Monday Motivation: మొదటి చూపులోనే వ్యక్తులను తప్పుడు అంచనా వేయకండి, ప్రతి వ్యక్తి వెనక ఏదో ఒక విషాద కథ ఉంటుంది
Monday Motivation: కొంతమంది మొదటి చూపులోనే వ్యక్తులను తప్పుగా అంచనా వేస్తారు. వారి హావభావాలను వెక్కిరిస్తారు. బాడీ షేమింగ్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు.
Monday Motivation: ఒక రైలు వేగంగా వెళుతుంది. ఆ రైలులో పాతికేళ్ల కుర్రాడు తన తండ్రితో కూర్చుని ఉన్నాడు. వాళ్లకు ఎదురుగా ఒక యువ జంట కూర్చుని ఉంది. ఆ పాతికేళ్ల యువకుడు రైలు కిటికీలోంచి చూస్తున్నాడు. అతను ఆ కిటికీలోంచి కనిపించే అన్నింటినీ చూసి ఆనంద పడుతున్నాడు. మేఘాలు కనిపించిన వెంటనే ‘నాన్నా... మేఘాలు చూడు. మన వెంటే పరిగెడుతున్నాయి’ అని చెప్పాడు. వెంటనే అతని తండ్రి ‘అవును’ అంటూ ఆనందపడ్డాడు.
ఆ యువకుడు మళ్లీ ‘నాన్నా... చెట్లు చూడు మనతోనే వస్తున్నాయి’ అని అన్నాడు. దానికి కూడా ఆ తండ్రి మురిసిపోయాడు. మళ్ళీ యువకుడు ‘నాన్నా పక్షులు మన రైలుతో పాటే ఎగురుతున్నాయి’ అన్నాడు. దానికి ఆ తండ్రి మరింతగా ఆనందపడ్డాడు. పాతికేళ్ల యువకుడు అలా చిన్నపిల్లాడిలా చెట్లు పక్షులు, నదులు చూసి ఆనంద పడడం ఆ యువ జంటకు విచిత్రంగా అనిపించింది. వారు ఆ అబ్బాయిని చూసి ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకోవడం ప్రారంభించారు.
ఆ యువ జంట అలా వెటకారంగా తన కొడుకుని చూడడం, నవ్వుకోవడం ఆ తండ్రి గమనించాడు. అయినా వారిని ఏమీ అనలేదు. కాసేపయ్యాక యువ జంట ఆ తండ్రితో ‘మీ కొడుకును మంచి డాక్టర్ వద్దకు తీసుకువెళ్లొచ్చు కదా. చికిత్స చేయించవచ్చు కదా’ అని అన్నారు. దానికి ఆ తండ్రి నవ్వి ‘నేను ఆ పని చేశాను. మేము ఇప్పుడు ఆసుపత్రి నుండే ఇంటికి వెళుతున్నాము. నా కొడుకు పుట్టుకతోనే అంధుడు. అతడికి కంటి ఆపరేషన్ చేయించాము. తొలిసారి ఈ రోజే అతడు ప్రపంచాన్ని చూస్తున్నాడు’ అని చెప్పాడు.
అది విని ఆ యువ జంట సిగ్గుతో తలదించుకుంది. అతడి గురించి తెలియకుండా తాము వ్యంగ్యంగా ప్రవర్తించడం తలుచుకొని అవమానంతో కుంగిపోయింది. అందుకే ఎదుటివారి జీవితం తెలుసుకోకుండా మాటలు విసరకూడదు. వ్యంగ్యంగా తక్కువ చేసి మాట్లాడకూడదు. బాడీ షేమింగ్ చేయకూడదు.
ప్రపంచంలో ఎంతోమంది వ్యక్తులు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవన్నీ మనం చూసే మొదటి చూపులోనే తెలిసిపోవు. కాబట్టి ఒక వ్యక్తి విచిత్రంగా కనిపించినా లేదా విచిత్రంగా ప్రవర్తించినా వెంటనే అతడు ఒక పిచ్చివాడనో, మానసిక ఎదుగుదల లేని వ్యక్తి అనో... అంచనాకు రాకండి. అతని వల్ల మీకు ఎలాంటి సమస్యలు లేనప్పుడు... అతని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు ఉండదు. కాబట్టి వీలైతే అలాంటి వ్యక్తులకు సాయం చేయండి. లేదా మీ ప్రయాణాన్ని ముగించుకుని ఆ స్థానాన్ని ఖాళీ చేసి వెళ్ళండి. అంతే తప్ప ఎదుటివారి మనసులను బాధపెట్టేలా ప్రవర్తించకండి. ప్రతి వ్యక్తి వెనక ఒక విషాదకరమైన గాధ ఉంటుంది. ఒక బాధాకరమైన కథ ఉంటుంది. వాటిని తెలుసుకోకుండా మీరు వారికి మరింత బాధను మిగల్చడం మంచి పద్ధతి కాదు.