International Coffee Day: మీకు తెలుసా కొన్ని కాఫీ పొడులు ఈ జంతువుల వ్యర్థాలతో తయారుచేస్తారని?
Costliest Coffee: కాఫీలో వివిధ రకాల కాఫీలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే కాఫీ తాగడమే మానేస్తారేమో. జంతవుల వ్యర్థాలతో చేసే కాఫీ ఖరీదు కూడా చాలా ఎక్కువ.
టీ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా కాఫీ ప్రియులకు కొదవలేదు. కోట్ల మంది కాఫీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. కాఫీ వాసన చూస్తేనే ఎంతో మందికి ఉత్సాహం, ఉత్తేజం వచ్చేస్తోంది. కాఫీ తాగకపోతే విలవిలలాడిపోయేవారు ఎంతో మంది. ఎవరైనా కాఫీ తాగడానికి అలవాటు పడితే, దాన్ని తాగకుండా ఉండలేరు.
కాఫీ బీన్స్ తో రకరకాల కాఫీలను తయారుచేస్తారు. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీ ఒకటుంది. అది చాలా ఖరీదైనది, దీని కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని రకాల కాఫీ పొడులను ఎలా తయారు చేస్తారో తెలిస్తే, మీరు కాఫీ తాగడమే మానేస్తారేమో. కొన్ని కాఫీ పొడులు కొన్ని జంతువుల వ్యర్థాలతో అంటే మలంతో తయారు చేస్తారు. ఈరోజు అక్టోబర్ 1, అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా, జంతువుల మలంతో తయారు చేసిన కాఫీల గురించి తెలుసుకోండి.
1) కోపీ లువాక్ కాఫీ
సివెట్ కాఫీ అనేది ‘ఆసియా పామ్ సివెట్’ అనే జంతువు మలం నుంచి సేకరించిన బీన్స్ నుంచి తయారయ్యే ప్రత్యేక కాఫీ. ఈ జీవి ఇండోనేషియాలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ జంతువులు పండిన కాఫీ చెర్రీలను తింటుంది. ఆపై ఈ కాఫీ కాయలు దాని ప్రేగులలో ఒక ప్రత్యేకమైన కిణ్వ ప్రక్రియకు లోనవుతాయి ఒకటి లేదా రెండు రోజుల తర్వాత అవి మలం రూపంలో బయటకు వస్తాయి. వాటిని సేకరించి శుభ్రపరిచి ప్రాసెస్ చేస్తారు. తరువాత దాంతో కాఫీ పొడి తయారుచేస్తారు. ఆ కాఫీ బీన్స్ కూడా నేరుగా అమ్ముతారు. ఇవి ఖరీదైన కాఫీ గింజలు.
2) బ్లాక్ ఐవరీ కాఫీ
ఏనుగుల మలంతో తయారయ్యే కాఫీ ఇది. ఏనుగు మలం నుండి సేకరించిన కాఫీ బీన్స్ నుండి తయారయ్యే ఈ గింజలు… అత్యంత ఖరీదైనవి. ఏనుగులు నేరుగా చెట్ల నుంచి కాఫీ కాయలను తినవు. వాటిని పెంచేవారు కాఫీ కాయలను ప్రత్యేకంగా తినిపిస్తారు. థాయ్‌లాండ్‌లో ఇలా ఏనుగుల చేత కాఫీ గింజలు తినిపిస్తారు. దాని మలం ద్వారా వచ్చే గింజలను సేకరించి ప్రాసెస్ చేస్తారు. ఈ కాఫీ తాగాలంటే థాయిలాండ్ వెళ్లాల్సిందే. అక్కడ ఇది చాలా ప్రత్యేకమైన కాఫీ.
3) జాకు బర్డ్ పూప్ కాఫీ
బ్రెజిల్ లో అతిపెద్ద కాఫీ ఉత్పత్తి ఇది. అక్కడ అందరూ ఈ కాఫీని తాగడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రత్యేకమైన కాఫీని బ్రెజిలియన్ పక్షుల మలంతో తయారు చేస్తారు. బ్రెజిల్ లో, జాకు అని పిలిచే పక్షులు కాఫీ కాయలను తింటాయి. వాటి మలంలో కాఫీ గింజలు బయటకు వస్తాయి. వాటిని సేకరించి నీటిలో శుభ్రపరుస్తారు. వాటిని కాల్చడం ద్వారా ప్రత్యేకంగా కాఫీ గింజలను తయారు చేస్తారు. ఈ కాఫీ రుచి చాలా బావుంటుంది. ఇది కూడా ఖరీదైన కాఫీ పొడి. దీని రుచి అదిరిపోతుంది.
టాపిక్