..

Home Remedies for Dark Circles : కళ్ల చుట్టూ నల్లని వలయాలా? ఇలా సహజంగా, సింపుల్​గా వదిలించేసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 26, 2023 03:09 PM IST

Home Remedies for Dark Circles : సరైన నిద్రలేక.. లేదా స్క్రీన్ తరచూ చూడడం వల్ల.. ఇతరత్ర కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు వస్తాయి. ఇవి మీ లుక్​ని పూర్తిగా మార్చేస్తాయి. మరి వీటిని ఎలా జయించాలి. సహజంగా వీటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కళ్ల చుట్టూ నల్లని వలయాలు
కళ్ల చుట్టూ నల్లని వలయాలు

Home Remedies for Dark Circles : మీరు మీ కళ్ల కింద నల్లటి వలయాలను వదిలించుకోవాలనుకుంటే.. వాటిని కాంతివంతం చేయడానికి కొన్ని ఇంటి నివారణలను అనుసరించవచ్చు. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ కేవలం స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా పెద్ద సమస్యే. ఒత్తిడి, తక్కువ నిద్ర, తక్కువ నీరు తీసుకోవడం, హార్మోన్లలో మార్పులు, యాదృచ్ఛిక జీవనశైలి, జన్యుపరమైన సమస్యలు వంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే మీరు ఈ సమస్యను దూరం చేసుకోవాలనుకుంటే.. వాటిని కాంతివంతం చేయడానికి కొన్ని ఇంటి చిట్కాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టమోటా, నిమ్మకాయ

టొమాటోలు నల్లని వలయాలను తగ్గించడమే కాకుండా చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. మీరు ఒక చెంచా టొమాటో రసాన్ని తీసుకుని.. దానిలో ఒక చెంచా నిమ్మరసం వేసి.. ఈ మిశ్రమాన్ని కళ్లపై రాయండి. 10 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి. ఇలా రోజుకు కనీసం రెండు సార్లు చేస్తే నల్లటి వలయాలు తగ్గుతాయి.

బంగాళదుంప రసం

బంగాళదుంపలు కూడా నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. బంగాళాదుంపలను తురుము నుంచి వీలైనంత వరకు బంగాళాదుంప రసాన్ని తీయండి. ఇప్పుడు కాటన్ తీసుకుని.. బంగాళదుంప రసంలో పూర్తిగా నానబెట్టండి. దీనిని కళ్లపై ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే.. మీరు ఒక వారంలోనే దాని ఫలితాలు చూస్తారు.

టీ బ్యాగులు

టీ బ్యాగ్‌లను మీరు తప్పక చూసి ఉంటారు. వాటి లోపల టీ ఆకులు నిండి ఉంటాయి. మీరు వాటి సహాయంతో.. కళ్ల కింద డార్క్ సర్కిల్స్ వదిలించుకోవచ్చు. దీని కోసం మీరు ఓ టీ బ్యాగ్ తీసుకోండి. ఇది గ్రీన్ టీ అయితే చాలా మంచిది. కాసేపు దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. అవి చల్లబడినప్పుడు.. వాటిని కళ్లపై ఉంచండి. వీలైనంత తరచుగా ఈ ప్రక్రియను చేయండి.

బాదం నూనె

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. దాని నూనె మీ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. బాదం నూనెకు సంబంధించిన అనేక ఉత్పత్తులను మార్కెట్‌లో అమ్మడం మీరు చూసి ఉంటారు. దీని ఉపయోగం చాలా సులభం. మీరు కొంచెం బాదం నూనెను తీసుకుని.. నల్లటి వలయాలపై అప్లై చేసి తేలికపాటి చేతులతో మసాజ్ చేసి అలా వదిలేయాలి. ఉదయం లేవగానే కళ్లను కడగాలి. ప్రభావం ఒక వారంలో కనిపించడం ప్రారంభమవుతుంది.

చల్లని పాలు

చల్లని పాలను నిరంతరం ఉపయోగించడం వల్ల కూడా మీరు నల్లటి వలయాలను తొలగించుకోవచ్చు. దీనికోసం మీరు చల్లని పాలలో దూదిని ముంచి.. ఆపై నల్లటి వలయాలు ఉన్న ప్రదేశంలో ఉంచండి. డార్క్ సర్కిల్స్ ఉన్న మొత్తం ప్రాంతాన్ని కప్పండి. దూదిని 10 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై సాధారణ నీటితో కళ్లను కడగాలి.

Whats_app_banner

సంబంధిత కథనం