New Year Party in Foreign। తక్కువ బడ్జెట్‌‌‌లో న్యూ ఇయర్ వేడుకలకు ఈ ప్ర'దేశాలు' బెస్ట్ ఛాయిస్!-celebrate this new year eve 2023 party outside of india check budget friendly destinations ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  New Year Party In Foreign। తక్కువ బడ్జెట్‌‌‌లో న్యూ ఇయర్ వేడుకలకు ఈ ప్ర'దేశాలు' బెస్ట్ ఛాయిస్!

New Year Party in Foreign। తక్కువ బడ్జెట్‌‌‌లో న్యూ ఇయర్ వేడుకలకు ఈ ప్ర'దేశాలు' బెస్ట్ ఛాయిస్!

HT Telugu Desk HT Telugu
Dec 14, 2022 03:18 PM IST

New Year Party Outside India: తక్కువ బడ్జెట్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు భారతదేశం వెలుపల కొన్ని ఉత్తమ అంతర్జాతీయ గమ్యస్థానాలను ఇక్కడ చూడండి.

Budget Friendly New Year Party Destinations
Budget Friendly New Year Party Destinations (Unsplash)

మరికొద్ది రోజుల్లో ఈ సంవత్సరానికి వీడ్కోలు చెప్పేసి మరొక కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయం ఆసన్నమవుతోంది. మరి మీరు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధంగా ఉన్నారా? గతేడాది కరోనా ఆంక్షలు, భయాల కారణంగా ఉన్న చోటనే మామూలుగా వేడుకలు జరుపుకోవాల్సి వచ్చింది. మరి ఈ ఏడాది నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ఇండియాలో కాకుండా బయట దేశాలకు ఎక్కడికైనా వెళ్దామనుకుంటున్నారా? అయితే బడ్జెట్ సహకరించక ఆగిపోతున్నారా? తక్కువ ఖర్చులోనే భారతదేశం వెలుపల నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు కొన్ని ఉత్తమమైన గమ్యస్థానాలు ఉన్నాయి.

ఈ దేశాలలో కూడా దాదాపు భారతదేశంలో అయ్యేంత ఖర్చుతోనే ఘనంగా వేడుకలు జరుపుకోవచ్చు. అంతేకాకుండా విడుతల వారీగా చెల్లించేందుకు ఎన్నో బ్యాంక్ ఆఫర్లు కూడా ఉంటాయి. మరి అలాంటపుడు వేడుకల విషయంలో రాజీపడటం ఎందుకు? ఈసారి విదేశాలకు వెళ్లి మీ 2022 ఏడాదిని మధురమైన జ్ఞాపకాలతో ముగించండి, కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలకండి.

Budget Friendly New Year Party Destinations-

భారతీయులు నూతన సంవత్సర వేడుకలు చేసుకోవటానికి ఉత్తమ ప్రదేశాలు:

తక్కువ బడ్జెట్ లో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు భారతదేశం వెలుపల కొన్ని ఉత్తమ అంతర్జాతీయ గమ్యస్థానాలను ఇక్కడ చూడండి.

1. బ్యాంకాక్, థాయిలాండ్:

న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగే ప్రదేశాలలో బ్యాంకాక్ ఒకటి. భారతదేశం సహా వివిధ ప్రాంతాల నుండి ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వస్తారు. చాలా మంది తమ గోప్యతను ఆస్వాదించడానికి ఒంటరిగా కూడా ఇక్కడకు వస్తారు. ఇది బ్యాచిలర్ పార్టీలకు స్వర్గం లాంటిది. హైదరాబాద్ నుంచి మీరు బ్యాంకాక్ సుమారు రూ. 15,000లలో వెళ్లిపోవచ్చు.

2. దుబాయ్, UAE:

విలాసం, వినోదం, విస్మయపరిచే వేడుకలకు దుబాయ్ నిర్వచనం. ఇది భారతదేశం వెలుపల బడ్జెట్ ధరలో ఉన్న ఉత్తమ గమ్యస్థానాలలో ఇది ఒకటి. మీరు నూతన సంవత్సరాన్ని జరుపుకునేటప్పుడు దుబాయ్‌లో ఒక రాత్రి గొప్ప జీవితం, ఆహారం, సంస్కృతిని ఆస్వాదించవచ్చు. ఇతర ఆసియా దేశాలలో లాగా ఇక్కడ మీకు ఎక్కువ ఖర్చులు ఉండవు. హైదరాబాద్ నుండి విమాన ఛార్జీలు రూ.18000 నుండి ప్రారంభమవుతాయి. అట్లాంటిస్ ది పామ్, బుర్జ్ అల్ అరబ్, బుర్జ్ ఖలీఫా, పామ్ జుమేరా వేడుకలకు కేంద్రంగా ఉన్నాయి.

3. కొలంబో, శ్రీలంక:

ఇండియాకు దగ్గరగా ఉన్న ద్వీప దేశం శ్రీలంక. ఈ దేశ రాజాధాని కొలొంబోలో న్యూ ఇయర్ వేడుకలు ఉత్సాహంగా సాగుతాయి. అందమైన ప్రకృతి దృశ్యాలు, భిన్న సంస్కృతులు, అద్భుతమైన సీఫుడ్, బీచ్ సైడ్ రిసార్టులు మొదలైనవి అన్నీ కొలంబోలో నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి ప్రతి కారణాన్ని అందిస్తాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి హైదరాబాద్ నుంచి విమాన ఛార్జీలు ఒక్కొక్కరికి రూ. 17000 నుంచి ప్రారంభమవుతున్నాయి.

4. మాల్దీవులు:

మాల్దీవుల్లోని ప్రశాంతమైన బీచ్‌లు మిమ్మల్ని స్వేచ్ఛగా నూతన సంవత్సరాన్ని ఆస్వాదించడానికి కావలసినవి అన్నీ అందిస్తాయి. కొత్తగా పెళ్లైన జంటలు ఎక్కువగా ఇక్కడికి వెళ్ళేందుకు ఇష్టపడతారు. భారతీయ పర్యాటకులందరికీ ఇది జీవితకాల అనుభవం. ఖరీదైన, సరసమైన ధరల్లో ద్వీప రిసార్ట్‌లను ఇక్కడ రెంట్ తీసుకోవచ్చు. ఈ సీజన్ లో విమాన ఛార్జీలు రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతున్నాయి.

5. బాలి, ఇండోనేషియా:

ఇండియా వెలుపల నూతన సంవత్సర వేడుకలను ఎంజాయ్ చేయాలకుంటే ఇండోనేషియా కూడా బడ్జెట్ ధరలో ఒక్క అద్భుతమైన ప్రదేశం. మీరు ప్రశాంతంగా గడపాలనుకున్నా, అందరితో పాటు వేడుకల్లో పాల్గొనాలనుకున్నా బాలి మీకు అన్ని ఆప్షన్స్ ఇస్తుంది. న్యూ ఇయర్ వంటి రద్దీ కాలంలో విమాన ఛార్జీలు రూ. 20 వేల నుంచి ప్రారంభమవుతాయి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్