Shivaratri 2022 | శివుని పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు-dont do these mistakes in lord shiva puja ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Shivaratri 2022 | శివుని పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు

Shivaratri 2022 | శివుని పూజలో ఈ తప్పులు అస్సలు చేయకూడదు

Vijaya Madhuri HT Telugu
Mar 01, 2022 05:34 AM IST

మహాశివరాత్రి. ప్రపంచంలోని శివభక్తులంతా.. శివనామస్మరణలో మునిగి తేలే రోజు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో ఘనంగా శివరాత్రిని జరుపుకుంటారు. ఉదయాన్నే ఆలయాలకు వెళ్లి శివునికి పూజలు చేస్తారు. కానీ ఆయనకు చేసే పూజల్లో కొన్నింటికి నిషేదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శివపూజ
శివపూజ

Maha Shiva Ratri 2022 | జగమంతా శివనామస్మరణలో మునిగిపోయే రోజు శివరాత్రి. ఈ పుణ్యదినం 2022లో మార్చి నెలలోని మొదటి రోజునే వచ్చింది. శివుని భక్తులంతా ఉదయమే స్నానాలు ఆచరించి.. శివుని ఆలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. మహా శివరాత్రి రోజున ఏడు లోకాల్లోని పుణ్యక్షేత్రాలు మారేడు దళంలో నిక్షిప్తమై.. శివుడికి అర్చన గావిచబడతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే శివరాత్రి రోజున ఉపవాసం చేసి.. కనీసం ఒక్క మారేడు దళంతో అయినా శివుడికి అర్చన చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. మరీ వేటితో పూజించకూడదో.. పూజలో ఏ తప్పులు చేస్తే శివయ్యకు నచ్చదో ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి..

శివునికి వేటితో పూజచేయకూడదు అని చెప్పే వాటిలో మొదటగా తులసి అనే చెప్తారు. తులసి ఆకును ఎంతో పవిత్రమైనదిగా భావించడం అనాదిగా వస్తున్నదే. పైగా తులసి చెట్టు ప్రతి హిందువుల ఇంట్లో నిత్యం పూజలు కూడా పొందుతుంది. అలాంటిది శివుడికి మాత్రం తులసి ఆకులతో పూజ చేయకూడదని చెప్తున్నాయి శాస్త్రాలు. దీనికి రెండు కారణాలు ఉన్నాయంటారు.

1. సాధారణంగా తులసి ఆకులను లక్ష్మీ దేవిగా భావిస్తారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి అర్థాంగి కాబట్టి శివలింగానికి తులసి ఆకులతో పూజలు చేయకూడదని కొందరు పండితులు చెప్తారు.

2. తులసి గత జన్మలో బృందా. ఆమె భర్త అయిన జలంధర్ శివుని ఆగ్రహానికి లోనై ప్రాణాలు విడిచాడు. ఈ నేపథ్యంలో శివుని ఆరాధనకు తనను ఉపయోగించవద్దని తులసి నిరాకరించిందని శాస్త్రాలు చెప్తున్నాయి.

కారణమేదైనా శివుని పూజలో మాత్రం తులసి దళాన్ని వినియోగించరు.

కొబ్బరి నీళ్లు..

ఏ ఆలయానికి వెళ్లినా కొబ్బరి కొట్టడమనేది నిత్యకృతమే. శివునికి కూడా కొబ్బరికాయ కొడతారు కానీ.. కొబ్బరి నీళ్లను ఎప్పుడు సమర్పించరు. కొబ్బరి నీళ్లంటే శివయ్యకు ఇష్టం ఉందని.. ఇతరదేవుళ్లకు అర్పించినా ఏమి కాదు కానీ.. శివునికి మాత్రం సమర్పించకూడదని పురణాలు చెప్తున్నాయి.

కుంకుమ

శివరాత్రి ఒక్కరోజే కాదు.. ఏ రోజు అయినా శివునికి కుంకుమ సమర్పించకూడదట. కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి.. ఎరుపు రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తారు. శివుడిని పురాణాల్లో విధ్వంసకుడు అని పిలుస్తారు. కాబట్టి శివునిక పూజలో కుంకుమను వినియోగించకుండా నిషేదించారు. పరమేశ్వరునికి విభూది అంటే మహా ఇష్టం కాబ్టటి.. విభూదిని సమర్పించవచ్చు.

తెల్లని పువ్వులు

పురణాల ప్రకారం తెల్లని పువ్వులంటే శివుడికి ఇష్టం ఉండదట. ఒక వేళ పెట్టాల్సి వస్తే.. మల్లెపువ్వులను శివుని దగ్గర పెట్టవచ్చని చెప్తారు. కానీ చంపా, కెన్డా, మొగలిపువ్వులను సమర్పించకూడదట. ఒకవేళ ఈ పువ్వులను పెడ్తే శివుడు శపిస్తాడాని.. అందుకే వాటిని పెట్టకూడదని పండితులు చెప్తారు. మొగలిపువ్వును శివుడు శపించాడని.. అందుకే పూజకు వాటిని వినియోగించరని శాస్త్రాలు చెప్తున్నాయి.

శంఖం

పూజలో శంఖాన్ని వినియోగించవద్దు అంటున్నారు పూజారులు. పురాణాల ప్రకారం శివుడు శంఖచూర్ణుడు అనే రాక్షసుడిని హతమార్చాడని.. అప్పటి నుంచి శంఖం అసురుని చిహ్నంగా పరిగణిస్తారని తెలుస్తుంది. అందుకే శంఖాన్ని శివుని ఆరాధనలో వినియోగించరు. శంఖచూర్ణుడు నారాయణుని భక్తుడు కాబట్టి.. ఆయన పూజలో కచ్చితంగా శంఖం వాయిస్తారు.

ప్రదక్షిణలు

శివలింగం చుట్టూ ప్రదక్షిణలు అస్సలు చేయకూడదంటున్నాయని శాస్త్రాలు. సగం వరకే తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లిపోవాలని దీని సారాంశం. ఒకవేళ తెలియక తిరిగినా.. పూజా ఫలితం దక్కదని పురణాలు చెప్తున్నాయి.

పరమశివుని పూజలో ఏ తప్పులు చేయకూడదో తెలుసుకున్నారు కదా. మీరు కూడా జాగ్రత్తగా పూజకు ఏర్పాట్లు చేసుకుని.. వినియోగించకూడనివి పక్కన పెట్టి.. శివుని అనుగ్రహం పొందండి.

WhatsApp channel

టాపిక్