Sirnapally waterFalls: సిర్నాపల్లి జలపాతం చూశారా? ఈ వీకెండ్‌లో ప్లాన్ చేయండి, వెళ్లి వచ్చేందుకు మూడు రోజులు సరిపోతుంది
Sirnapalli Waterfall: తెలంగాణలో ఉన్న అందమైన జలపాతాల్లో సిర్నాపల్లి ఒకటి. హైదరాబాద్ నుంచి అయినా, వైజాగ్ నుంచి అయినా అక్కడికి వెళ్లాలంటే వెళ్లి ఎంజాయ్ చేయాలంటే మూడు రోజులు సరిపోతుంది.
Sirnapally waterFalls: ప్రతిసారి వీకెండ్ అంటే రెండు రోజులు మాత్రమే వచ్చేవి, ఈసారి మాత్రం ఆగస్టు 15 గురువారం రావడం, వరలక్ష్మీ వ్రతం శుక్రవారం రావడం, శనివారం, ఆదివారం తర్వాత రక్షాబంధన్ సోమవారం రావడం వల్ల ఐదు రోజులు పాటు వరుస సెలవులు వస్తున్నాయి. ఈ సమయంలో చాలా తక్కువ ఖర్చులో అందమైన ప్రదేశాలను చూడాలంటే... సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు ప్లాన్ చేయండి. దట్టమైన అడవికి దగ్గరలో ఉండే ఈ సిర్నాపల్లి జలపాతం చూసేకొద్దీ మరింత చూడాలనిపించేలా ఉంటుంది. దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి నీటిధారలు కిందకి జాలువారుతూ ఉంటాయి. అక్కడి పక్షులు, అందమైన చెట్లు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. సిర్నాపల్లి జలపాతానికి వెళ్లడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే. చాలా సింపుల్‌గా దీన్ని చూసి రావచ్చు. అన్నట్టు ఈ జలపాతం ఎక్కడుందో చెప్పలేదు కదూ ఇది నిజామాబాద్ జిల్లాలో ఉంది.
సిర్నాపల్లి జలపాతం చూసేందుకు అనువైన కాలం వర్షాకాలమే. అప్పుడే నీళ్లు పరవళ్ళు తొక్కుతూ పైనుంచి కిందకి దూకుతూ ఉంటాయి. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో సిర్నాపల్లి కూడా నీటితో కళకళలాడుతోంది. మీ పని ఒత్తిడి మర్చిపోవాలన్నా, కుటుంబంతో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లి రావాలన్నా మీకు సిర్నాపల్లి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.
సిర్నాపల్లి ఎక్కడుంది?
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి మండలంలో ఉంది. సిర్నాపల్లి జలపాతం ఇది ప్రస్తుతం వీకెండ్ స్పాట్ గా నడుస్తోంది. శని, ఆదివారాలు వస్తే చాలు సిర్నాపల్లికి వెళ్లే వారి సంఖ్య చాలా ఎక్కువ. సిర్నాపల్లి గతంలో ఒక సంస్థానంగా ఉండేది. రాణి జానకి బాయి పాలనతో ఈ ప్రాంతం ఉండేది. అందుకే సిర్నాపల్లి జలపాతం దగ్గర ఉన్న అలుగును జానకి బాయి పేరుతోనే పిలుస్తారు. సిర్నాపల్లి గ్రామం దట్టమైన చెట్టు మధ్య ఉంటుంది. దీనికి కేవలం మూడు కిలోమీటర్ల దూరం నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలైపోతుంది.
అప్పట్లో సిర్నాపల్లి ప్రాంతాన్ని పాలించిన జానకి బాయి నల్లవెల్లి, సిర్నాపల్లి గ్రామాల్లో ఉన్న ప్రజల కష్టాలు తీర్చడానికి ఆరు చెరువులను తవ్వించిందని చెబుతారు. ఆ చెరువుల వల్లే ఇప్పుడు సిర్నాపల్లి జలపాతం ఇంత అందంగా పరవళ్లు తొక్కుతోందని చెప్పుకుంటారు. చెరువు నిండిన తర్వాత ఆ నీరు కిందకి పడుతూ జలపాతాన్ని తలపిస్తుంది. దీన్ని చూసేందుకు కుటుంబ సమేతంగా ఎంతోమంది వస్తారు.
తెలంగాణా నయాగరా
సిర్నాపల్లి జలపాతాన్ని తెలంగాణ నయాగరా అని పిలుస్తారు. అలాగే జానకి బాయి జలపాతం అని కూడా అంటారు జానకి బాయి కొడుకు శీలం రాంభూపాల్ రెడ్డి ఐపీఎస్ అధికారిగా చేసి రిటైర్ అయ్యారు. జానకి బాయి ముని మనవరాలు అనురాధా రెడ్డి... ఆమె ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి సిర్నాపల్లి
హైదరాబాద్ నుంచి సిర్నాపల్లి జలపాతానికి వెళ్లాలనుకుంటే ముందుగా నిజామాబాద్‌కు ట్రైన్ ద్వారా లేదా బస్సు ద్వారా చేరుకోవాలి. అక్కడి నుంచి ఇందల్వాయి మండలానికి చేరుకుంటే సిర్నాపల్లి జలపాతానికి దగ్గరలో ఉన్నట్టే.
విశాఖ నుంచి సిర్నాపల్లి
ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ నుంచి సిర్నాపల్లి చూడాలనుకుంటే ఇక్కడి నుంచి మూడు ట్రైన్లు నిజామాబాద్ కు వెళుతున్నాయి. విశాఖ - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ మీదుగానే వెళుతుంది. అలాగే విశాఖ నుంచి షిరిడి ఎక్స్‌ప్రెస్ కూడా నిజామాబాద్ మీదుగా వెళుతుంది. మరొక ట్రైన్ కూడా నిజామాబాద్ మీదుగా ప్రయాణం చేస్తుంది. ఈ మూడు ట్రైన్లలో నిజామాబాద్ వరకు టికెట్ తీసుకొని అక్కడి నుంచి ఇందల్వాయి మండలానికి చేరుకోవాలి. వీటికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. కుటుంబంతో వెళ్లినా కూడా సిర్నాపల్లి జలపాతాన్ని ఎంజాయ్ చేసి రావడానికి ఆరు నుంచి ఏడు వేలు ఉంటే చాలు. ఈ వీకెండ్ లో వెళ్లేందుకు ఒకసారి ప్రయత్నించండి. లేదా ఏదో ఒక సమయంలో సిర్నాపల్లి జలపాతాన్ని చూసేందుకు ప్లాన్ చేయండి. కచ్చితంగా చూసి రావాల్సిన ప్రాంతాలలో సిర్నాపల్లి జలపాతం ఒకటి. నయాగరా చూడలేం అనుకునే వారికి సిర్నాపల్లి మంచి సంతృప్తిని ఇస్తుంది.