AC Precautions: ఇంట్లో ఏసీ పేలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల జాబితా ఇదిగో, అసలు ఏసీ ఎందుకు పేలుతుంది?
AC Precautions: కొన్నిసార్లు ఏసీ పేలి ఇల్లు మొత్తం తగలబడిపోయిన సంఘటనల గురించి వింటూ ఉంటాం. ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
AC Precautions: నోయిడాలోని ఒక అపార్ట్మెంట్లో ఏసీ పేలుడు జరిగి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. వెంటనే మంటలను అదుపు చేయడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇలా చాలా చోట్ల ఏసీ పేడడం కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఏసీ ఎందుకు పేలుతుందో, పేలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మండే ఎండల్లో ఏసీలు లేకుండా ఉండడం కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు ప్రతి మధ్యతరగతి ఇంట్లో కూడా ఏసీ కనిపిస్తోంది. దాన్ని భద్రంగా ఎలా వాడాలో, ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.
మెయింటెనెన్స్
ఏసీ యూనిట్ ఎలా ఉందో తరచూ చెక్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయించడం వల్ల ఏసీలో ఉన్న లోపాలు బయటపడతాయి. ఎలక్ట్రికల్ భాగాలు సరిగ్గా పనిచేస్తున్నయో లేదో టెక్నీషియన్ చెక్ చేస్తాడు. ఫిల్టర్లను శుభ్రపరచడం, రిఫ్రిజిరేంట్ లీక్ కాకుండా చూడడం వంటివి తరచూ చూసుకుంటూ ఉండాలి. 600 గంటల పాటు ఏసీ రన్ అయ్యాక ఖచ్చితంగా సర్వీసింగ్ చేయించడం తప్పనిసరి.
వెంటిలేషన్
ఏసీని వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో పెట్టడం మంచిది. మంచి వెంటిలేషన్ ఉంటే ఏసీ వేడెక్కకుండా ఉంటుంది. గాలి ప్రవాహానికి ఎలాంటి అడ్డు లేకుండా చూసుకోవాలి. ఏసీ యూనిట్ ను ఖాళీగా ఉన్న ప్రదేశంలో పెట్టడం వల్ల గాలి ప్రవాహం సరిగ్గా సాగుతుంది. దీనివల్ల ఏసీ యూనిట్ పై ఎలాంటి ఒత్తిడి పడదు.
వైరింగ్ తనిఖీ
ఏసీ కి అనుబంధంగా ఉన్న వైరింగ్‌ను తరుచూ తనిఖీ చేస్తూ ఉండాలి. అవి చిరిగినట్టు ఉంటే వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువ రోజులు వాడితే వైరింగ్ కూడా క్షీణిస్తుంది.
ఏసీని నాణ్యమైన బ్రాండుకు సంబంధించినవే కొనుక్కోవాలి. వాటిలో నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలను ఉపయోగిస్తారు. అలాగే ఏసీ పాడైన తర్వాత కూడా చవకైన ఎలక్ట్రికల్ భాగాలను వాడడం మంచిది కాదు. వాటిని రీప్లేస్ చేసినప్పుడు నాణ్యమైన ఎలక్ట్రికల్ భాగాలతోనే రీప్లేస్ చేయాలి. అలాగే పవర్ సాకెట్లు, ప్లగ్గులు, షెడ్యూల్ బ్రేకర్లు వంటివి మంచి నాణ్యమైనవి వేసుకోవాలి.
ఏసీ ని వాడుతున్నవారు అది పనిచేసే తీరుపై ప్రాథమికంగా అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. ఏసీ నుంచి అసాధారణ శబ్దాలు వస్తున్నా, వాసనలు వస్తున్నా లీకేజీ ఉన్నా కూడా వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి. ఏసీ నుంచి పొగలు వస్తున్నట్టు అనిపిస్తే చాలామంది నీటిని చల్లుతారు. అలాంటివి చేయకూడదు. ఏసీని ఆఫ్ చేశాక దానిని మళ్లీ టెక్నీషియన్ వచ్చేవరకు వేయకపోవడమే మంచిది.
ఎండల్లో ఏసీ నిరంతరం వాడుతున్నవారు ఉన్నారు. మనిషికి విశ్రాంతి ఎలా అవసరమో... ఏసీ కి కూడా కాసేపు విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. కాబట్టి రోజులో ప్రతి రెండు గంటలకు ఒకసారి ఐదు నుంచి పది నిమిషాల వరకు ఏసీ ని ఆఫ్ చేసి ఉంచాల్సిన అవసరం ఉంది. దీని వల్ల ఏసీలు కూడా ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి.
ఇంట్లో ఏసీ వాడుతున్న వారు ఫైర్ సేఫ్టీ పరికరాలను కూడా ఇంట్లో ఉంచుకోవడం మంచిది. స్మోక్ డిటెక్టర్లు మంటలను ఆపే పరికరాలు ఇంట్లో ఉంటే మంచిది. ఎలాంటి ప్రాణాపాయాలు కలగకుండా ఉంటాయి.