Tamarind Tea Recipe | చింతాకు టీ తాగితే.. రోగాలకు చెప్పొచ్చు జింతాక్ చితాక!-have a cup of tamarind tea to say jinthak chithaka farewell to all illnesses ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tamarind Tea Recipe | చింతాకు టీ తాగితే.. రోగాలకు చెప్పొచ్చు జింతాక్ చితాక!

Tamarind Tea Recipe | చింతాకు టీ తాగితే.. రోగాలకు చెప్పొచ్చు జింతాక్ చితాక!

HT Telugu Desk HT Telugu
Dec 29, 2022 04:14 PM IST

Tamarind Tea Recipe: చింతపండుతో ఎన్నో వంటలు చేసుకోవచ్చు, చింత ఆకులతో చాయ్ కాచుకోవచ్చు. చింతాకు టీ తాగితే రోగాలన్నీ నయమవుతాయట. రెసిపీ ఇక్కడ ఉంది ట్రై చేయండి.

Tamarind Tea benefits
Tamarind Tea benefits (Unsplash)

చింతపండుతో చారు చేసుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, పులిహోర కలిపేయొచ్చు, కుదిరితే చింతపండు జ్యూస్ ట్రై చేయవచ్చు. కానీ మీరెప్పుడైనా పుల్లటి చింతతో చాయ్ చేసుకోవచ్చని ఊహించారా? కానీ లెమన్ టీ లాగే టామరిండ్ టీ కూడా అందుబాటులో ఉంది. ఈ టామరిండ్ టీ చేయడానికి చింతాకులను ఉపయోగిస్తారు. చింతపండుతో చేసే వంటకాలు కొంచెం ట్యాంగీ ఫ్లేవర్ తో ఎంత రుచికరంగా ఉంటాయో మీకు తెలుసు అదే విధంగా ఈ చింతాకు టీ కూడా కొంచెం తీపి, పులుపు కలగలిసిన రుచితో ఉంటుంది. అయితే ఈ చింతాకు టీ రుచికే కాదు, ఆరోగ్య ప్రయోజనాలకూ ప్రసిద్ధి.

చింత ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ మలేరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఆస్తమా గుణాలు ఉన్నట్లు కనుగొన్నారు. కాబట్టి ఇన్ని మూలకాలు కలిగిన చింతాకు టీ తాగటం ద్వారా కాలేయం, పొట్టను శుభ్రపడటమే కాకుండా, మీ బరువు తగ్గించండంలోనూ ప్రయోజనం పొందవచ్చు. చింతాకు టీ తాగటం ద్వారా కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకునేముందు, అసలు ఈ చింతాకు టీని ఎలా తయారు చేయవచ్చో తెలుసుకుందాం. చింతాకు టీ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.

Tamarind Tea Recipe కోసం కావలసిన పదార్థాలు

  • చింతాకు - 1 పిడికెడు
  • అల్లం - 1/2 అంగుళం
  • పసుపు - 2 చిటికెలు
  • తేనె - 2 స్పూన్లు
  • పుదీనా ఆకులు - 4
  • నీరు - 2 కప్పులు

చింతాకు టీ తయారు చేసే విధానం

  1. చింతాకు టీ చేయడానికి, ముందుగా ఆకులను శుభ్రంగా కడిగండి, అల్లంను తురుముకోండి.
  2. ఇప్పుడు గిన్నెలో నీరు పోసి, అందులో చింతాకు, పుదీనా ఆకులు, అల్లం, పసుపు వేసి బాగా మరిగించాలి.
  3. మరిగిన తరువాత ఈ ద్రావణాన్ని ఒక కప్పులో వడకట్టి ఒక కప్పులో పోసుకోండి.
  4. ఇందులో రుచికి కోసం తేనె కలుపుకుంటే, వేడివేడి చింతాకు టీ రెడీ.

గోరువెచ్చగా మీ చింతాకు టీని ఆస్వాదించండి.

Tamarind Tea benefits- చింతాకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

చింతాకులు స్థూలకాయ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి బరువును తగ్గించడంలో ప్రభావవంతమైనవిగా పరిగణిస్తారు. ఈ చింతాకు టీ తాగితే మెటబాలిక్ సిండ్రోమ్‌ నయం అయ్యే అవకాశం ఉందంటున్నారు. చింతాకులు ఆకలిని కూడా తగ్గిస్తాయి.

చింతాకు టీ మధుమేహ రోగులకు మేలు చేస్తుంది. చింతాకుల సారంలో యాంటీ-డయాబెటిక్ గుణాలు ఉన్నాయి, ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో మీకు సహాయపడుతుంది. చింతాకుల్లో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో తోడ్పడతాయి.

చింతాకుల్లో విటమిన్-సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం