Balakrishna: విక్రమసింహభూపతి - ఇరవై రెండేళ్ల క్రితమే ఆగిపోయిన బాలకృష్ణ, రోజా పాన్ ఇండియన్ మూవీ
Balakrishna Vikramasimha Bhupathi: బాలకృష్ణ కెరీర్‌లో షూటింగ్ పూర్తికాకుండానే మధ్యలోనే ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీస్‌లో విక్రమసింహభూపతి ఒకటి. కోడి రామకృష్ణ దర్శకత్వంలో 2001లో మొదలైన ఈ జానపద సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
Balakrishna Vikramasimha Bhupathi: బాలకృష్ణ కెరీర్‌లో షూటింగ్ పూర్తికాకుండానే అర్థాంతరంగా ఆగిపోయిన సినిమాలు పదికిపైనే ఉన్నాయి. మహాభారతం ఆధారంగా స్వీయ దర్శకత్వంలో నర్తనశాల సినిమాను తెరకెక్కించాలని బాలకృష్ణ కలలు కన్నారు. కొద్ది రోజులు ఈ పౌరాణిక సినిమా షూటింగ్ కూడా జరిగింది. కానీ సౌందర్య మరణంతో నర్తనశాల ఆర్థాంతరంగా ఆగిపోయింది. తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలని బాలకృష్ణ ఎంత ప్రయత్నించిన కుదరలేదు. నర్తనశాల మాదిరిగానే బాలకృష్ణ మరో భారీ బడ్జెట్ మూవీ విక్రమసింహ భూపతి కూడా సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయింది.
బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్...
మంగమ్మగారి మనవడు, ముద్దులమావయ్య, మువ్వ గోపాలుడు సినిమాలో టాలీవుడ్ హీరో బాలకృష్ణ, డైరెక్టర్ కోడి రామకృష్ణ సక్సెస్‌ఫుల్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరు కలిసి చేసిన సినిమాలన్నీ హిట్స్‌గానే నిలిచాయి. బాలకృష్ణ, కోడి రామకృష్ణ కలయికలో ఓ భారీ జానపద సినిమాను తెరకెక్కించాలని భార్గవ్ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి ప్లాన్ చేశారు.
విక్రమసింహ భూపతి...
విక్రమసింభ భూపతి పేరుతో సినిమాను అనౌన్స్ చేశారు. 2001లో ఈ జానపద సినిమాను అనౌన్స్‌చేశారు. యోధుడి గెటప్‌లో బాలకృష్ణ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాయి. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో మహారాజుగా, యోధుడిగా కనిపించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రోజా, పూజా బత్రాలను హీరోయిన్లుగా తీసుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజా, సినిమాటోగ్రాఫర్‌గా కబీర్ ఖాన్ ఎంపికయ్యారు.తెలుగుతో పాటు తమిళంలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. సగానికిపైగా షూటింగ్ పూర్తయిన తర్వాత విక్రమసింహభూపతి ఆగిపోయింది.
నిర్మాత గోపాలరెడ్డితో బాలకృష్ణకు వచ్చిన విభేదాలే అందుకు కారణమని అప్పట్లో వార్తలు వినిపించాయి. తిరిగి ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలని గోపాలరెడ్డితో పాటు అతడి తనయుడు భార్గవ్ ప్రయత్నించారు. కానీ వారి మరణంతో విక్రమసింహ భూపతికి పూర్తిగా ప్యాకప్ పడింది.
ఆ తర్వాత సగభాగాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలొచ్చిన అది పుకారుగానే మిగిలిపోయింది.
బాబీతో బాలకృష్ణ...
గత ఏడాది భగవంత్ కేసరితో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. భగవంత్ కేసరిలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య ఫేమ్ బాబీతో బాలకృష్ణ ఓ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 109వ సినిమా ఇది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులు అమ్ముడుపోయాయి. రికార్డు ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.బాలకృష్ణ, బాబీ మూవీ దసరాకు రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత అఖండ సీక్వెల్‌లో బాలకృష్ణ నటించబోతున్నాడు. మంచు విష్ణు కన్నప్పలో బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
టాపిక్