Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు కొత్త పీఎస్ఏ ప్రమాణాలు.. అపోలో హాస్పిటల్స్ సరికొత్త రికార్డు-apollo hospital study on prostate cancer screening for indian men heres details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు కొత్త పీఎస్ఏ ప్రమాణాలు.. అపోలో హాస్పిటల్స్ సరికొత్త రికార్డు

Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు కొత్త పీఎస్ఏ ప్రమాణాలు.. అపోలో హాస్పిటల్స్ సరికొత్త రికార్డు

Anand Sai HT Telugu
Jan 12, 2024 03:45 PM IST

Prostate Cancer : ప్రోస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్‌ విషయంలో అపోలో హాస్పిటల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. PSA ప్రమాణాల మీద అధ్యయనం చేసింది.

అపోలో వైద్యులు బృందం
అపోలో వైద్యులు బృందం

మన దేశంలో పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణకు నిర్వహించే పీఎస్ఏ (ప్రొస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ పరీక్ష) ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు.. భారత దేశ పీఎస్ఏ ప్రమాణాలకు భిన్నంగా ఉన్నట్లు అపోలో హాస్పిటల్స్ తాజా అధ్యయనంలో తేలింది. అపోలో హైదరాబాద్ కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ అడ్డాల నేతృత్వంలో వివిధ వయసులకు చెందిన సుమారు లక్ష మందికి పైగా ఆరోగ్యవంతమైన పురుషులపై జరిపిన అధ్యయనంలో పీఎస్ఏ ప్రమాణాలకు సంబంధించి సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

పీఎస్ఏ అనేది ప్రోస్టేట్ క్యాన్సర్ కు ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్స పర్యవేక్షణ కోసం ప్రపంచవాప్తంగా నిర్వహిస్తున్న రక్త పరీక్ష. 1993 నుండి సాధారణ పీఎస్ఏ విలువల కోసం అంతర్జాతీయ నిబంధనలు యుఎస్ఏ నుండి వచ్చిన ఒక అధ్యయనం ఆధారంగా రూపొందించారు. భారతదేశంలో కూడా అవే పీఎస్ఏ ప్రమాణాలు పాటిస్తున్నారు. పాశ్చాత్య దేశాల పీఎస్ఏ ప్రమాణాలు మన దేశ పీఎస్ఏ ప్రమాణాలకు సరిపోవని చాలా సందర్భాల్లో తేలాయి. అపోలో హాస్పిటల్స్ నిర్వహించిన శాస్త్రీయ అధ్యయనంలో భారతదేశంలో పీఎస్ఏ విలువలు విభిన్నంగా ఉన్నాయని వెల్లడైంది.

భారతీయ యువకులలో ప్రోస్టేట్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడంలో కొత్త పీఎస్ఏ ప్రమాణాలు సులభతరం కానున్నాయి . కొత్త ప్రమాణాలను భారతీయ జనాభాకు ప్రత్యేకమైనవి. దేశ వ్యాప్తంగా ఉన్న అపోలో ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నోస్టిక్స్ నెట్‌వర్కులలో నిర్వహించే పీఎస్ఏ పరీక్షలలో ఈ కొత్త ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటామని అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. వివిధ వయసుల వారి కోసం విభిన్నమైన పీఎస్ఏ ప్రమాణాలను కనుగొన్నారు. ఇది అంతర్జాతీయ పీఎస్ఏ ప్రమాణాల నిబంధనలకు భిన్నంగా ఉన్నాయి. యువకులలో ముందుగా ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తించడంలో సహాయపడతాయి.

అపోలో హాస్పిటల్స్ కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ అడ్డాల మాట్లాడుతూ తమ అధ్యయనం, భారతదేశంలోనే అతిపెద్దదని పేర్కొన్నారు. భారతీయ జనాభాకు అనుగుణంగా వయస్సు ఆధారంగా నిర్దిష్ట పీఎస్ఏ ప్రమాణాలను తిరిగి మూల్యాంకనం చేస్తుందని తెలిపారు. తాము లక్ష మంది ఆరోగ్యవంతమైన పురుషుల నుండి సేకరించిన నమూనాల ద్వారా అధ్యయనం నిర్వహించామన్నారు .

రోగనిర్ధారణకు పీఎస్ఏ నూతన ప్రమాణాలను గుర్తించామని సంజయ్ చెప్పారు. తమ అధ్యయనం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ చివరి దశలలో ఉన్నవారికి కూడా చికిత్సను అందించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ అధ్యయనం కీలకమైన పరిణామం అని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు మరింత మెరుగైన చికిత్సను అందిచగలుగుతామని తెలిపారు.

అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. అపోలో హాస్పిటల్ నిర్వహించిన ఈ అధ్యయనం భారతదేశంలోని ప్రోస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ, చికిత్సలో కీలక మార్పులను తీసుకువస్తుందని వ్యాఖ్యానించారు. ప్రోస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులు ఆ మహమ్మారిని జయించడంలో ఎంతో తోడ్పడుతుందని చెప్పారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్ కొత్తగా ప్రచురించిన డేటాకు అనుగుణంగా రిఫరెన్స్ విలువలను ఇప్పటికే మార్చామని, రానున్న మూడు నెలలలో అపోలో హాస్పిటల్స్ అన్నింటిలో దశలవారీగా మారుస్తామని తెలిపారు.

అపోలోలో సరికొత్త BK 5000 అల్ట్రా సౌండ్ సిస్టంను అందుబాటులోకి తెచ్చామని సంగీతా రెడ్డి చెప్పుకొచ్చారు. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ ను గుర్తించడంలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డయాగ్నస్టిక్ సిస్టం అని, దీని ద్వారా ప్రోస్టేట్ బయోప్సీ విధానం సులభతరం అవుతుందని వివరించారు.

WhatsApp channel